Konda Surekha: అధికారులు జవాబుదారీ తనంతో పని చేయాలి: మెదక్ ఇంచార్జి మంత్రి కొండా సురేఖ
28 December 2023, 6:08 IST
- Konda Surekha: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందించాలని రాష్ట్ర అటవీ ,పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖ కోరారు.
ప్రజాపాలన సన్నాహక సమావేశంలో కొండా సురేఖ
Konda Surekha: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మంత్రి సురేఖ తెలిపారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, ఆరు గ్యారంటీల అమలులో భాగంగా క్షేత్రస్థాయిలో దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు అమలు చేయనున్న ప్రజా పాలన కార్యక్రమంపై సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం (సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ) ఉమ్మడి మెదక్ జిల్లా జిల్లా స్థాయి సన్నాహక సమావేశం సంగారెడ్డి లో నిర్వహించారు.
మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజా పాలన కార్యక్రమం అమలు తీరుపై ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లాలని, ఆరు గ్యారెంటీలను అర్హులకు అందించడానికి ,ప్రజా పాలన కార్యక్రమం ద్వారా డాటా సేకరించి అర్హులను గుర్తించి ప్రభుత్వం ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు తీసుకెళ్తదన్నారు. ప్రభుత్వం ప్రతి గ్యారెంటీకి మార్గదర్శకాలు పెట్టి ప్రజలకు తెలిపిన తర్వాతే అమలవుతాయని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలను తీర్చి, పేదల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించిందన్నారు. అధికారులు జవాబుదారీతనంతో అత్యంత పారదర్శంకంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని సురేఖ కోరారు.
ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులో అన్ని కాలమ్స్ సరిగ్గా నింపించేలా చూడాలని, దరఖాస్తులను స్వీకరించి, వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని, ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమం గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజలందరికి అవగాహన కల్పించాలని అన్నారు. రేపటి నుండి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకెళ్లాలని, ఇది నిరంతర ప్రక్రియని గ్రామ గ్రామాన వార్డుల వారీగా తెలియజేయాలన్నారు.
అధికారుల పనితీరుతోనే ప్రభుత్వ పథకాలు విజయవంత మవుతాయని, అధికారులందరూ బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారని మంత్రి ఆశించారు. ప్రజా పాలన కార్యక్రమంలో గ్రామసభ/ వార్డు సభ ప్రారంభం కాగానే ముందుగా ముఖ్యమంత్రి గారి సందేశం ప్రజలకు వినిపించాలని అధికారులకు సూచించారు.
అవసరమైనతే దరఖాస్తు ఫారాలను నింపే చోట తమ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని సంగారెడ్డి ఎస్పీ చెప్పడంపై మంత్రి సురేఖ ఆనందం వ్యక్తం చేశారు. సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు వెలిబుచ్చిన పలు సందేహాలకు మంత్రి వివరంగా నివృత్తి చేశారు. అనంతరం ప్రజా పాలన పోస్టర్ను, దరఖాస్తును, ముఖ్యమంత్రి సందేశం కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు.