Konda Surekha On Kavitha : అమెరికాలో అంట్లు తోముకునే వాళ్లకు వందల కోట్లు ఎలా వచ్చాయ్-మంత్రి కొండా సురేఖ-warangal news in telugu minister konda surekha fires on mlc kavitha questions liquor case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Konda Surekha On Kavitha : అమెరికాలో అంట్లు తోముకునే వాళ్లకు వందల కోట్లు ఎలా వచ్చాయ్-మంత్రి కొండా సురేఖ

Konda Surekha On Kavitha : అమెరికాలో అంట్లు తోముకునే వాళ్లకు వందల కోట్లు ఎలా వచ్చాయ్-మంత్రి కొండా సురేఖ

HT Telugu Desk HT Telugu
Feb 03, 2024 09:01 PM IST

Konda Surekha On Kavitha : అమెరికాలో అంట్లు తోముకునే వాళ్లంతా తెలంగాణకు వచ్చి వందల కోట్లు పెట్టి ఫ్లైట్లు కొనుక్కునే స్థాయికి ఎలా ఎదిగారని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. లిక్కర్ కేసులో ఇరుక్కోకుండా ఎమ్మెల్సీ కవిత బీజేపీ కాళ్లమీద పడ్డారని విమర్శించారు.

మంత్రి కొండా సురేఖ
మంత్రి కొండా సురేఖ

Konda Surekha On Kavitha : తెలంగాణ సంపదను కొల్లగొట్టిన ఎమ్మెల్సీ కవితకు సీఎం రేవంత్​ రెడ్డి గురించి మాట్లాడే హక్కే లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. కవిత లిక్కర్​రాణి అని, కేసులో ఇరుక్కోకుండా తప్పించుకునేందుకు బీజేపీ కాళ్లమీద పడిన విషయం నిజం కాదా అని సురేఖ ప్రశ్నించారు. వరంగల్ లో మంత్రి కొండా సురేఖ శనివారం పర్యటించారు. అనంతరం కాకతీయ అర్బన్ డెవలప్​ మెంట్ అథారిటీ(కుడా) ఆఫీస్​లో వరంగల్ నగర పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్​రెడ్డి, కేఆర్​ నాగరాజు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్​, ప్రావీణ్య, గ్రేటర్​ కమిషనర్​ షేక్​ రిజ్వాన్​ బాషాతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి కొండా మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలో అంట్లు తోముకునే వాళ్లు

ఇంద్రవెల్లి సభపై కవిత ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని, అవినీతితో రాష్ట్ర సంపదను దోచుకున్న కవితకు సీఎం రేవంత్​ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. హిమన్ష్ ఏ హోదాతో రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, ఆ సొమ్మంతా రాష్ట్ర ప్రజలది కాదా అని ప్రశ్నించారు. గతంలో అమెరికాలో అంట్లు తోముకునే వాళ్లంతా తెలంగాణకు వచ్చి వందల కోట్లు పెట్టి ఫ్లైట్లు కొనుక్కునే స్థాయికి ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్​ విశ్వసించారు కాబట్టే తెలంగాణలో ప్రజాపాలన మొదలైందని, కాంగ్రెస్​ను విమర్శించే ముందు మీ వీపులు చూసుకోవాలన్నారు. కాంగ్రెస్​ నాయకులను విమర్శించే అర్హత కవిత, బీఆర్​ఎస్ నేతలకు లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో పేరుంటే ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ ఎంపీగా మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాల్​విసిరారు. కవిత నిజామాబాద్​ నుంచి నిలబడినా.. ఎక్కడి నుంచి నిలబడినా.. ప్రజలు కచ్చితంగా ఓడించి తీరుతారని మంత్రి సురేఖ విమర్శించారు.

సిటీలో శంకుస్థాపనలతో మభ్యపెట్టారు

గ్రేటర్​ వరంగల్ పరిధిలో ప్రజలకు అవసరమైన పనులు మొదలు కాలేదని, బీఆర్ఎస్​ నాయకులు ఇష్టారీతిన శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెట్టారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. బీఆర్ఎస్​ పాలకులకు భూములు కబ్జాపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్నారు. వాళ్లు కేవలం కాంగ్రెస్​ నేతలపై కేసులు పెట్టడంపైనే శ్రద్ధ పెట్టారన్నారు. గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు కబ్జాలకు, రౌడీయిజానికే పరిమితం అయ్యారని, ఎమ్మెల్యే నిధులను కూడా సక్రమంగా వాడుకోలేకపోయారన్నారు. సీడీఎఫ్ నిధులను కూడా ఖర్చు చేయలేకపోయారని మండిపడ్డారు. అందుకు కాంగ్రెస్​ప్రభుత్వ హయాంలో సిటీ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టామన్నారు. వరదల సమయంలో ముందు జాగ్రత్తల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉందని, కేసీఆర్, కేటీఆర్ వైఫల్యం వల్లే కేంద్ర నిధులు రాబట్టలేకపోయారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలకులు వరంగల్ పై సవతి తల్లి ప్రేమ చూపారని, విదేశాలకు వెళ్లి పర్సంటేజ్ లు మాట్లాడుకున్నారు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్క పర్యటనతోనే 40 వేల కోట్ల ప్రాజెక్టులు తెలంగాణకు తీసుకువచ్చారన్నారు. ముందుగా చెప్పిన ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు.

వరంగల్ ను టూరిజం సర్క్యూట్​చేస్తాం

రాష్ట్రంలో రెండో అతి పెద్ద సిటీగా పేరున్న వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి బాట పట్టించేందుకు కృషి చేస్తామని మంత్రి సురేఖ అన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్​ను టూరిజం సర్క్యూట్ గా తీర్చిదిద్దుతామన్నారు. అన్ని ప్రాంతాలకు టూరిజాన్ని విస్తరిస్తామని, గ్రేటర్​ పరిధిలోని నియోజకవర్గాల్లో స్టేడియం నిర్మిస్తామన్నారు. వరంగల్ లో బస్ స్టాండ్ నిర్మాణం, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ప్రజలకు, విద్యార్థిని విద్యార్థులకు అవసరమయ్యే పనులు చేపట్టడానికి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. అంతేగాకుండా నగరంలో స్లమ్​ఏరియాల్లో ఉన్న ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలైన డ్రైన్స్, వీధి దీపాలు, అంతర్గత రోడ్ల ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.

అమరుల కుటుంబాలను గుర్తించాలి

వరంగల్​ జిల్లాలోని అమరవీరుల కుటుంబాలను గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి సురేఖ తెలిపారు. వారికి ఇళ్ల స్థలాలు అందజేయడానికి స్థలాలను గుర్తించాలన్నారు. సీఎం రేవంత్​రెడ్డి అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందజేయడానికి సుముఖంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల సమాచారం అందుబాటులో ఉంచుకోవాలని, కార్యక్రమాలను ఫౌండేషన్ చేయించి ముఖ్యమంత్రితో ఇక్కడే ప్రారంభోత్సవాలు చేయించడానికి కృషి చేస్తామన్నారు. ఇటీవల ఇంద్రవెల్లిలో ఏవిధంగా ఒకే చోట ప్రారంభోత్సవాలు చేశామో అదే తీరుగా వరంగల్​నగరంలో కూడా చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. అనంతరం హనుమకొండ బస్టాండ్​లో హనుమకొండ నుంచి బెంగళూరు వెళ్లే స్లీపర్​ కోచ్​ బస్సులను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

IPL_Entry_Point