CM Jagan Helicopters : సీఎం జగన్ హెలికాప్టర్ల వ్యవహారం ఈసీ వద్దకు-నగదు తరలించే ప్రయత్నమంటూ రఘురామ ఫిర్యాదు
CM Jagan Helicopters : సీఎం జగన్ భద్రతా కారణాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు అద్దకు తీసుకుంది. ప్రజాధనంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఈసీకి ఫిర్యాదు చేశారు ఎంపీ రఘురామ.
CM Jagan Helicopters : సీఎం జగన్ కు ప్రాణహాని ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు(CM Jagan Helicopters) సిద్ధం చేసింది. ఒకటి విజయవాడలో, మరొకటి విశాఖలో ఉంచాలని ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ ధనంలో రాజకీయ ప్రచారం చేస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు(MP Raghurama Krishna Raju) ఈసీకి ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ధనంలో రెండు హెలికాప్టర్లు ఏర్పాటు చేశారని, ఈ విషయంపై గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారని ఎంపీ రఘురామ సీఈసీకి(CEC)తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఖర్చుతో ఇలా హెలికాప్టర్ల ఏర్పాటు చేయడంపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. రెండు హెలికాప్టర్లకు నెలకు రూ.3.82 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందని ఎంపీ రఘురామకృష్ణ రాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం
ఎన్నికల ఖర్చు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ(Ysrcp) హెలికాప్టర్ డ్రామాలాడుతుందని రఘురామ విమర్శించారు. వ్యక్తిగత భద్రత కారణాలుగా చూపుతూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు హెలికాప్టర్లలో భారీగా నగదును తరలించేలా జగన్ యత్నించే అవకాశం ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ఖర్చుతో ఎన్నికల ప్రచారం చేయడాన్ని ఈసీ అడ్డుకోవాలని రఘురామ కోరారు. హెలికాప్టర్లను కూడా తనిఖీలు చేసేలా అధికారులను నియమించాలని విజ్ఞప్తి చేశారు.
దిగిపోయే ముందు ఖజానా ఖాళీ
హెలికాప్టర్ల వ్యవహారంపై జనసేన(Janasena) పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రజాధనంతో సీఎం జగన్ హెలికాప్టర్ ఎలా సమకూర్చుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగిపోయే ముందు జగన్ ఖజానా ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఎన్నికల ప్రచారం కోసం ప్రజా ధనం ఎలా వాడతారని ప్రశ్నించారు. హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
రెండు హెలికాప్టర్లు లీజుకు
సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనల కోసం 2 హెలికాప్టర్లను లీజుకు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. లీజు ప్రాతిపదికన గ్లోబర్ వెక్ట్రా సంస్థ నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. కొత్తగా అద్దెకు తీసుకున్న హెలికాప్టర్లను విజయవాడ, విశాఖలో ఉంచాలని నిర్ణయించారు. 2 ఇంజిన్లు కలిగిన భెల్ తయారీ హెలికాప్టర్లు లీజుకు తీసుకోనున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కో హెలికాప్టర్‌కు నెలకు రూ.1.91 కోట్లు లీజు చెల్లించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వానికి ప్రతిపాదించడంతో కొత్త వాటిని సమకూర్చుకోవాలని నిర్ణయించారు. మరోవైపు సీఎం జగన్‌కు సంఘవిద్రోహుల నుంచి ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ డీజీ నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం సీఎం జగన్‌కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నందున, ముప్పుపై ఇంటెలిజెన్స్ నివేదిక నేపథ్యంలో కొత్త హెలికాఫ్టర్లను సమకూర్చుకుంటున్నారు. కొత్తగా సమకూర్చుకునే హెలికాఫ్టర్లను ఒకటి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో, మరొకటి విశాఖపట్నం విమానాశ్రయంలో అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం వినియోగిస్తున్న హెలికాప్టర్ 2010 నుంచి వినియోగంలో ఉన్నందున దానిని మార్చాలని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ ప్రతిపాదించింది.