Janasena Politics: పవన్‌ కళ్యాణ్‌కు కాపులు అండగా నిలుస్తారా!వైసీపీ నాయకులు చేస్తోన్న సాయమేంటి?-will the kapu community stand by pawan kalyan in elections ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Janasena Politics: పవన్‌ కళ్యాణ్‌కు కాపులు అండగా నిలుస్తారా!వైసీపీ నాయకులు చేస్తోన్న సాయమేంటి?

Janasena Politics: పవన్‌ కళ్యాణ్‌కు కాపులు అండగా నిలుస్తారా!వైసీపీ నాయకులు చేస్తోన్న సాయమేంటి?

Sarath chandra.B HT Telugu
May 07, 2024 08:21 AM IST

Janasena Politics: జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు కాపు ఓటర్లు ఎన్నికల్లో అండగా నిలబడతారా, కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేయడంలో వైసీపీ కీలక పాత్ర పోషించిందా? అనే సందేహాలు కూడా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతున్న ముద్రగడ కుమార్తె క్రాంతి
పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతున్న ముద్రగడ కుమార్తె క్రాంతి

Janasena Politics: ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తారనే చర్చతో పాటు కాపులు ఎంత వరకు పవన్‌ కళ్యాణ్‌కు అండగా నిలబడతారనే చర్చ కూడా జరుగుతోంది. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల చుట్టూ తిరిగే ఏపీ రాజకీయాల్లో స్వీయ అస్తిత్వం కోసం ప్రయత్నిస్తున్న కాపు సామాజిక వర్గం పవన్‌కు అండగా ఉంటుందా లేదా అనే చర్చ నడుస్తోంది.

ఇటీవలి కాలంలో రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారాయి. రెండు వీడియోల వెనుక ఒక ఉమ్మడి అంశం కూడా ఉంది. అందులో ఒక వీడియో మంత్రి అంబటి రాంబాబు అల్లుడిదైతే, మరో వీడియో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తెది. ఇద్దరూ వైఎస్సార్సీపీని వ్యతిరేకంగా వీటిని పోస్ట్ చేశారు. దానిపై ఆ పార్టీలో ఉన్న నేతలు కూడా అంతే స్పీడ్‌గా రియాక్ట్ అయ్యారు. వైసీపీతో సంబంధం నాయకుల వారసులు, సమీప బంధువులు కావడంతో రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమనేతగా అందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. అంతకు ముందు జనసేనలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. తెరవెనుక ఏమి జరిగిందో తెలీదు కానీ ముద్రగడ వైసీపీ వైపు మొగ్గు చూపారు. ముద్రగడ వైఎస్సార్సీపీకి మద్దతిస్తూ, పవన్ కళ్యాణ్‌ని ఓడించాలని జగన్ కంటే ఎక్కువ పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తనపేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని శపథం కూడా చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ మీద నోరేసుకు పడిపోయే అంబటి రాంబాబు గురించి పరిచయం అక్కర్లేదు. ముద్రగడ రాజకీయ వైఖరికి భిన్నంగా ముద్రగడ కుమార్తె క్రాంతి పవన్ కళ్యాణ్ కు మద్దతిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అటు అంబటి రాంబాబు అల్లుళ్ళలో ఒకరు తన మామగారికి వ్యతిరేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలపై ముద్రగడ, అంబటి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ కేంద్రంగానే ఈ మొత్తం వ్యవహారం సాగింది.

కోస్తా కాపు రాజకీయాలు….

కోస్తా ప్రాంతంలో కాపులుగా పిలవబడే తెలగ అనే కులం రాజకీయాల్లో సీఎం పోస్టు కోసం చాలా దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాధ్యపడలేదు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో కూర్మా వెంకట రెడ్డి నాయుడు మాత్రమే ఆ కులం నుంచి సీఎం అయిన వ్యక్తి. తరువాత చిరంజీవి రూపంలో ఒక ప్రయత్నం జరిగి విఫలం అయింది.

ఆ తరువాత పవన్ కళ్యాణ్ మరో ప్రయత్నంగా ముందుకు వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ నిజంగా తాను సీఎం అవ్వాలనుకునే రాజకీయాల్లోకి వచ్చారా అన్నది కూడా స్పష్టత లేదు. పవన్ కులాన్ని ఎంత సొంతం చేసుకున్నా చేసుకోకపోయినా, ఆ కులం వాళ్లు చాలా మంది పవన్ కళ్యాణ్‌ను తమ గుర్తింపుగా భావిస్తున్నారు. అంతే సంఖ్యలో కాపుల్లో పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు.

ఉమ్మడి ఏపీలో ప్రాంతాలను బట్టి కాపులు కాంగ్రెస్, తెలుగుదేశం మధ్య నాయకులుగా ఎదిగారు. ఆ తరువాత వైయస్సార్ నేృత్వంలోని కాంగ్రెస్ పార్టీ – తెలుగుదేశం మధ్య రాజకీయాల్లో నడిచిన సమయంలో ప్రజారాజ్యం వచ్చి రెండు వైపుల ఉన్న కాపుల్లో కొందరిని తమవైపు తిప్పుకుంది.

అయితే అందర్నీ ఆ పార్టీ తమవైపు తిప్పుకోలేక పోయింది. ప్రజారాజ్యం విలీనం తరువాత ఎవరి దారి వారు చూసుకున్నారు. దీంతో జనసేన రాజకీయాల్లోకి వచ్చినా అనుమానంగా చూసి చేరని వారు ఎక్కువ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పట్టుదలగా అలాగే నిలబడడం చూసి కొత్తగా రాజకీయాల్లోకి వస్తోన్న కాపులు చాలా మంది ఆ పార్టీలో చేరారు. పార్టీలో నాయకులు చేరడం ఒక ఎత్తైతే ఆ కులంలోని ఓటర్లంతా పార్టీని ఓన్ చేసుకునే దశకు చేరిందని కాపు సామాజిక వర్గ నాయకులు చెబుతున్నారు.

తెలుగునాట ఒక్క తెలుగుదే‌‍శం పార్టీకి మాత్రమే ఒకప్పుడు ఈ ముద్ర ఉండేది. మెజార్టీ కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశాన్ని తమ పార్టీగా చూస్తారు. తాము ఎక్కడ ఉన్నా అక్కడ అభ్యర్థితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ చెప్పిన వారికి ఓటేసే వారు కూడా ఆ కులంలో కనిపిస్తారు. రాజశేఖర రెడ్డి తరువాత రెడ్లు క్రమంగా కాంగ్రెస్ పార్టీ వైపు అలా మళ్లడం కనిపిస్తుంది.

అది జగన్ హయాంలో తారాస్థాయికి వెళ్లింది. ఇప్పుడు కమ్మల తరువాత రెడ్లు వైయస్సార్సీపీని అదే రీతిలో ఓన్ చేసుకోవడం ఏపీలో కనిపిస్తుంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలనే బలమైన కాంక్షతో రెండు ప్రధాన సామాజిక వర్గాలు రాజకీయాలను నడిపించడం ఏపీలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

ప్రజారాజ్యానికి దక్కని అవకాశం….

టీడీపీ, వైసీపీలను కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు సొంతం చేసుకున్నట్టు 2009లో ప్రజారాజ్యాన్ని కానీ, 2014, 2019 ఎన్నికల్లో జనసేనను సొంతం చేసుకున్నట్టు కనిపించదు. ఎందుకంటే కాపుల జనాభా ఎక్కవ ఉన్న నియోజకవర్గాల ఓటింగ్ సరళిని పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టం అవుతుంది. కాపులు జనసేన వైపే కాకుండా స్థానిక పరిస్థితులను బట్టి వైయస్సార్సీపీ, తెలుగుదేశాల వైపు కూడా ఉన్నట్టు స్పష్టంగా కనిపించేది.

తాజా ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఆ పరిస్థితిలో బాగా మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కనిపించిన ఈ మార్పు ప్రభావం అటు విశాఖ, ఇటు కృష్ణా జిల్లాలతో పాటు కోస్తా మొత్తం పాకే అవకాశం కూడా లేకపోలేదు.

గతంలో మాదిరి కాకుండా మెజార్టీ కాపు కుటుంబాలు, కాపు ఓటర్లు తమ కులానికి చెందిన పవన్ కళ్యాణ్‌కు అండగా నిలవాలనే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తుంది.కాపు కులానికి చెందిన పలువురు మధ్య స్థాయి చిన్న స్థాయి నాయకులు, యువత, వ్యాపార వర్గాలతో మాట్లాడినప్పుడు ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.

గతంలో మాదిరి ఈసారి కాపు ఓట్లు చీలే అవకాశం చాలా తక్కువని, పవన్‌ విషయంలో గోదావరి జిల్లాల కాపు ఓటర్ల అభిప్రాయంలో మార్పు కనిపిస్తోందనే వాదన ఉంది. కాపు ఓట్ల విషయంలో తమ బలంలో ఏ మాత్రం మార్పు లేదని వైసీపీ కూడా ధీమాగానే ఉంది.

(కాపు ఉపకులాల ఓట్ల ఏకీకరణలో వైసీపీ నేతల పాత్ర ఏమిటి, మరో కథనంలో)

సంబంధిత కథనం