BJP Campaign: ‘‘ఈ రోజు మనందరం బతికే ఉన్నామంటే అది మోదీ చలవే.. అందుకే ఆయనకు ఓటేయాలి’’ - ఫడణవీస్
BJP Campaign: ప్రధాని నరేంద్ర మోదీ పై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసలు గుప్పించారు. ఈ రోజు భారత్ లోనే కాకుండా, 100 కు పైగా దేశాల్లో ప్రజలు జీవించి ఉన్నారంటే, అది ప్రధాని నరేంద్ర మోదీ చలవేనని ఆయన పొగడ్తలు గుప్పించారు. కోవిడ్ 19 సమయంలో ప్రధాని గొప్పగా పని చేశారన్నారు.
BJP Campaign: కొరోనా (corona) పై పోరాటాన్ని ప్రధాని మోదీ ముందుండి నడిపించారని, బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశంసించారు. ఈ పోరాటంలో ప్రపంచానికి ప్రధాని నరేంద్ర మోదీని నాయకత్వం వహించారని ప్రశంసించారు. కోవిడ్ -19 (Covid 19) వ్యాక్సినేషన్ ద్వారా ప్రపంచ దేశాల ప్రజల ప్రాణాలను మోదీ కాపాడారని ప్రధానిని ఆకాశానికెత్తారు.
మోదీ వ్యాక్సీన్
‘‘కొరోనాకు మోదీ (PM Modi) వ్యాక్సిన్ ఇవ్వడం వల్లే ఈ రోజు మనం బతికే ఉన్నాం. వ్యాక్సిన్ తీసుకోకపోతే ఈ ర్యాలీని వీక్షించేందుకు ఈ రోజు ఇక్కడికి వచ్చేవాళ్లం కాదు. మన ప్రాణాలను కాపాడింది మోదీయే' అని పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దేవేంద్ర ఫఢణవీస్ అన్నారు. కోవిడ్ 19 కు వ్యాక్సిన్ల (covid 19 vaccine) ను రూపొందించడంలో, వాటిని విస్తృతంగా పంపిణీ చేయడంలో ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని దేవేంద్ర ఫఢణవీస్ పేర్కొన్నారు. కొన్ని దేశాలు మాత్రమే వ్యాక్సిన్ ను కనిపెట్టాయి. ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ వ్యాక్సిన్లను భారత్ అందిస్తుందని విశ్వసించాయి' అని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
అందరినీ ఏకం చేశారు..
‘‘కోవిడ్ 19 కు టీకా ను రూపొందించడం కోసం శాస్త్రవేత్తలను మోదీ ఏకతాటిపైకి తెచ్చారు. వారికి అవసరమైన వనరులను అందించారు. భారతదేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తయారీని సులభతరం చేశారు’’ అని ఫడణవీస్ వివరించారు. ‘‘మోదీ వల్లే తమ పౌరులు బతికే ఉన్నారని నేడు 100 దేశాలు అంగీకరిస్తున్నాయి. మోదీ కారణంగానే మనం సజీవంగా ఉన్నాం. అందువల్ల ఆయనకు ఓటేయడం ద్వారా మన కృతజ్ఞతను వ్యక్తం చేయాలి’’ అని ఫడ్నవీస్ కోరారు. మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన శనివారం పాల్గొన్నారు.
5 లక్షల మరణాలు..
కోవిడ్ -19 కారణంగా భారతదేశంలో అధికారికంగా 5 లక్షల కంటే ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. అయితే, అంతకు 10 రెట్లు మరణాలు భారత్ లో కోవిడ్ 19 వల్ల సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం భారత్ లో 47 లక్షలకు పైగా ప్రజలు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ డబ్ల్యూహెచ్ వో నివేదికను భారత్ తోసిపుచ్చింది.