Karimnagar News : కరీంనగర్ లో కరెన్సీ కట్టలు-24 గంటల్లో 1.04 కోట్ల నగదు పట్టివేత
21 April 2024, 11:32 IST
- Karimnagar News : కరీంనగర్ లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. శనివారం సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.04 కోట్ల నగదును సీజ్ చేశారు.
కరీంనగర్ లో కరెన్సీ కట్టలు
Karimnagar News : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. 24 గంటల వ్యవధిలో కోటి నాలుగు లక్షల 30 వేల 900 నగదు పట్టుకుని సీజ్ చేశారు. శనివారం సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 88,49,000 పట్టుకున్నారు పోలీసులు. కరీంనగర్ రాజీవ్ చౌక్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో అశోక్ నగర్ కు చెందిన ఉప్పుల రాఘవ చారి, హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సూరోజు రమేష్ ల నుంచి రూ.71 లక్షలు సీజ్ చేశారు. గీతాభవన్ చౌరస్తా వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో సుభాష్ నగర్ కు చెందిన దామెర అరుణ్ కుమార్ వద్ద రూ.14,89,000, ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన తనిఖీల్లో అశోక్ నగర్ కు చెందిన అంకిత్ తివారి వద్ద 2,60,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నగరంలో నిర్వహించిన తనిఖీల్లో 15,81,900 నగదు పట్టుకున్నారు. రెండు రోజుల్లో కోటి నాలుగు లక్షల రూపాయల నగదు పట్టుకొని సీజ్ చేశామని టౌన్ ఏసీపీ నరేందర్ తెలిపారు.
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 8.28 లక్షల సీజ్
ఎన్నికల కోడ్ (Election Code)అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రూ.8.28 కోట్ల నగదు సీజ్(Cash Seize) చేశారు. యాభై వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లేవారు విధిగా సరైన ఆధారాలు చూపాలని పోలీసులు కోరుతున్నారు. లేకుంటే ఎన్నికల నిబంధనలకు లోబడి సీజ్ చేసి కోర్టుకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో నిఘా పెంచామని, తనిఖీలు ముమ్మరంగా చేపట్టామని నగదు తీసుకెళ్లే వారు ఎన్నికల నిబంధనలు విధిగా పాటించాలని కోరుతున్నారు. లేనిచో చర్యలు తప్పవని ఎన్నికల అధికారులు హెచ్చరించారు.
HT Correspondent K.V.REDDY, Karimnagar