తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Karimnagar Nominations : కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల నామినేషన్, అధికారికంగా ప్రకటించని అధిష్టానం!

Karimnagar Nominations : కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల నామినేషన్, అధికారికంగా ప్రకటించని అధిష్టానం!

HT Telugu Desk HT Telugu

22 April 2024, 22:05 IST

google News
    • Karimnagar Nominations : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నామినేషన్లు జోరందుకున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఇంకా కరీంనగర్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు.
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల నామినేషన్
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల నామినేషన్

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల నామినేషన్

Karimnagar Nominations : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలకు సోమవారం బారీగా నామినేషన్ లు దాఖలయ్యాయి. కరీంనగర్ ఎంపీ స్థానానికి 13 మంది, పెద్దపల్లి ఎంపీ స్థానానికి 14 మంది నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీల నుంచి కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయగా మిగతా వారంతా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్టానం ఇంకా ఖరారు చేయకపోయినప్పటికీ టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్ రావు (Velichala Rajender Rao)అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి కలెక్టరేట్ వరకు రోడ్ షో నిర్వహించి నామినేషన్ వేశారు. కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఒకటి రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం అధికారికంగా అభ్యర్థిని ప్రకటిస్తుందని తెలిపారు.

పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ చేసింది ఏమిలేదు

మొదటి దశ పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో మోదీకి భయం పట్టుకుని వైషమ్యాలను రెచ్చగొడుతున్నారని మంత్రి పొన్నం(Ponnam Prabhakar) విమర్శించారు. పదేళ్లలో మోదీ చేసిందేమిలేదని.. సంపాదనంతా అదానీ(Adani), అంబానీ(Ambani)కి అప్పగించారని ఆరోపించారు. పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి లాగులు తడుపుకుంటూ అభద్రతాభావంతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణను దేశద్రోహంగా భావించే మోదీకి ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్(Bandi Sanjay) అవినీతి అరోపణలతోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారని తెలిపారు. రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్న బండి సంజయ్ గొప్ప భక్తుడే అయితే వారానికోసారి కరీంనగర్ (Karimnagar) తిరుపతి(Tirupati) మధ్య నడిచే రైలును ప్రతిరోజు నడిచేలా ఎందుకు కృషి చేయడం లేదన్నారు. ఇక బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.

ఆగస్టు 15 నాటికి రెండు లక్షణ రుణమాఫీ

బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ (Vinod Kumar)కు చెందిన హోటల్ లో ఆరు కోట్లు పట్టుబడ్డాయని అలాంటి వారు ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రజాపాలన అందిస్తుందని వచ్చే ఆగస్టు 15 నాటికి రైతుల రెండు లక్షల రుణమాఫీ(Loan Waiver) చేయడంతోపాటు 500 బోనస్ ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి మానవతావాది అయిన రాహుల్ గాంధీ(Rahul Gandhi) అని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం అనే వాళ్లకు గుణపాఠం చెప్పేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హిందీ ఇంగ్లీష్ రాని వ్యక్తి ఎంపీగా అవసరమా అని వెలిచాల రాజేందర్ రావు ప్రశ్నించారు. ఇదివరకు ఓసారి బీఆర్ఎస్ అభ్యర్థికి, మరోసారి బీజేపీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారని ఇప్పుడు కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని కోరారు.

తదుపరి వ్యాసం