Karimnagar Polling : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు, ప్రశాంతంగా పోలింగ్
13 May 2024, 15:06 IST
- Karimnagar Polling : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో భారీగా పోలింగ్ శాతం నమోదు అవుతుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు
Karimnagar Polling : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. వాతావరణం కూల్ గా ఉండడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేంద్రాలు జాతరను తలపించాయి. కరీంనగర్ లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు బండి సంజయ్, బోయినిపల్లి వినోద్ కుమార్, వెలిచాల రాజేందర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగిత్యాలలో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి, గోదావరిఖనిలో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాలలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముకరంపుర ఉర్దు మీడియం స్కూల్లో బోయినపల్లి వినోద్ కుమార్ భార్య ఇద్దరు కొడుకులు కోడలు తో కలిసి క్యూ లైన్ లో నిల్చుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. జ్యోతినగర్ సాధన స్కూల్ లో తల్లి, ఇద్దరు సోదరులు వదినలు, భార్య కొడుకు కుటుంబసభ్యులందరితో కలిసి బండి సంజయ్ ఓటు వేశారు. క్రిస్టియన్ కాలనీలో భార్య ఇద్దరు కూతుళ్లు, సోదరితో కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాతావరణం బాగుంది.. తమకు అనుకూలంగా ప్రజా తీర్పు ఉంటుందని అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు జీవితంలో అత్యంత ముఖ్యమైనదని, దేశ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఆలోచించి అభివృద్ధి సంక్షేమానికి పాటుపడే వారికి ఓటు వేయాలని కోరారు.
బస్సులో వెళ్లి ఓటు వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్ లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పొన్నం ప్రభాకర్ భార్య కొడుకుతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి హుస్నాబాద్ జూనియర్ కళాశాలలో ఓటు వేశారు. ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరునిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నానని పొన్నం తెలిపారు. బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మతతత్త్వానికో, ప్రాంతీయ తత్వానికో ఇతరత్రా ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం నిలవాలంటే అఖండ భారతదేశంలో ఓటు అనే ఆయుధం ద్వారా కూడా అనేక అంశాలు మారుతుంటాయని తెలిపారు. ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అది మన బాధ్యత అన్నారు.
కరీంనగర్ లో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు
పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కరీంనగర్ లో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అభ్యర్థుల మధ్య పోటీ మాదిరిగానే పోలింగ్ పరంగా ఓటర్లు పోటేత్తి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 29 లక్షల 79 వేల మంది ఓటర్లు ఉండగా వారంతా ఓటు హక్కు వినియోగించుకునేలా 5852 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అకాల వర్షంతో వాతావరణం కూల్ గా ఉండడంతో పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 10 శాతం, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గౄ పరిధిలో 9.69 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటల వరకు కరీంనగర్ లో 26.14 శాతం, పెద్దపల్లి లో 26.33 శాతం ఓట్లు పోలయ్యాయి. యువతౄ మహిళలు వృద్దులు ఎక్కువగా పోలింగ్ లో పాల్గొన్నారు.
నక్సల్స్ ప్రాబల్యం గల ప్రాంతాల్లో 4 గం.ల వరకే పోలింగ్
వేసవి ఎండల దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఈసారి పోలింగ్ సమయాన్ని పొడిగించింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కు అవకాశం కలిపించారు. నక్సల్స్ తీవ్రవాద గల ప్రాంతాల్లో మాత్రం రెండు గంటల ముందుగానే పోలింగ్ ముగిసేలా ఏర్పాటు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంథని మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ సమయంగా నిర్ణయించారు. దీంతో ఆ నాలుగు సెగ్మెంట్లలో ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం కల్లా 50 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా కరీంనగర్ పరిధిలో సిపి అభిషేకం మోహంతి, పెద్దపల్లి పరిధిలో రామగుండం సీపీ శ్రీనివాస్ పకడ్బందీ చర్యలు చేపట్టారు.
HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar