Karimnagar : బండెక్కిన పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ ఆందోళన వ్యక్తం
12 May 2024, 21:16 IST
- Karimnagar : కరీంనగర్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు, నేతలు ఆకరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు బండిపై తిరుగుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ...ఓటర్లను పలకరించారు. కాంగ్రెస్ ఓటర్లను ప్రలోభపెడుతోందని బండి సంజయ్ ఆరోపించారు.
బండెక్కిన పొన్నం ప్రభాకర్, బండి సంజయ్ ఆందోళన వ్యక్తం
Karimnagar : పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ కు గడువు దగ్గర పడుతున్న కొద్ది కరీంనగర్ లో కాంగ్రెస్ జోష్ పెంచింది. ప్రత్యర్థి పార్టీలకు భయం పుట్టిస్తుంది. కరీంనగర్ లో మకాం వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. పోలింగ్ గడువు ముగిసే వరకు అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేర్చి పోలింగ్ శాతాన్ని పెంచడంతోపాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల కంటే పది శాతం ఓట్లు ఎక్కువ రావాలని ఆదేశించింది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు మంత్రి సూచించారు.
బండి సంజయ్ ఆందోళన
గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ లో మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ ను ఈసారి మొదటి స్థానంలో నిలిపేలా చర్యలు చేపట్టారు. నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రతి బూత్ ల వారిగా ఇన్ ఛార్జ్ లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతిపక్షాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ బైక్ పై చక్కర్లు కొట్టారు. రోడ్డు ప్రక్కన హోటల్ లో టీ తాగి ఓటర్లను ఆకట్టుకున్నారు. బండిపై మంత్రి పొన్నం తిరుగుతుండడంతో బీజేపీకి చెందిన బండి సంజయ్ భయాందోళన చెందారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఓటుకు నోటు ఇస్తు మద్యం పంచుతూ ఓటర్లను ప్రలోభ పెడుతుందని సీ విజిల్ ద్వారా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో అధికార పార్టీ కాంగ్రెస్ కు అధికారులు కొమ్ము కాస్తున్నారని సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బు, మద్యం పంపిణీ ని అడ్డుకోకపోతే బీజేపీ కార్యకర్తలు ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతారని హెచ్చరించారు.
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కార్పొరేటర్
ప్రచారం ముగిసింది... పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతున్న క్రమంలో కరీంనగర్ లో రాజకీయ వలసలు కొనసాగాయి. బీఆర్ఎస్ చెందిన కార్పొరేటర్ ఆర్ష కిరణ్మయి మల్లేశం వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ న్యాయవాది బల్మూరి మహేందర్ రావు మంత్రి పొన్నం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు నగరంలో 13 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో మొత్తం 60 డివిజన్ లు ఉండగా కాంగ్రెస్ పార్టీ ఒక్క డివిజన్ కూడా గెలుచుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పార్లమెంట్ ఎన్నికల పుణ్యమాని 13 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కార్పొరేటర్ లు, కుల సంఘాల ప్రతినిధులు చేరికతో కాంగ్రెస్ కు అదనపు బలంగా మారింది.
HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar