Devara vs Vettaiyan: ఎన్టీఆర్‌కు పోటీగా రజనీకాంత్.. తలైవా, రానా దగ్గుబాటి వెట్టయాన్ రిలీజ్ అప్పుడే!
Rajinikanth Vettaiyan Release Date: తలైవా రజనీకాంత్, రానా దగ్గుబాటి తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా వెట్టయాన్. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని మేకర్స్ ప్రకటించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు రజనీకాంత్ పోటీగా వస్తున్నాడనే చర్చ మొదలైంది.
Devara vs Vettaiyan: సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఆదివారం (ఏప్రిల్ 7) నాడు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. రజనీ కాంత్ నెక్ట్స్ మూవీ వెట్టయాన్ విడుదలకు సంబంధించిన సరికొత్త అప్డేట్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు మేకర్స్. రజినీకాంత్ 170వ చిత్రంగా తెరకెక్కుతున్న వెట్టయాన్ ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తమిళంలో అగ్గ నిర్మాణ సంస్థల్లో ఒకటైనా లైకా ప్రొడక్షన్స్ ఆదివారం తన ఎక్స్ (పాత ట్విట్టర్) అకౌంట్‌లో వెట్టయాన్ కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ పోస్టర్‌లో ఎవరినో తుపాకీ చూపిస్తూ రజినీకాంత్ నవ్వుతూ కనిపించారు. బ్లాక్ సన్ గ్లాసెస్, బ్లూ షర్ట్ ధరించి కనిపించాడు. "వెట్టయాన్ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2024న కానుంది" అని ట్విటర్‌లో రాసుకొచ్చారు మేకర్స్. దీనికి 'కురి వేచచ్చు' అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వెట్టయాన్ ఈ అక్టోబర్‌లో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాడు.
అయితే అక్టోబర్‌లో ఏ డేట్‌కు విడుదల చేస్తారని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న దేవర (Devara Movie) సినిమాను అదే అక్టోబర్ నెలలో 10వ తేదిన విడుదల చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి దసరా బరిలో ఎన్టీఆర్‌కు పోటిగా రజనీకాంత్ రానున్నాడని తెలుస్తోంది.
అలాగే, సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ (OG Movie) సినిమా కూడా విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. ఇలా చూసుకుంటే ఎన్టీర్ దేవరకు, పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలకు రజనీకాంత్ తన వెట్టయాన్ మూవీతో పోటీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో రజనీకాంత్‌తో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) కూడా నటిస్తున్నాడు. వీళ్లిద్దరు కలిసి నటించడం ఇదే తొలిసారి.
అంతేకాకుండా వెట్టయాన్ మూవీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, మలయాళ పాపులర్ యాక్టర్, పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. వీరితోపాటు రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్, జీఎం సుందర్, రోహిణి, అభిరామి, రావు రమేష్, రమేష్ తిలక్, రక్షణ, సాబుమోన్ అబుసమద్, సుప్రీత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇలా చాలా పాపులారిటీ ఉన్న యాక్టర్స్ ఈ సినిమాలో నటించడంతై వెట్టయాన్‌పై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి.
ఇక వెట్టయాన్ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రజినీకాంత్ గతంలో ఈ సినిమాకు సంబంధించి త్రివేండ్రం, తిరునల్వేలి, తూత్తుకుడి ప్రాంతాల్లో ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ చిత్రానికి జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు.
పాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున వెట్టయాన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.ఆర్. కతీర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రాఫర్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఇటీవలే రజనీకాంత్ లాల్ సలామ్ అనే సినిమాలో నటించి డిజాస్టర్ అందుకున్నారు.