KCR Letter to CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత సీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం పక్షాన నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు తనకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని, అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా… కాంగ్రెస్ దయాభిక్షగా చేస్తున్న ప్రచారాన్ని నిరసిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. 1969 నుంచి ఐదు దశాబ్దాలుగా…. భిన్నదశలలో, భిన్నమార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగిందన్నారు. చరిత్ర పొడుగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యమని తన లేఖలో ప్రస్తావించారు.
1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకుందని…. అక్కడ్నుంచే కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగిందని విమర్శించారు. ఫజల్‌అలీ కమిషన్ సిఫార్సులను కాలరాచి, తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంద్రప్రదేశ్‌ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో ఐదారు తరాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని తెలిపారు.