Assemebly election results : బీజేపీదే అరుణాచల్ ప్రదేశ్- సిక్కింలో ఎస్కేఎం జోరు..
02 June 2024, 12:14 IST
Assemebly election results 2024 : అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ గెలుపు ఖరారైపోయింది! సిక్కింలో అధికార ఎస్కేఎం భారీ విజయాన్ని చూడబోతోంది.
అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రేమ ఖండూ..
Arunachal Pradesh Assemebly election results : 2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో మంచి జోరు మీద ఉన్న బీజేపీకి మరో శుభపరిణామం! అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖాయమైపోయింది! ఆదివారం ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా.. మొదటి నుంచే బీజేపీ హవా కొనసాగింది. అటు సిక్కింలో అధికారంలో ఉన్న ఎస్కేఎం.. మరోమారు విజయ తీరాలకు చేరనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..
60 సీట్లున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 2024 ఏప్రిల్ 19న ఎన్నికలు జరిగాయి. మెజారిటీ మార్క్ 31గా ఉంది. కాగా.. సీఎం ప్రేమ ఖండూ సహా 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. మిగిలిన 50 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం మొదలైంది.
BJP Arunachal Pradesh : పీవాల్యూ ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఇప్పటివరకు 23 స్థానాల్లో గెలిచింది. మరో 21 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అంటే 60 స్థానాల్లో 44 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా.. రెండోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టడం ఖరారైపోయింది.
ఇక నేషనల్ పీపుల్స్ పార్టీ.. ఒక సీటు గెలిచి, మరో 4 చోట్ల లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరవలేదు. ఎక్కడా లీడింగ్‌లో కూడా లేదు. ఇతరులు ఒక స్థానంలో గెలిచారు.
కాగా.. ఎన్పీపీ.. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా 20 చోట్ల పోటీ చేసింది. బీజేపీకి ఒకవేళ మెజారిటీ రాకపోయినా.. ఎన్పీపీ ఎలాగో మద్దతు ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే.. అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా మారింది.
2019 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 సీట్లు వచ్చాయి. జేడీయూకి 7 సీట్లు, ఎన్పీపీకి ఐదు సీట్లు దక్కాయి. కాంగ్రెస్ నాలుగు చోట్ల గెలిచింది.
సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..
Sikkim Assemebly election results : 2024 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎస్కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా) భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోనుంది. 32 అసెంబ్లీ సీట్లకు ఆదివారం ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా.. మొదటి నుంచి ఎస్కేఎం దూసుకెళుతోంది. మెజారిటీ 17గా ఉండగా.. పీవాల్యూ ప్రకారం.. ఎస్కేఎం ఇప్పటికే 13 చోట్ల గెలిచింది. మరో 14 చోట్ల లీడింగ్‌లో ఉంది. అంటే.. 27సీట్లల్లో ఎస్కేఎం విజయం సాధించే అవకాశం ఉంది.
ప్రధాన ప్రత్యర్థి ఎస్డీఎఫ్ (సిక్కిం డెమొక్రటిక్ ఫ్రెంట్).. 5 చోట్ల లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్ పార్టీ.. లీడింగ్‌లో కూడా ఖాతా తెరవలేదు!
మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్, బర్ఫుంగ్ నియోజకవర్గంలో ఎస్డీఎఫ్ అభ్యర్థి బైచుంగ్ బుటియా.. ఓటమికి అడుగు దూరంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి, ఎస్కేఎం నేత కాలా రాయ్.. బైచుంగ్ బుటియా కన్నా దాదాపు 4వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
2019లో సిక్కింలో ఎస్కేఎం 17 స్థానాల్లో గెలిచింది. ఎస్డీఎఫ్ 15 చోట్ల విజయం సాధించింది. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే.. ఎస్కేఎం భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం!