Amit Shah : ఏపీని అవినీతి పాలన నుంచి రక్షించేందుకే టీడీపీ, జనసేనతో పొత్తు-అమిత్ షా
Amit Shah : ఏపీని అవినీతి నుంచి రక్షించి వికసిత ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ధర్మవరం బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా... కూటమి ప్రభుత్వం గెలిస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నారు.
Amit Shah : టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు(TDP JSP BJP Alliance)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరుగుతున్న గూండాగిరి, అవినీతి, భూదోపిడీ అరికట్టడానికి పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకం అరికట్టటానికి, టీడీపీ-జనసేన-బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపటానికి ఏపీకి వచ్చానన్నారు. ధర్మవరంలో నిర్వహించిన సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ... ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం(Polavaram) ప్రాజెక్టును పూర్తి చేసే పూర్తి బాధ్యత ఎన్డీఏ కూటమిదన్నారు. ఎన్డీఏ(NDA) పక్షాలు ప్రజలకు తాగు, సాగు నీరు ఇవ్వాలని చూస్తుంటే సీఎం జగన్ మాత్రం ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. అమరావతిని రాజధానిగా పునర్నిర్మించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాలన్నారు. ఆరోగ్యశ్రీ (Aarogyasri)నిధులను విడుదల చేయకపోవడం వల్ల పేదలకు వైద్యం అందటం లేదని ఆరోపించారు. 130 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్(Covid Vaccine) పంపిణీ చేసి, కరోనా సమయంలో మోదీ ప్రజలను రక్షించారన్నారు.
రెండేళ్లలో పోలవరం పూర్తి
"టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు ఇచ్చి, భారీ మెజారిటీతో గెలిపించండి. రాష్ట్ర అభివృద్ధి సంగతి కూటమికి వదిలేయండి. జగన్ తన అవినీతితో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబును గెలిపించండి. రెండేళ్లల్లో పోలవరం(Polavaram) పూర్తి చేసి తీరుతాం. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్(Double Engine Sarkar) ఏర్పాటు చేస్తాం. పోలవరం పూర్తి చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ(Modi Guarantee). జగన్ ప్రభుత్వం తెలుగు భాషను చంపి ప్రాథమిక విద్యా హక్కును హరిస్తోంది. బీజేపీ ఉన్నంత వరకు మాతృభాషను కాపాడతాం. ఏపీని అవినీతి నుంచి రక్షించి వికసిత ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నాము"- కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు?
దేశాన్ని రక్షించేందుకు, నక్సలైట్లు, ఉగ్రవాదులను అరికట్టేందుకు మూడోసారి మోదీ(Modi) ప్రధాని కావాలని అమిత్ షా అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని చంద్రబాబు(Chandrababu) అభివృద్ధి చేశారని, అయితే జగన్(Jagan) రాష్ట్రాన్ని అధోగతి పట్టించారని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తానని ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. మద్య నిషేధం(Ban on Liquor) చేయకపోగా, సిండికేట్‌కు తెరలేపి మద్యం ఏరులై పారించారన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబును గెలిపిస్తే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. 25కు 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లను గెలిపించి చంద్రబాబును సీఎంను చేయాలని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియా కూటమి(INDIA Alliance)పై విమర్శలు చేసిన అమిత్‌షా... ఆ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, రాహుల్ గాంధీ ఎవరిని ప్రధాని చేస్తారో చెప్పాలన్నారు. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థే లేరని అమిత్ షా ఎద్దేవా చేశారు.
సంబంధిత కథనం