తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Konda Surekha: కవితను బయటకు తీసుకురావడమే వారి లక్ష్యమన్న కొండా సురేఖ… ఆగష్ట్ నుంచి రుణమాఫీ అమలుకు హామీ

Konda Surekha: కవితను బయటకు తీసుకురావడమే వారి లక్ష్యమన్న కొండా సురేఖ… ఆగష్ట్ నుంచి రుణమాఫీ అమలుకు హామీ

HT Telugu Desk HT Telugu

19 April 2024, 6:18 IST

google News
    • Konda Surekha: లిక్కర్ స్కాం కేసులో కవితను జైలు నుంచి తీసుకొని రావాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ నాయకులు బీజేపీ అభ్యర్ధులుగా బరిలో నిలుస్తున్నారని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ ప్రయత్నాలపై కొండా సురేఖ కామెంట్స్
ఎమ్మెల్సీ కవిత బెయిల్ ప్రయత్నాలపై కొండా సురేఖ కామెంట్స్

ఎమ్మెల్సీ కవిత బెయిల్ ప్రయత్నాలపై కొండా సురేఖ కామెంట్స్

Konda Surekha: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అదానీ, అంబానీల ఆస్తులు పెరిగాయి తప్ప పేదలకు జరిగిన న్యాయం ఏమీ లేదని కొండా సురేఖ ఆరోపించారు. . భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ ప్రజల కష్టాలను చూశాడని, ప్రజల్లో ఉండే ప్రధాని కావాలా.. లేక అంబానీ, అదానీలకు కొమ్ముకాసే నాయకుడు కావాలా ప్రజలే ఆలోచించాలన్నారు. లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టైన Mlc Kavitha ఎమ్మెల్సీ కవితను జైలు నుంచి విడిపించేందుకుBJP బీజేపీ, BRS బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

వరంగల్ warangal నగరంలోని అబ్నూస్ ఫంక్షన్ హాలులో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశామని, రైతులకు ఆగస్ట్ లో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

రాజకీయాల్లోకి అసభ్య పదజాలాన్ని తీసుకువచ్చిందే మాజీ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ మాత్రమేనని, అంబేడ్కర్ గురించి మాట్లాడే నైతిక విలువ వారికి లేదన్నారు. కొండా దంపతులు సన్మానాలకు దూరమని, సన్మానాలు, సత్కారాలకు పెట్టే ఖర్చుతో అనాథ పిల్లలకు భోజనం అందించండంటూ కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడియం కావ్య గెలుపుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

మాది శ్రీకృష్ణదేవరాయల వంశం: కొండా మురళి

మాది శ్రీకృష్ణదేవరాయల వంశం.. నేను మాట ఇస్తే తప్పను.. పేద ప్రజల భూములు కబ్జా చేస్తే సహించేది లేదు’ అంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కామెంట్స్ చేశారు. కొండా మురళీ మాట ఇస్తే తప్పడని, వరంగల్ తూర్పు ప్రజలకు సాయిబాబా సాక్షిగా అండగా ఉంటామన్నారు.

కడియం కావ్యకు 50 వేల మెజార్టీ ఇస్తామని, అక్కడ రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు. నిరుపేదలు, స్లమ్ ఏరియాల ప్రజల భూములను కబ్జా చేస్తే సహించేది లేదని, కబ్జా దారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు.

కొండా దంపతులతోఎప్పుడూ విభేదాలు లేవు: కడియం

కొండా దంపతులకు కడియం శ్రీహరికి ఎక్కడా విభేదాలు లేవని, అందరం కలిసి పని చేస్తామని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కొండా దంపతులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ప్రజల్లో కొండా దంపతులకు ఉన్న క్రేజ్ చూస్తుంటే కడియం కావ్య గెలుపు ఖాయమైనట్టేనన్నారు.

వరంగల్ తూర్పు ప్రజలను కంటిరెప్పలా కాపాడుకుంటామని, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం కడియం కావ్య మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ అభినవ రుద్రమదేవి అన్నారు. కార్యకర్తలను కొండా దంపతులు కంటికిరెప్పలా చూసుకుంటున్నారని, రాజకీయాల్లో ఎలా ముందుకు పోవాలో కొండా సురేఖను చూస్తుంటేనే అర్థమవుతోందన్నారు.

వరంగల్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ వర్ధన్నపేట నియోజకవర్గంలో చేసిన అక్రమాలు సరిపోక, మిగతా నియోజకవర్గాల్లో భూములపై కన్నేశాడని ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం