Warangal Street Dogs: వరంగల్ లో కుక్కల దాడులు.. మంత్రి కొండా సురేఖ సీరియస్
Warangal Street Dogs: గ్రేటర్ వరంగల్ నగరంలో వీధి కుక్కల భయంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గుంపుగుంపులుగా తిరగుతున్న కుక్కలు ప్రజలపై ఎగబడుతుండటంతో జనాలు జంకుతున్నారు.
Warangal Street Dogs: వరంగల్ నగరంలో రోజుకు కనీసం పది మంది కుక్క కాటుకు గురవుతుండగా.. గతేడాది యూపీ నుంచి వలస వచ్చిన కుటుంబంలోని ఓ ఏడేండ్ల బాలుడిని కుక్కలు కరిచి చంపేయడం అప్పట్లో కలకలం రేపింది. ఇదిలాఉంటే ఆదివారం సాయంత్రం మళ్లీ కుక్కలు బీభత్సం సృష్టించాయి.
వరంగల్ నగరంలోని 21వ డివిజన్ కు చెందిన ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా చిన్నారులపై కుక్కల దాడి ఘటన నేపథ్యంలో స్థానిక మంత్రి కొండా సురేఖ ఆఫీసర్లపై సీరియస్ అయ్యారు. కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
నగరంలో 40 వేలకు పైగానే
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 40 వేలకుపైగానే కుక్కలున్నట్లు మున్సిపల్ ఆఫీసర్లు గతంలోనే గుర్తించారు. తరచూ కుక్కల దాడులు చోటుచేసుకుంటుండటంతో వాటి నియంత్రణకు స్టెరిలైజేషన్ ప్రక్రియను బల్దియా అధికారులు ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చారు.
సంబంధిత ఏజెన్సీ నగర పరిధిలోని కుక్కలను తీసుకొచ్చి స్టెరిలైజేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా ఒక రోజు 25 నుంచి 30 కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తుండగా వాటికి ఆహారం, సర్జరీ, తీసుకొచ్చే సిబ్బంది వేతనాలు అన్నీ కలిపి మున్సిపల్ అధికారులు ఒక్కో కుక్కకు దాదాపు రూ.800 చొప్పున కాంట్రాక్టు ఏజెన్సీకి చెల్లిస్తోంది.
ఇలా ఏటా సగటున వెయ్యి కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. అయినా కుక్కల జనాభాను నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి.
నెలకు 500 కేసులు
వరంగల్ నగర పరిధిలో మొత్తంగా 66 డివిజన్లు ఉండగా నిత్యం సగటున 10 నుంచి 15 మంది కుక్కకాటుతో వరంగల్ ఎంజీఎంకు పరుగులు తీస్తున్నారు. ఇలా నెలకు 450 నుంచి 500 మంది వరకు కుక్కకాటు బారినపడుతున్నట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. కుక్కల స్టెరిలైజేషన్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయడం, ఫిర్యాదుల వస్తే తప్ప అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం వల్లే కుక్కకాటు బాధితులు పెరిగిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నిరుడు ఏడేళ్ల బాలుడు మృతి
ఉత్తరప్రదేశ్ వారణాసి ప్రాంతానికి చెందిన మూడు సంచార జాతి కుటుంబాలు గతేడాది మే 18న వరంగల్ నగరానికి వలస వచ్చాయి. కాజీపేట రైల్వే స్టేషన్ లో దిగి ఆ పక్కనే ఉన్న పార్కు వద్ద తాత్కాలికంగా డేరా ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఇందులో మల్కాన్–సునీత దంపతుల ఏడేళ్ల కొడుకు చోటు మే 19న ఉదయం బహిర్భూమి కోసం పార్క్ పక్కన ఉన్న స్థలంలోకి వెళ్లాడు.
అక్కడ గుంపుగా ఉన్న కుక్కలు బాలుడిపై దాడి చేసి మెడ గొంతుపై తీవ్రంగా కరిచి అక్కడే చంపేశాయి. పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబంలో బాలుడిని కుక్కలు కరిచి చంపడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధించారు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపగా.. అప్పటికప్పుడు అధికారులు కుక్కల పట్టే పనికి శ్రీకారం చుట్టి కొద్దిరోజులు హడావుడి చేశారు. ఆ తరువాత షరా మామూలే అన్నట్టుగా వదిలేశారు.
ఇద్దరు చిన్నారులపై దాడి
వరంగల్ 21 వ డివిజన్ ఎల్బీనగర్ లో ఇద్దరు చిన్నారులపై ఆదివారం సాయంత్రం కుక్కలు దాడి చేశాయి. సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు చిన్నారులు అలీ అక్బర్, అనాస్ లపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రగాయాల పాలయ్యారు. దీంతో వారు కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్న వాళ్లు వచ్చి కుక్కలను తరిమికొట్టారు.
కుక్కల దాడి తర్వాత వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అందులో అలీ అక్బర్ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
మంత్రి కొండా సురేఖ సీరియస్
ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కల దాడిని జిల్లాకు చెందిన దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ సీరియస్ గా తీసుకున్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మహానగర పాలక సంస్థ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాను ఆదేశించారు.
నగరంలోని కుక్కలను ప్రాతిపదికన నియంత్రించాలని, శస్త్ర చికిత్సలు చేయాలని అవసరమైతే అదనంగా మ్యాన్ పవర్ పెంచుకొని దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం ఉదయం మంత్రి నేరుగా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్బర్ అలీని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
డాక్టర్లతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలందించాల్సిందిగా సూచించారు. కాగా నగరంలో కుక్కల నియంత్రణకు ఒక యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ) సెంటర్ ఉండగా.. మరో సెంటర్ ఏర్పాటుకు గతంలో ప్రపోజల్స్ పంపించారు. అయినా ఇంతవరకు దానిపై ఎలాంటి యాక్షన్ లేకపోవడం గమనార్హం.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)