MP Raghurama Resigns Ysrcp : వైసీపీకి గుడ్ బై, ఎట్టకేలకు ఎంపీ రఘురామ రాజీనామా
MP Raghurama Resigns Ysrcp : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
MP Raghurama Resigns Ysrcp : ఇన్నాళ్లు పార్టీలోనే ఉంటూ వైసీపీని విమర్శిస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు(MP Raghurama Krishna Raju).... ఎట్టకేలకు ఆ రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రమే రాజీనామా(Resigns) చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎంపీగా కొనసాగుతానన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సాపురం పోటీ చేసి గెలిచిన రఘురామకృష్ణరాజు...కొద్ది కాలానికే పార్టీతో విభేదించారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపించారు.
రచ్చబండతో విమర్శలు
ఎంపీ రఘురామ కృష్ణరాజు... ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా అధికార వైసీపీలో ఈ పేరు తెలియని వాళ్లుండరు. ఎందుకంటే సమస్య ఏదైనా రచ్చబండ అంటూ వైసీపీ లక్ష్యంగా విమర్శలు చేయడమే ఆయన స్పెషల్. సీఎం జగన్ పేరు చెబితే చాలు రఘురామకృష్ణరాజుకు ఎక్కడలేని తిట్లదండకం గుర్తొస్తుంది. వైసీపీ నుంచి గెలిచిన రఘురామ... కొన్నాళ్లకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి విమర్శలు స్టార్ట్ చేశారు. అయితే పార్టీ సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేయలేదు. రెబల్ ఎంపీగా ఉంటూ పార్టీ విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలపై దిల్లీ వేదిక రచ్చబండ అంటూ రచ్చ చేసేవారు. దీంతో ఏపీ ప్రభుత్వం సీఐడీని రంగంలోకి దించి అరెస్టు చేయించింది. ఆ తర్వాత కోర్టుకు నడవలేని పరిస్థితిలో వచ్చిన ఆయన... సీఎం జగన్ సీఐడీని అడ్డుపెట్టుకుని తనను హింసించారని కోర్టుకు తెలిపారు. కోర్టు బెయిల్ తో బయటపడ్డ ఆయన... ఇక అప్పటి నుంచి మరింత రెచ్చిపోయారు. ప్రతీ రోజు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వంపై, ముఖ్యంగా వైసీపీపై విరుచుకుపడుతుంటారు. 2019లో ఎంపీగా ఎన్నికైన రఘురామ... సొంత నియోజకవర్గంలో ఉన్నది కాస్త తక్కువే. దాడులకు భయపడో మరేకారణాలతోనో ఆయన దిల్లీకే పరిమితం అయ్యారు.
ప్రజాతీర్పునకు సమయం వచ్చింది
వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ మరోసారి ఆ పార్టీపై విమర్శలు చేశారు. తనను పార్లమెంటరీ సభ్యత్వం నుంచి అనర్హులుగా చేయడానికి మొహమ్మద్ గజినీలా చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదన్నారు. తనను దురుద్దేశపూర్వకంగా వేధించినా, క్రూరమైన చర్యలకు పాల్పడినా...గత 3.5 ఏళ్లుగా నర్సాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేశానన్నారు. ప్రజా శ్రేయస్సు కోసమే వైసీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. ప్రజల తీర్పును కోరాల్సిన సమయం వచ్చింది కాబట్టి, రాజీనామా మన ఇద్దరికీ ఉన్న అసంబద్ధమైన అనుబంధం నుంచి ఒక్కసారైనా విముక్తి చేస్తుందని రఘురామ సీఎం జగన్ కు రాసిన లేఖలో తెలిపారు.