CM Jagan in Guntur : వాలంటీర్లు నా సైన్యం, మంచి జరిగితేనే నాకు ఓటేయ్యండి - సీఎం జగన్
Awards to AP Volunteers: ప్రభుత్వ సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం… వలంటీర్ల సేవలను కొనియాడారు.
CM Jagan in Guntur District :వాలంటీర్లే తన సైన్యమన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను సత్కరిస్తూ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సభను నిర్వహించారు. ఇందుకు హాజరైన ముఖ్యమంత్రి జగన్... వాలంటీర్ల సేవలను కొనియాడారు. ప్రజలకు సేవలు చేసే వాలంటీర్లే రేపు కాబోయే లీడర్లు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ తులసి మొక్కవనం లాంటిందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు సేవలు చేస్తున్న వీరు వలంటీర్లు కాదు.. సేవా హృదయాలని చెప్పారు. 2 లక్షల 60 వేల మంది వలంటీర్లు తన సైన్యమన్న సీఎం జగన్… గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీ.. సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందన్నారు.
“పేదలకు సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయి. మన వ్యవస్థల ద్వారా ప్రతీ గ్రామంలో స్కూళ్లు, ఆస్పత్రులు మారాయి. ఇంటింటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సురక్ష ప్రవేళపెట్టాం. వలంటీర్లు సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి పెన్షన్ అందిస్తున్నారు గడప గడపకు వెళ్లి పెన్షన్ ఇస్తున్న వ్యవస్థ ఎక్కడా లేదు.వివక్ష లేకుండా ప్రతీ పేదవాడికి పథకాలు అందిస్తున్నాం. వలంటీర్లు రాబోయే రోజుల్లో భావి లీడర్లు అవుతారు. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్క. చంద్రబాబు పాలన విషవృక్షం, మన పాలన కల్పవృక్షం. మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క. మన పథకాలకు వాలంటీర్లు బ్రాండ్ అంబాసిడర్లు” అని సీఎం జగన్ కామెంట్స్ చేశారు.
చంద్రబాబుపై ఫైర్
CM Jagan On Chandrababu: ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం జగన్. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని దుయ్యబట్టారు. చంద్రబాబు వస్తే.. చంద్రముఖీలు వస్తాయంటూ సెటైర్లు విసిరారు. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా అసత్యాలపై యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సిద్ధమంటూ ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని కోరారు. 58 నెలల పాలనలో వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు. అందరూ ఓవైపు ఉంటే… తాను మాత్రమే ఒక్కడినేనని అన్నారు. కానీ తన వెనక పెద్ద సైన్యం ఉందనే విషయం వాళ్లకు తెలియటం లేదన్నారు. ప్రసంగం అనంతరం సీఎం జగన్ వంటీర్లకు పురస్కారాలు అందజేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 875 మందికి సేవావజ్ర, 4,150 మందికి సేవారత్న, 2,50,439 మందికి సేవామిత్ర అవార్డుల ప్రదానం చేయనున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లకు ప్రభుత్వం ఏటా నగదు పురస్కారాలు అందిస్తోంది. వరుసగా నాలుగో ఏడాదీ వాలంటీర్లకు ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఈ నెల 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభా నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.