PM Modi Campaign : ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం - షెడ్యూల్ ఇదే
PM Narendra Modi Campaign in AP : ఏపీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. మే 6, 8 తేదీల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. NDA కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు.
PM Narendra Modi Campaign in AP 2024: ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీనే పోలింగ్ ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఓవైపు అధికార వైసీపీ, మరోవైపు ఎన్డీయే కూటమి నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికే భారీ సభలు, ర్యాలీలతో జనాల్లోకి వెళ్తున్నారు ముఖ్య నేతలు. ఇక కూటమి తరపున టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్(Pawan), బీజేపీ నుంచి పురందేశ్వరి ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలతో పాటు సభలకు హాజరవుతూ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.
ఇక ఏపీ ఎన్నికల ప్రచారంలోకి ప్రధాని మోదీ(PM Narendra Modi) కూడా రాబోతున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ ఖరారైంది. మే 6, 8 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
మే 6వ తేదీన మధ్యాహ్నం తర్వాత ఏపీలోని రాజమండ్రికి ప్రధాని మోదీ(PM Narendra Modi) చేరుకుంటారు. చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్ తో కలిసి వేమగిరి వద్ద తలపెట్టిన సభా ప్రాంగణానికి వెళ్తారు. రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహిస్తారు. ఈ సభ తర్వాత సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. అనకాపల్లిలో తలపెట్టిన రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
మే 8న మళ్లీ రాక….
మే 7వ తేదీన ఇతర రాష్ట్రాల్లో జరిగే ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. మళ్లీ 8వ తేదీనే ఏపీకి రానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. పీలేరు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సాయంత్రం 5 గంటలకు విజయవాడకు ప్రధాని మోదీ చేరుకుంటారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకుని బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు. మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కూడా ఈ ప్రచారంలో ఉంటారు. విజయవాడలో రోడ్ షోలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ… తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ్నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు.
ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష….
ప్రధాన మంత్రి మోదీ(PM Modi) పర్యటన నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సంబంధిత జిల్లాల కలెక్టర్లు, పోలీస్, సంబంధిత శాఖ అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.