YS Sharmila Fires on Bharati : వాళ్లనూ గొడ్డలితో నరికేయండి, అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్- వైఎస్ భారతికి షర్మిల కౌంటర్
08 May 2024, 14:39 IST
- YS Sharmila Fires on Bharati : కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ అంటూ సీఎం జగన్ సతీమణి భారతి చేసిన వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. మిగత వాళ్లను గొడ్డలితో నరికేయండి. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అంటూ ఫైర్ అయ్యారు.
వైఎస్ షర్మిల
YS Sharmila Fires on Bharati : గొడ్డలితో మిగతా వాళ్లను నరికేయండి అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్. వైఎస్ భారతి స్ట్రాటజీ ఇదేనా? అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆమె...ఎంపీ అవినాష్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీగా అవినాష్ గెలిస్తే నేరం గెలిచినట్లేనన్నారు. ఓటమి భయంతో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఊరు దాటేందుకు పాస్‌పోర్టులు సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్ రెడ్డి ఉన్నారన్నారు. కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ అంటూ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి చేసిన కామెంట్స్ కు షర్మిల కౌంటర్ ఇచ్చారు. మీరే అధికారంలో ఉండాలి, మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరినీ నరికేయాలి.. మీరే సింగిల్ ప్లేయర్‌గా ఉండాలి. ఇదేనా వైఎస్ భారతి స్ట్రాటజీ అంటూ విమర్శలు చేశారు. మిగతా వాళ్లందరినీ గొడ్డలితో నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్ అన్నారు. కడప ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే తనకు ఓటు వేయాలని, ఎంపీని జైలులో కలవాలంటే అవినాష్ రెడ్డికి ఓటెయ్యాలన్నారు. దేవుడు తమ వైపే ఉన్నారని, గొడ్డలితో నరికే వాళ్ల వైపు కాదని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.
టీడీపీతో పొత్తు, తెరచాటున జగన్ తో దోస్తీ
పదేళ్లుగా ఏపీ వినాశనంలో... ఇక్కడి పాలక, ప్రధాన ప్రతిపక్షాలతో కలిసి ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీకి సంబంధించి ప్రధాని మోదీ వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేశామన్నారు. మీ మన్ కీ బాత్ కాదు మోదీజీ, ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినండి అన్నారు. గత పదేళ్లలో మోదీ దేశానికి ప్రధానిగా అన్ని వర్గాలవారిని మోసం చేసి, మతం పేరుతో దేశ ప్రజలపై ద్వేషపు కోరలు చాచి, దేశ ఐక్యతను, ప్రజల మధ్య సోదరభావాన్ని దెబ్బతీసే ప్రయాత్నాలు చేస్తూనే ఉన్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అతి తీవ్రంగా నష్టపోయి, అన్నివిధాలుగా సర్వనాశనం అయ్యిందన్నారు. మొదట టీడీపీతో కలిసి ఉన్న బీజేపీ, విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా తీర్చలేదన్నారు. కుమారుని కోసం చంద్రబాబు, కేసుల భయంతో జగన్, ఇద్దరు బీజేపీని ఎదిరించి నిలదీసే ధైర్యం ఒక్కసారి కూడా చెయ్యలేదన్నారు. ఇవాళ మళ్లీ, ఏ టీడీపీతో తిట్టించుకున్నారో వారితో కలిసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. అటు తెరచాటు జగన్ తో దోస్తీ చేస్తూనే ఉన్నారన్నారు. ఇంత సిగ్గుమాలిన రాజకీయం చేస్తూ, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదాపై యూటర్న్
తిరుమల వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాపై మాటిచ్చిన మోదీ మోసం చేశారని వైఎస్ షర్మిల విమర్శించారు. ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినండి, అందులో మీరు నేరస్తులు అన్నారు.
పదేళ్ల బీజేపీ పాలనపై ఆంధ్రకు జరిగిన పది అన్యాయాలతో ఛార్జ్ షీట్ ప్రజల తరపున తీసుకువస్తున్నామన్నారు. నాడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హెూదా అని, తర్వాత ఆ మాట మరిచి రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారన్నారు. జగన్ రివర్స్ టెండరింగును అడ్డుకోకుండా, పోలవరం ప్రాజెక్టు వినాశనానికి నాంది పలికారు, ఎత్తు తగ్గించే కుట్రలు కూడా చేస్తున్నారన్నారు. మీ చేతులమీదుగా భూమిపూజ చేసిన అమరావతి రాజధాని పదేళ్ల తర్వాత కూడా పూర్తి కాలేదన్నారు. పోరాటాలు, ప్రాణార్పణతో సాకారమైన విశాఖ ఉక్కును, అక్కడి సెంటిమెంటుకు విరుద్ధంగా అమ్మేద్దామని చూస్తూ, మళ్లీ విశాఖ మీద దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారన్నారు. కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటివి, విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను తుంగలోతొక్కి, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారన్నారు. సీఎం జగన్ మద్యం సిండికేటు నడుపుతూ, కల్తీ మద్యంతో మనుషుల ప్రాణాలు తీస్తున్నా ప్రధానిగా ఉలకలేదు, పలకలేదన్నారు. దిల్లీలో కేజ్రివాల్ ను అరెస్టు చేశారు, ఇక్కడ మాత్రం ఎటువంటి చర్యలు లేవన్నారు.
ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినండి
దేశంలో ఎస్సీ, ఎస్టీల రేజర్వేషన్లను అంతం చేయటానికి ప్రధాని మోదీ పూనుకున్నారని షర్మిల ఆరోపించాు. రాష్ట్రంలో దళితులపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా, మీ కమిషన్లకు ఫిర్యాదులు చేస్తున్నా, జగన్ సర్కారును ప్రశ్నించలేదు, చర్యలు తీసుకోలేదన్నారు. ఇసుక, మద్యం, ఖనిజాలు, అక్రమ కాంట్రాక్టులు, రాష్ట్రం చేస్తున్న అప్పులు, కేంద్రం ఇచ్చే నిధుల మళ్లింపు, ఇలా ఎటు చూసినా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నా, కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవని మండిపడ్డారు. కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ వచ్చి, చేతకాక, శాంతిభద్రతల సమస్యంటూ బెదిరి వెనుతిరిగిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాటయిచ్చి తప్పారన్నారు. మోదీ ఏపీ ప్రజల మన్ కీ బాత్ లో మీరు కచ్చితంగా దోషే అని, ఇక్కడి ప్రజలను క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.