Megastar Chiranjeevi: పవన్ కళ్యాణ్‌ను ఎన్నికల్లో గెలిపించాలని పిఠాపురం ఓటర్లకు చిరంజీవి విజ్ఞప్తి
Megastar Chiranjeevi: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఎన్నికల్లో గెలిపించాలని పిఠాపురం ఓటర్లకు మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వీడియో సందేశాన్ని చిరంజీవి విడుదల చేశారు.
Megastar Chiranjeevi: ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరపున మెగాస్టార్ చిరంజీవి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నాడని ఆయనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
పవన్ కళ్యాణ్ అమ్మ కడుపులో ఆఖరున పుట్టినా అందరికి మేలు చేయాలనే ముందువాడిగా ఉంటాడని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. తన గురించి కంటే జనం గురించే ఆలోచించే మనస్తత్వం తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌దని వివరించారు.
ఎవరైనా అధికారంలోకి వచ్చాక ఏదైనా చేయాలనుకుంటారని, కానీ కళ్యాణ్ తన సొంత సంపాదన కౌలు రైతుల కన్నీళ్లు తుడవడానికి ఖర్చు చేశాడని, సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడే సైనికులకు పెద్ద మొత్తంలో సాయం చేశాడని, మత్స్యకారులతో పాటు ఎందరికో సాయం చేయడం చూసినపుడు ఇలాంటి నాయకుడు జనాలకు కావాల్సింది అనిపిస్తుందన్నారు.
ఒకరకంగా సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ బలవంతంగా వచ్చాడని, రాజకీయాల్లోకి మాత్రం పూర్తి ఇష్టంతోనే వచ్చాడని, ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుందని, ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుందని, అలా బాధపడుతున్న నా తల్లికి అన్నగా ఒక మాట తాను చెప్పానని చిరంజీవి వివరించారు.
“నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం వారి బిడ్డల భవిష్యత్ కోసం చేసే యుద్ధమని మనం పడే బాధ కంటే అదెంతో గొప్పదని సర్ది చెప్పానని” చిరంజీవి పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వారి వల్లే ప్రజాస్వామ్యానికి మరింత నష్టం జరుగుతుందని నమ్మి, జనం కోసం జనసైనికుడయ్యారన్నారు.
తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లో అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్ అని చిరంజీవి కొనియాడారు. ప్రజల కోసం , రాష్ట్ర భవిష్యత్ కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో అతని గొంతు వినాలన్నారు.జనమే జయం అని నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంలో గెలిపించాలని కోరారు.
ప్రజల సేవకుడిగా సైనికుడిగా నిలబడతాడన్నారు. వారి కోసం అవసరమైతే కలబడతాడన్నారు. పిఠాపురం ప్రజలకు విన్నపం చేస్తున్నానని గాజుగ్లాసు గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలన్నారు.
సంబంధిత కథనం