TS BJP : లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీకి వరుస షాక్ లు, ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న కీలక నేతలు
15 April 2024, 16:42 IST
- TS BJP : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు...అదునుచూసి జారుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీని వీడుతున్నారు. ఇప్పటికే పది మంది కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు.
బీజేపీకి వరుస షాక్ లు
TS BJP : తెలంగాణ బీజేపీ నేతల(TS BJP) ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అభ్యర్థులుగా నిలిచిన దాదాపు పది మంది ఆ పార్టీని వీడారు. త్వరలో మరికొంత మంది నేతలు బీజేపీని విడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections) సమయం సమీపిస్తున్న తరుణంలో నేతలు ఒక్కొక్కరుగా బీజేపీకి గుడ్ బై చెబుతూ ఉండడం కమలనాధులను కలవరపెడుతోంది. రోజుకో కీలక నేత బీజేపీని వీడుతూ ఉండడంతో రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమై.....నేతలు చేజారకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ నేతలు సమయం చూసుకుని ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండడంతో చాప కింద నీరులా పార్టీ పరిస్థితి అయిందని సామాజిక మాధ్యమాల్లో సొంత పార్టీ శ్రేణులు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఊపు మీద ఉన్న బీజేపీకి నేతలు సమయం చూసుకొని గుడ్ బై చెబుతూ ఉండడంతో ప్రస్తుతం తలనొప్పిగా మారింది.
గుడ్ బై చెప్పిన పది మంది వీళ్లే
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన పదిమంది అభ్యర్థులు బీజేపీని(BJP) వీడారు. అందులో ప్రధానంగా శ్రీశైలం గౌడ్, పులిమామిడి రాజు, ఆరేపల్లి మోహన్, శ్రీ గణేష్, రవీంద్ర నాయక్, చలమల కృష్ణారెడ్డి, బాబు మోహన్, రతన్ పండు రంగా రెడ్డి, జలంధర్ రెడ్డి , మిథున్ రెడ్డి ఉన్నారు. ఈసారి మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన బీజేపీ కీలక నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి(Jithender Reddy) సైతం కమలం పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. ఆయన చేరిన తరువాత ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, రతన్ పండు రంగా రెడ్డి, జలంధర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుని డీకే అరుణ(DK Aruna)ను ఒంటరిని చేయాలన్నదే కాంగ్రెస్ మాస్టర్ ప్లానట. ఈ ఎన్నికల్లో డీకే అరుణను ఎలాగైనా ఓడించాలని జితేందర్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో డీకే అరుణకు అన్నీ విధాలుగా చెక్ పెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్(Congress) నేతలు భావిస్తున్నారు.
నేతలు చేజారకుండా ప్రయత్నాలు
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా.....తెలంగాణలో బీజేపీ( TS BJP) కనీసం 12 స్థానాల్లో గెలవాలని లక్ష్యంతో ఉంది. అయితే సరిగ్గా ఎన్నికల ముందు ఒక్కో నేత పార్టీకి గుడ్ బై చెబుతూ ఉండడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే అసంతృప్తి నేతలు ఎవరు? వారి సమస్యలు ఏంటి అనే దానిపై నాయకత్వం ఆరా తీస్తుంది. నేతలు చేజారకుండా వారిని బుజ్జగిస్తుంది. ఒకవైపు పార్టీ కీలక నేతలు అసంతృప్తులను బుజ్జగిస్తున్నా ఎలాంటి సత్ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే సికింద్రాబాద్ ఉపఎన్నిక(Secunderabad By Election) బీజేపీ అభ్యర్థిగా భావించిన శ్రీ గణేష్ ఉన్నపళంగా కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ బీజేపీ అభ్యర్థి కరవయ్యారు. ఇలా అనేక పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీకి ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. దీంతో బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందో వేచి చూడాలి.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా