PM Modi: ‘పాకిస్తాన్ కు చెప్పిన తరువాతే ప్రపంచానికి తెలియజేశాం’: ప్రధాని మోదీ-informed pakistan before breaking to world pm modi on balakot airstrike ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pm Modi: ‘పాకిస్తాన్ కు చెప్పిన తరువాతే ప్రపంచానికి తెలియజేశాం’: ప్రధాని మోదీ

PM Modi: ‘పాకిస్తాన్ కు చెప్పిన తరువాతే ప్రపంచానికి తెలియజేశాం’: ప్రధాని మోదీ

HT Telugu Desk HT Telugu
Apr 30, 2024 02:47 PM IST

PM Modi: ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్ ఎంత దూరమైనా వెళ్లగలదని నిరూపించిన బాలాకోట్ వైమానిక దాడుల గురించి మరో రహస్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 2019 లో పాకిస్తాన్ భూభాగంపై భారత్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి.

ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ
ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ

PM Modi: పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ భూభాగంపై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ (surgical strikes) ఉగ్రవాదంపై భారత్ వైఖరిని సుస్పష్టం చేశాయి. అదే విషయాన్ని ప్రధాని మోదీ ఇటీవలి ఎన్నికల ప్రచార సభల్లో పదేపదే చెబుతున్నారు. ఉగ్రవాదం విషయానికి వస్తే, ప్రత్యర్థుల ఇళ్లల్లోకి వెళ్లి మరీ హతమారుస్తామని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే, 2019 లో జరిగిన బాలకోట్ వైమానిక దాడుల (balakot air strikes) గురించి మరో విషయాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఎన్నికల (lok sabha elections 2024) ప్రచార సభలో వెల్లడించారు.

పాకిస్తాన్ కే ముందు చెప్పాం..

బాలాకోట్ వైమానిక దాడుల గురించి భారత్ లోని మీడియాకు తెలియక ముందే పాక్ (pakistan)కు సమాచారం ఇచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ‘‘ఆ రాత్రి సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం వైమానిక దాడుల గురించి మీడియాకు తెలియజేయాలని నేను సైనిక బలగాలను కోరాను. అయితే, ఆ దాడుల గురించి, శత్రువులకు జరిగిన నష్టం గురించి ముందుగా పాకిస్తాన్ కు తెలియజేయాలని నేను భావించాను. అందువల్ల మీడియాకు చెప్పే విషయాన్ని వాయిదా వేయాలని సైనిక బలగాలను కోరాను’’ అని ఆయన చెప్పారు. భారత్ నుంచి వెళ్లిన కాల్స్ కు పాకిస్తాన్ సమాధానమివ్వలేదని, దాంతో, మర్నాడు వాళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత, వారికి బాలాకోట్ దాడుల విషయం చెప్పానని ప్రధాని వెల్లడించారు. ఆ తరువాతే సైనిక బలగాలు మీడియాకు ఈ సర్జికల్ స్ట్రైక్స్ విషయాన్ని వెల్లడించాయని ప్రధాని (PM Modi) తెలిపారు.

అంతా ఫేస్ టు ఫేస్

వెనుక నుంచి దాడి చేయడంపై, వెన్నుపోటు పొడవడంపై తనకు నమ్మకం లేదని, నేరుగా ముఖాముఖి పోరుకే తాను మొగ్గు చూపుతానని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కర్ణాటకలోని బాగల్ కోట్ లో జరిగిన లోక్ సభ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 'ఇది నయా భారత్ (న్యూ ఇండియా), ఘర్ మే ఘూస్ కర్ కే మారేగా (శత్రువు ఇంట్లోకి దూరి చంపుతాం)' అని చొరబాటుదారులను ప్రధాని హెచ్చరించారు. పుణెలో జరిగిన మరో ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ 26/11 ముంబై దాడుల నిందను పవిత్ర కాషాయంపై మోపేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. నవంబర్ 26, 2008న పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో దాడులకు పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో 166 మంది మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

బాలాకోట్ వైమానిక దాడి

2019 ఫిబ్రవరి 14న 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఆత్మాహుతి దాడికి భారత్ ప్రతీకారంగా.. పాక్ లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరంపై భారత్ వైమానిక దాడులు జరిపింది. పుల్వామా దాడి జరిగిన పన్నెండు రోజుల తరువాత, ఐఏఎఫ్ యొక్క మిరాజ్ యుద్ధ విమానాలు బాలాకోట్ లోని మూడు శత్రు శిబిరాలపై దాడి చేశాయి. ఇజ్రాయెల్ కు చెందిన ఐదు స్పైస్ 2000 బాంబులు అక్కడి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను నేలమట్టం చేశాయి. ఈ దాడిలో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

WhatsApp channel