తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pm Modi Ap Tour: నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన, రాజమండ్రి, అనకాపల్లిలో సభలు, ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం

PM Modi AP Tour: నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన, రాజమండ్రి, అనకాపల్లిలో సభలు, ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం

Sarath chandra.B HT Telugu

06 May 2024, 12:15 IST

google News
    • PM Modi AP Tour: ప్రధాని మోదీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం  మధ్యాహ్నం రాజమహేంద్రవరం వేమగిరిలో  ప్రధాని సభ జరుగుతుంది. సాయంత్రం అనకాపల్లి సభలో పాల్గొంటారు. 
నేడు ఏపీలో బహిరంగ సభల్లో పాల్గొనున్న ప్రధాని మోదీ
నేడు ఏపీలో బహిరంగ సభల్లో పాల్గొనున్న ప్రధాని మోదీ (PTI)

నేడు ఏపీలో బహిరంగ సభల్లో పాల్గొనున్న ప్రధాని మోదీ

PM Modi AP Tour: ప్రధాని మోదీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ కూటమి తరపున మోదీ ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో ఎన్టీఏ కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు అనకాపల్లి బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. రాజమండ్రి, అనకాపల్లి సభలకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ హాజరు కానున్నారు.

ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ఎన్డీఏ కూటమి తరపున ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. సోమవారం రాజమండ్రిలో బీజేపీ అగ్రనేతలతో కలిసి ప్రధాని మోదీ బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నారు.

కడియం మండలం వేమగిరిలో జరిగే సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కూడా ఈ భేటీకి హాజరు కానున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరిన తర్వాత బీజేపీతో కలిసి చిలకలూరిపేటలో సభను నిర్వహించారు. రెండో సభను రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నారు.

రాజ మహేంద్రవరం లోక్‌సభకు బీజేపీ తరపున పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. దీంతో వేమగిరి సభకు ప్రధాని మోదీ రానుండడంతో ఆసక్తి పెరిగింది. చిలకలూరి పేట సభలో ప్రధాని మోదీ రాజకీయంగా ఎలాంట వ్యాఖ్యలు చేయలేదు. దీంతో కూటమిపై మోదీకి ఆసక్తి లేదని వైసీపీ ప్రచారం చేసింది.

కూటమి ఏర్పాటు తర్వాత సీట్ల సర్దుబాటు, బీజేపీ పోటీ చేస్తున్న స్థానాలు కొలిక్కి రావడంతో వేమగిరి సభలో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది,. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానంతో పాటు ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని, ఎన్డీఏ అధికారంలోకి రాష్ట్రానికి ఏమి లబ్ది చేస్తారనే దానిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఈ సభకు రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, ఏలూరు, నర్సాపురం లోక్‌సభ స్థానాల పరిధిలోని ఎంపీ అభ్యర్థులతో పాటు సుమారు 2 లక్షల మంది జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గతంలో టీడీపీ మహానాడు నిర్వహించిన వేమగిరి మైదానంలోనే నేటి బహిరంగ సభ నిర్వహిస్తారు. 50 ఎకరాల్లో సభ ఏర్పాట్లు చేశారు. భారీ వేదికలు, పందిళ్లతో సభకు వేదికను సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్‌కు జాతీయ రహదారి పక్కన 10 స్థలాలు ఏర్పాటు చేశారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో వేమగిరిలో 3 వేలమంది మంది బలగాలను మొహరించారు. చిలకలూరిపేటలో ప్రధాని బహిరంగ సభలో భద్రతాపరమైన లోపాలు తలెత్తడం, నలుగురు ఐపీఎస్‌లపై వేటు పడటంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి సివిల్‌ పోలీసులు, కేంద్ర బలగాలు కలిపి దాదాపు 3వేల మంది భద్రతా విధుల్లో ఉన్నారు. ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు రాష్ట్రాల ఐజీలు, ఉన్నతాధికారులు సభాస్థలి వద్ద ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ఎస్పీ జగదీశ్‌ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

మొదట నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ప్రధాని మోదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సభావేదిక వద్దకు వస్తారు. తిరుగు ప్రయాణ సమయం, భద్రతా కారణాలతో మధ్యాహ్నం 3 గంటలకే ప్రధాని సభాస్థలికి రానున్నారు. 4 గంటలకు రాజమండ్రి సభ నుంచి అనకాపల్లి వెళ్తారు.

పోలీసుల విస్తృత ఏర్పాట్లు…

ప్రధాని పర్యటన నేపథ్యంలో అడిషనల్‌ డీజీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలతో సహా పదుల సంఖ్యలో ఐపీఎస్‌ అధికారులు సభలను పర్యవేక్షిస్తారు. చిలకలూరిపేట అనుభవాలతో పోలీసు శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున మోదీ ఈ నెల 6, 8 తేదీల్లో ఏపీలో పర్యటిస్తారు. సోమవారం రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ఎన్డీఏ సభల్లో పాల్గొననున్నారు. బుధవారం పీలేరు, విజయవాడ ప్రధాని పర్యటిస్తారు. విజయవాడలో బుధవారం సాయంత్రం ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు.

తదుపరి వ్యాసం