Udhayanidhi Stalin: తమిళనాడు మంత్రి, డీఎంకే నేత, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పై ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ జిల్లాలో కేసు నమోదు అయింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మ సామాజిక న్యాయానికి విరుద్ధమని, సనాతన ధర్మాన్ని సమూలంగా నాశనం చేయాలని ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఉదయ నిధికి వ్యతిరేకంగా ఒక వర్గం, మద్ధతుగా మరో వర్గం మీడియాలో, సోషల్ మీడియాలో, రాజకీయాల్లో పెద్ద ఎత్తున వాదనలు కొనసాగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, మెజారిటీ ప్రజల మనోభావాలను ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలు గాయపర్చాయని, తన వ్యాఖ్యలతో రెండు మతపరమైన వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉదయనిధి స్టాలిన్ తో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేపై కూడా కేసు నమోదు చేశారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధించడం ద్వారా మతపరమైన మనోభావాలను గాయపర్చారన్న ఆరోపణలపై ప్రియాంక్ ఖర్గే పై కూడా కేసు నమోదు అయింది. వారిపై ఐపీసీలోని 295ఏ, 153 ఏ సెక్షన్ల కింద సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. న్యాయవాదులు హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోధిలు చేసిన ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.
తన వ్యాఖ్యలను ఉదయనిధి స్టాలిన్ మరోసారి సమర్ధించుకున్నారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని కొరోనా, మలేరియా, డెంగ్యూ లతో ఉదయనిధి స్టాలిన్ పోల్చారు. వాటిని నిర్మూలించినట్లే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించడం మినహా మరో మార్గం లేదన్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన విపక్ష కూటమిలో డీఎంకే కూడా ఒకటి. కాగా, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఆ కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఆప్ తదితర పార్టీలు ఈ వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ నేత మమత బెనర్జీ మాత్రం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. మతపరమైన సెంటిమెంట్స్ ను గాయపర్చే వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని తాను గౌరవిస్తానన్నారు.
టాపిక్