YS Jagan In Pulivendula: అవినాష్ ఏ తప్పు చేయలేదు కాబట్టే టిక్కెట్ ఇచ్చానన్న జగన్, షర్మిలపై తీవ్ర ఆరోపణలు-cm jaganmohan reddy gave clean chit to mp avinash reddy in pulivendula ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ys Jagan In Pulivendula: అవినాష్ ఏ తప్పు చేయలేదు కాబట్టే టిక్కెట్ ఇచ్చానన్న జగన్, షర్మిలపై తీవ్ర ఆరోపణలు

YS Jagan In Pulivendula: అవినాష్ ఏ తప్పు చేయలేదు కాబట్టే టిక్కెట్ ఇచ్చానన్న జగన్, షర్మిలపై తీవ్ర ఆరోపణలు

Sarath chandra.B HT Telugu
Apr 25, 2024 11:30 AM IST

YS Jagan In Pulivendula: కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ఏ తప్పు చేయలేదని నమ్మడంతోనే అతనికి టిక్కెట్ ఇచ్చినట్టు పులివెందులలో సిఎం జగన్ ప్రకటించారు. వివేకానందరెడ్డిని ఎవరు చంపారో జిల్లా మొత్తానికి తెలుసన్నారు.

ఎంపీ అవినాష్‌ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చిన సిఎం జగన్
ఎంపీ అవినాష్‌ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చిన సిఎం జగన్

YS Jagan In Pulivendula: వివేకా నంద రెడ్డి Vivekananda Murder హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డిపై అభాండాలు వేస్తున్నారని పులివెందులలో సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో అందరికంటే వయసులో అవినాష్ రెడ్డే చిన్నోడని, అవినాష్‌ వంటి చిన్న పిల్లోడి మీద దుష్ప్రచారం చేస్తున్నారని, అందరితో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. అవినాష్‌ ఏ తప్పు చేయలేదని తన నమ్ముతున్నాను కాబట్టే అతనికి ఎంపీ టిక్కెట్ ఇచ్చానని చెప్పారు. 

Pulivendula పులివెందులలో సిఎం జగన్ నామినేషన్ Nomination దాఖలు చేశారు. వైఎస్‌ అవినాష్‌ ఏ తప్పు చేయలేదని బలంగా నమ్మడంతోనే టిక్కెట్ ఇచ్చానని, అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నారని, చిన్నపిల్లాడైన అవినాష్‌ను తెరమరుగు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అవినాష్ లాంటి చిన్న పిల్లాడి జీవితం నాశనం చేయాలని పెద్దపెద్ద వాళ్లంతా కుట్రలు చేస్తున్నారన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు పులివెందుల వెళ్లిన సిఎం జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు, అభిమానులు ఉద్దేశించి మాట్లాడారు. తనను ఎన్నికల్లో ఓడించలేక ప్రత్యర్థులు అంతా ఒక్కటయ్యారని, వారితో తన చెల్లెళ్లు కూడా కలిశారని ఆరోపించారు.

వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు జిల్లాలో అందరికి తెలుసని చెప్పారు. ఏ పార్టీతో తాము పోరాడమో, ఏ పార్టీ తన తండ్రి వైఎస్సార్‌ను అవమానించిందో, చనిపోయిన తర్వాత కేసుల్లో ఇరికించిందో అదే పార్టీలో చేరారని షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

వివేకానంద రెడ్డికి రెండో పెళ్లి అయ్యిందో లేదో చెప్పాలని, రెండో పెళ్లి ద్వారా సంతానం ఉన్నారో లేదో సమాధానం చెప్పాలన్నారు. ఎవరు సమాచారం ఇస్తే వివేకా హత్య జరిగిన చోటుకు అవినాష్‌ వెళ్లారని జగన్ ప్రశ్నించారు.

పులివెందుల ప్రసంగంలో సిఎం జగన్‌ సోదరి షర్మిలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ శత్రువులతో చేతులు కలిపి, పసుపు చీర కట్టుకుని వారి ఆశీర్వదాలు తీసుకోడానికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనను ఓడించడానికి ప్రత్యర్థులంతా ఏకం అయ్యారని వారితో తన చెల్లెళ్లు కూడా చేరారని ఆరోపించారు.

ప్రజలు తనను నమ్మి అధికారాన్ని కట్టబెట్టింది కుటుంబానికి, బంధువులకు దోచి పెట్టడానికి కాదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమను దూరం పెట్టారని ఆరోపించే వారంతా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని షర్మిలను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చింది కుటుంబ సభ్యుల్ని కోటీశ్వరుల్ని చేయడానికి కాదని, పేదలకు మేలు చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక తమను పక్కన పెట్టాడనే వారు  ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. 

చిన్నాన వివేకాను చంపింది ఎవరో దేవుడికి, జిల్లా ప్రజలకు తెలుసని, వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరని ప్రశ్నించారు. వివేకాకు రెండో భార్య ఉన్నది నిజం కాదా అన్నారు. పసుపు మూకలతో చెల్లెమ్మలు కుట్రలో భాగం అయ్యారని, చిన్నాన్నను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించిన వాళ్లతో చెట్టా పట్టా లేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. తమ సొంత లాభంకోసం ఎవరు ఈ కుట్ర చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు.

పులివెందులలో అభివృద్ధి పరుగులు…

పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం, పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్‌ స్టోరీ అని జగన్ చెప్పారు. పులివెందులలో అభివృద్ధికి కారణం వైఎస్సార్‌.. వైఎస్సార్‌ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది తమ ప్రభుత్వం అన్నారు.

పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నాంమన్నారు. పులివెందుల ఒక విజయగాథ అని, పులివెందుల కల్చర్‌, కడప కల్చర్‌, రాయలసీమ కల్చర్‌ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారని, మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం పులివెందుల కల్చర్‌ అన్నారు.

టీడీపీని నాలుగు దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదురించింది పులివెందుల బిడ్డేనని వైఎస్సార్‌, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, బాబు వదినమ్మ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్‌ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరని ప్రశ్నించారు. వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు?.. నాన్నగారిపై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరని ప్రశ్నించారు.

వైఎస్సార్‌ పేరును ఛార్జిషీట్‌లో పేర్కొంది ఎవరు? వైఎస్సార్‌ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్సార్‌సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవారు వైఎస్సార్‌ వారసులా అని ప్రశ్నించారు. వాళ్లు వైఎస్సార్‌ వారసులా, చంద్రబాబు వారసులా అని జగన్ ప్రశ్నించారు.

పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్‌ శత్రువులతో చేతులు కలిపిన వీళ్లా వైఎస్సార్‌ వారసులు అని షర్మల, సునీతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. . చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలో భాగం అయ్యారని, వైఎస్సార్ పేరు కనబడకుండా చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నించిందని, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా? - హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా? నోటాకు వచ్చినన్ని ఓటర్లు రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా? అని జగన్ ప్రశ్నించారు.

Whats_app_banner

సంబంధిత కథనం