AP Power Cuts: మోదీ పర్యటన ఏర్పాట్లు, బెజవాడలో కరెంటు కోతలు….అల్లాడిపోయిన జనం, ముందస్తు సమాచారం ఇవ్వక ఇబ్బందులు
AP Power Cuts: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రోడ్ షో కోసం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు విజయవాడలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
AP Power Cuts: ప్రధాని మోదీ పర్యటన విజయవాడలో ప్రజలకు కష్టాలు తెచ్చి పెట్టింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జనం అల్లాడిపోయారు. బుధవారం సాయంత్రం విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో ఉంది. నగరంలోని మహాత్మ గాంధీ రోడ్డులో మోదీ బుధవారం పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ప్రధాని రోడ్ షో జరుగుతుంది.
గన్నవరం విమానాశ్రయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకునే ప్రధాని అక్కడి నుంచి నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆయన ప్రయాణించే మార్గంలో ఉన్న హెచ్‌టి లైన్లను మార్చాలని పిఎం సెక్యూరిటీ విభాగం ఆదేశించడంతో గత రెండ్రోజులుగా ఆ పనులు చేపట్టారు. శనివారం కొంత మేర పనులు నిర్వహించిన సిపిడిసిఎల్ సిబ్బంది ఆదివారం నీట్ పరీక్ష నేపథ్యంలో పనులు ఆపేశారు. సోమవారం ఉదయాన్నే సరఫరా నిలిపివేశారు.
మరోవైపు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లుకు గురయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు నగరంలోని స్వరాజ్యమైదాన్, పిడబ్ల్యుడి గ్రౌండ్ సెక్షన్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. మహాత్మగాంధీ రోడ్డు ఉన్న హెచ్‌టి లైన్లను పూర్తిగా తొలగించి లోడ్ డిస్పాచ్ మార్చేందుకు ఏర్పాట్లు చేశారు.
గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజల ఉక్కపోతతో అల్లాడిపోయారు. విద్యుత్ ఎందుకు పోయిందో కనీస సమాచారం కూడా లేకుండా పోయింది. సిపిడిసిఎల్ టోల్ ఫ్రీ నంబర్ 1912 కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఆ నంబర్ పనిచేయక పోవడంతో సమాచారం ఇచ్చే వారు లేకుండా పోయారు. చివరకు ప్రధాని ప్రయాణించే మార్గంలో హెచ్ టి లైన్లు ఉండకూడదనే నిబంధనల నేపథ్యంలో సరఫరా నిలిపివేసినట్టు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
దాదాపు రెండున్నర గంటల అంతరాయం తర్వాత ఉదయం 11 గంటలకు విజయవాడలో కాసేపు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అప్పటి వరకు ఉక్కపోతతో తడిచి ముద్దైన జనం బతుకు జీవుడా అనుకున్నారు. పదినిమిషాల్లోపే మళ్లీ సరఫరా నిలిచిపోవడంతో జనం విలవిలలాడిపోయారు.