DMK manifesto: ‘‘నీట్ పై నిషేధం; పుదుచ్చేరికి రాష్ట్ర హోదా’’- డీఎంకే మేనిఫెస్టో లో ఇంకా చాలా విశేషాలు
20 March 2024, 13:37 IST
DMK manifesto: రానున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం విడుదల చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంకే స్టాలిన్ సోదరి కనిమొళి, పార్టీలోని ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.
డీఎంకే నేత, తమిళనాడు సీఎం స్టాలిన్
Ban on NEET: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం డీఎంకే మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోతో పాటు 2024 లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ, ఎంకే స్టాలిన్ సోదరి కనిమొళి, ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. తమిళనాడులోని మొత్తం 40 లోక్ సభ స్థానాల్లో.. 21 స్థానాల్లో డీఎంకే, మిగిలిన 18 సీట్లలో మిత్ర పక్షాలు పోటీ చేస్తున్నాయి. ఒక స్థానంలో డీఎంకే గుర్తుపై కేఎండీకే పోటీ చేస్తుంది.
నీట్ పై నిషేధం
డీఎంకే మేనిఫెస్టో (DMK manifesto) లో పలు కీలక, వివాదాస్పద హామీలు ఉన్నాయి. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ (NEET) పై నిషేధం మొదలైన హామీలను డీఎంకే తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. అలాగే, గవర్నర్ వ్యవస్థను రద్దు చేసే వరకు రాష్ట్రాలకు గవర్నర్ ను నియమించే సమయంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో కచ్చితంగా సంప్రదించాలని డీఎంకే మేనిఫెస్టోలో పేర్కొంది.
డీఎంకే మేనిఫెస్టోలోని ఇతర హామీలు
- పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయబోం.
- గవర్నర్లకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి మినహాయింపు కల్పించే ఆర్టికల్ 361ను సవరిస్తాం.
- తిరుక్కురళ్ ను 'జాతీయ గ్రంథం'గా ప్రకటిస్తాం.
- భారత్ కు తిరిగి వచ్చిన శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం కల్పిస్తాం.
- భారతదేశం అంతటా మహిళలకు నెలకు రూ .1000 డబ్బు అందిస్తాం.
- జాతీయ రహదారిపై టోల్ గేట్లను తీసేస్తాం.
- ఎల్పీజీ ధరను రూ.500లకు, పెట్రోల్ లీటర్ ధరను రూ.75 కు, డీజిల్ లీటర్ ధరను రూ.65కు తగ్గిస్తాం.
మేనిఫెస్టో అమలు చేస్తాం
మేనిఫెస్టో విడుదల అనంతరం ఏర్పాటు చేసిన సభలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. మేనిఫెస్టో (DMK manifesto) లో తెలిపిన హామీలను పూర్తిగా, కచ్చితంగా అమలు చేసే పార్టీ డీఎంకే మాత్రమేనని, ఇది తమకు తమ నాయకులు నేర్పించారని అన్నారు. ‘‘రాష్ట్రమంతా పర్యటించి పలువురి మాటలు విన్నాం. ఇది డీఎంకే మేనిఫెస్టో మాత్రమే కాదు. ఇది ప్రజల మేనిఫెస్టో. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక భారత్ ను సర్వనాశనం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఇండియా కూటమి 2024 లోక్ సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ డీఎంకే మేనిఫెస్టో (DMK manifesto) తమకు ఎప్పుడూ ముఖ్యమేనన్నారు. మేనిఫెస్టో కమిటీకి నేతృత్వం వహించే బాధ్యతను తనకు ఇచ్చినందుకు ఎంకే స్టాలిన్ కు, కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.