CM Jagan On CBN, Pawan: పొరపాటు జరిగితే పేదల్ని బతకనివ్వరన్న సిఎం జగన్మోహన్ రెడ్డి-jaganmohan reddy said that there is a war between the poor and the feudal lords in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan On Cbn, Pawan: పొరపాటు జరిగితే పేదల్ని బతకనివ్వరన్న సిఎం జగన్మోహన్ రెడ్డి

CM Jagan On CBN, Pawan: పొరపాటు జరిగితే పేదల్ని బతకనివ్వరన్న సిఎం జగన్మోహన్ రెడ్డి

B.S.Chandra HT Telugu
May 12, 2023 12:58 PM IST

CM Jagan On CBN, Pawan: రాష్ట్రంలో కులాల యుద్దం జరగట్లేదని, పేదలకు పెత్తందారులకు మాత్రమే యుద్ధం జరుగుతోందని, పేదలు ఓ వైపు పెత్తందారులు మరోవైపు ఉన్నారని,ఏ చిన్న పొరపాటు జరిగినా పేదలు రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదని సిఎం జగన్ హెచ్చరించారు.

ఏపీ సీఎం జగన్
ఏపీ సీఎం జగన్

CM Jagan On CBN, Pawan: రాష్ట్రంలో కులాల యుద్దం జరగట్లేదని, పేదలకు పెత్తందారులకు యుద్ధం జరుగుతోందని, పేదలు ఓ వైపు, పెత్తందారులు మరోవైపు ఉన్నారని, ఏ చిన్న పొరపాటు జరిగినా ఇక పేదలు రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉండదని, పేదల్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేస్తారని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. పేదల జీవితం ఎలా బాగుపడాలనే ఆలోచనతోనే తాను అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. కావలిలో జరిగివన చుక్కల భూములపై నిషేధం ఎత్తివేత కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు.

పేదలకు డబ్బు పంచడం బాధ్యత రాహిత్యమని ప్రచారం చేస్తున్నారని, టీడీపీతో పాటు దాని తోడు దొంగలు ప్రభుత్వంపై ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు దండగ అని గతంలో ఐఏఎస్‌లతో ఇంటర్వ్యూలు చేసి ప్రచురించారని, చంద్రబాబుకు ఓటు వేస్తే పేదలకు స్కీములు రావని జనం గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే స్కీములు ఎత్తేస్తారని జగన్మోహన్‌ రెడ్డి హెచ్చరించారు. టీడీపీ వస్తే దోచుకో పంచుకో తినుకో స్కీమ్ అమలు చేస్తారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏమి జరుగుతుందో ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.

రాత్రికి రాత్రి పుట్టుకొచ్చే ఆర్తిక వేత్తలు….

రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని విమర్శించిన ఛార్టెర్డ అకౌంటెంట్ జీవీరావుపై సిఎం మండిపడ్డారు. జీవీ రావు ఎవరా అని ఆరా తీస్తే అతని సీఏ ప్రాక్టీస్ రద్దు చేశారని, అలాంటి దానయ్యకు కోటు తొడిగి ఆర్దిక నిపుణుడిగా చూపించి, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఉండకూడదని టీడీపీ చెప్పించిందని సిఎం ఆరోపించారు. రాష్ట్రం దివాళా తీస్తోందని, అప్పుల పాలైందని ఆందోళన రేకెత్తిస్తున్నారని విమర్శించారు. టీడీపీకి అనుకూలంగా రాత్రికి రాత్రి ఆర్థిక వేత్తలు పుట్టుకొస్తారని, పురుగులు పట్టిన బుర్రల నుంచి పుట్టుకొస్తారని, గూగుల్‌లో వెదికితే సినిమా రికార్డులకు డాన్సులు వేసుకునే వారిని ఆర్ధికవేత్తలుగా చూపిస్తున్నారని ఎధ్దేవా చేశారు.

మేధావుల సంఘం, సర్పంచుల సంఘం అంటూ రకరకాల పేర్లు పెట్టి వారితో అబద్దాలు చెప్పించి ప్రజల్ని మోసం చేయడానికి వాడుకుంటారని సిఎం విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక పత్రికలు, టీవీల మనసులో ఉన్న మాటల్ని అలాంటి వారితో చెప్పించి వాటిని ప్రజలు అనుకుంటున్నట్లు ప్రచారం చేయిస్తారని చెప్పారు. వాటిని చూసి ప్రజలు మోసపోవద్దని జగన్ సూచించారు.

మోసం, పెత్తందారి మనస్తత్వంతోనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పేదలకు సంక్షేమం, ఇళ్లు ఉచితంగా ఇస్తామన్నా, ఇంగ్లీష్ మీడియం చదువులన్నా సహించలేకపోయారని, అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తున్నా కడుపులో మంటతో రగిలిపోతున్నారని, కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.జీవీ రావు లాంటి జోకర్లను తీసుకొచ్చి ఆర్దిక నిపుణులుగా తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

15-20ఏళ్లలో సమూల మార్పు….

మరో 15-20ఏళ్లలో రాష్ట్రంలో ప్రతి పేద పిల్లాడు ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాడని, ప్రతి పిల్లాడు ఆంగ్లంలో నైపుణ్యం సాధిస్తారని, డ్రైవర్‌ ఉద్యోగం చేసే వారు కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారని, అద్భుతమైన నైపుణ్యాలతో ఆంధ్ర రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారుతుందని చెప్పారు. జర్మనీకి స్కిల్డ్ వర్క్‌ ఫోర్స్ లేకపోవడంతో జర్మనీ ఇబ్బందులు పడుతోందని, నైపుణ్యం ఉన్న వారు వెంటనే రారని, మానవ వనరుల మీద పెట్టుబడులు పెట్టడం ద్వారా నిపుణులైన మానవ వనరుల్ని రాష్ట్రంలో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.ప్రతిపక్షాలు రానున్న రోజుల్లో మరిన్ని అబద్దాలు మోసాలు చూస్తారని, ప్రతి ఇంట్లో మంచి జరిగిందో లేదో చూసుకుని, తనకు ప్రజలు సైన్యంగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

చుక్కల భూములపై ఆంక్షలు ఎత్తివేత….

రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు చేస్తూ దాదాపు రూ. 20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంపూర్ణ హక్కు కల్పిస్తూ కావలిలో సిఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

చుక్కల భూములకు రిజిస్ట్రేషన్ జరగకుండా 22ఏ జాబితాలో చేర్చి నిషేధం విధించడం ద్వారా టీడీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేశారని సిఎం జగన్ ఆరోపించారు. 22ఏ జాబితాలో భూముల్ని చేర్చడంతో రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. పిల్లల పెళ్లిళ్లు, విద్యా, వైద్యానికి వాటిని అమ్ముకోడానికి వీల్లేకుండా పోయిందన్నారు. చుక్కల భూముల యజమానులకు ఊరట ఇచ్చేలా ఆంక్షలు తొలగిస్తున్నామని చెప్పారు.

ప్రకాశం, కడప, చిత్తూరు, అన్నమయ్యతో పాటు అన్ని జిల్లాల్లో 2.06లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. రైతుల కష్టాలను చూసి, విని, నేను విన్నాననే హామీతో కోర్టులతో పని లేకుండా, ఒక్క రుపాయి ఖర్చు లేకుండా, ఒక్క రుపాయి లంచం ఇవ్వాల్సిన పని లేకుండా భూముల్ని గుర్తించి 22ఏ నుంచి వ్యవసాయ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగించి రెవిన్యూ రికార్డుల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు భూముల మీద పూర్తి హక్కులు కల్పిస్తున్నట్లు చెప్పారు.

రైతుల మేలు కోసమే నిర్ణయం….

రైతుల గురించి పేదల గురించి మనసు పెట్టి తమ ప్రభుత్వం ఆలోచిస్తుందని, రైతులకు మంచి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 2.80లక్షల ఎకరాల భూమిని గిరిజనులకు పంచామని, లక్షా 20వేల మంది గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు మంజూరు చేశామన్నారు.

చుక్కల భూముల మాదిరే షరతులతో కూడిన 22వేల మందికి రైతులకు మంచి జరిగేలా 35వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు. భూముల సమస్యల పరిష్కరించడానికి, గ్రామాల్లో వివాదాల్లో ఉన్న వ్యవస్థలకు పరిష్కారం చూపించేలా సమగ్ర భూ సర్వే నిర్వహించినట్లు చెప్పారు.

దేశంలో ఎక్కడ జరగని విధంగా 17,476 రెవిన్యూ గ్రామాల్లో పూర్తిగా భూ సర్వే చేపట్టామని, ఇప్పటికే 2వేల గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తైందని, పత్రాలు అంద చేశారన్నారు. సుమారు 7లక్షల భూ హక్కు పత్రాలను రైతులకు అందచేశారని, సరిహద్దు రాళ్లను ప్రతి ఊరిలో, గ్రామంలో రైతులకు అంద చేశారని చెప్పారు.

మే20 నాటికి 2వేల గ్రామాల్లో సమగ్ర సర్వే పూర్తవుతుందని చెప్పారు. ప్రతి రెండు నెలలకు 2వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. రైతులకు మంచి జరగడానికి ఆ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.

రైతు సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, మధ్య వర్తుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఎంఎస్‌పసి లేని పంటల్ని కూడా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఓర్వలేని రాజకీయాలు….

రైతుల మనసు కష్టం తెలిసిన ప్రభుత్వంగా తాము పనిచేస్తున్నట్లు చెప్పారు. ఓర్వలేని రాజకీయాలు కళ్ల ముందు జరుగుతున్నాయని సిఎం చెప్పారు. రైతులకు జరుగుతున్న మంచి కళ్లెదుట కనిపిస్తోందని, దళారులు లేకుండా ఆర్బీకేలు కొనుగోలు చేసి 21రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నారని, కనీస గిట్టుబాటు ధర వస్తోందని, అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఎవరు ఇబ్బంది పెట్టినా వారిపై రెండు లక్షల జరిమానా విధిస్తున్నామని గుర్తు చేశారు.

రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, పంట నష్టపోయినా, ధాన్యం తడిచినా, రంగు మారినా ఆదుకుంటామని చెబుతున్న ప్రభుత్వం తమదన్నారు. ఐదేళ్లు పాలించి సగటున ప్రతి ఏటా 300మండలాల్లో కరువు ఉన్నా, రైతుల్ని గాలి వదిలేసిన చంద్రబాబు, బాబుకు మద్దతు ఇచ్చే దత్తపుత్రుడు రైతు బాంధవుల వేషం వేసి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.

బాబు ఓవైపు ప్యాకేజీ స్టార్ మరోవైపు …

చంద్రబాబు,పవన్‌కు రావణసైన్యంలో భాగంగా పత్రికలు, టీవీలు సుర్పణక మాదిరి దొంగ ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కావడం కోసమే 2014ఎన్నికలకు ముందు 87,612కోట్ల రుపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడని ఆరోపించారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని చెప్పి సున్నా వడ్డీ ఇస్తానని మోసం చేశాడన్నారు.కేవలం రూ.15వేల కోట్లు మాత్రం ఇచ్చినా నెత్తిన పెట్టుకుని మోసం చేశాడన్నారు.

వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఓవైపు, బాబు రాసే స్క్రిప్ట్‌ ప్రకారం పొలిటికల్ యాక్షన్ చేస్తూ, ప్యాకేజీ తీసుకునే ప్యాకేజీ స్టార్ మరోవైపు, వీరిద్దరి డ్రామా రక్తి కట్టించడానికి మీడియా మరోవైపు ఉన్నాయని విమర్శించారు. చంద్రబాబు, పవన్ వస్తే తప్ప కొనుగోలు చేయలేదనే మాటల్లో నిజం ఎంత ఉందో రైతలకు తెలుసన్నారు.

ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వం కనిపించినా, వారు రావడం వల్లే కొంటున్నారని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దేశంలో రూ.2.10లక్షల కోట్ల రుపాయలు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా బదిలీ జరిగిందని గుర్తు చేశారు.లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందుతూ ఉన్నాయన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి కావాలి పర్యటనలో స్థానిక ఎమ్మెల్యే కోరిన పలు పథకాలకు ముఖ్యమంత్రి అమోదం తెలిపారు.

Whats_app_banner