Modi in Karimnagar : ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి తెలంగాణను కాపాడాలి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే - ప్రధాని మోదీ
Modi Election Campaign in Telangana : ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి తెలంగాణను విముక్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వేములవాడ సభలో మాట్లాడిన ఆయన… తెలంగాణలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Modi Election Campaign in Karimnagar : కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి విజయం పక్కాగా కనిపిస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. బుధవారం వేములవాడలో జరిగిన సభలో పాల్గొన ఆయన… కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
మన దేశంలో ఎంతో సమర్ధత ఉన్నా ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యల వలయంగా మార్చిందని మోదీ విమర్శించారు. తెలంగాణలో ఆర్ఆర్(రేవంత్, రాహుల్ గాంధీ) ట్యాక్స్ నడుస్తోందని దుయ్యబట్టారు. RR ట్యాక్స్ నుంచి తెలంగాణను విముక్తి చేయాలని కామెంట్స్ చేశారు. ప్రభుత్వం వచ్చిన కొద్దిరోజుల్లోనే కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపంచారు. ఈ వసూళ్లు తెలుగులో వచ్చిన RRR సినిమాను మించిపోయిందన్నారు. ఈ డబ్బులన్నీ ఢిల్లీకి పంపిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీకి నేషన్ మాత్రమే ఫస్ట్ అని మోదీ స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్ అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తేడా ఏమీ లేదన్నారు. ఆ పార్టీలను ఓడించి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్, ఇండియా కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయిందని మోదీ కామెంట్స్ చేశారు.
ఇక్కడ విజయం సంజయ్ దే…!
“ఇక్కడ(కరీంనగర్ లో) బీఆర్‌ఎస్ అడ్రస్ కూడా కనిపించడం లేదు. కరీంనగర్ లో బీజేపీ విజయం ఇప్పటికే ఖాయమైంది. పదేళ్లుగా నా పనితీరు ఎలా ఉందో మీరంతా గమనించారు.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మనదేశం చేరింది. మీరంతా బీజేపీకి ఓటు వేసిన కారణంగానే దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది” అని ప్రధాని మోదీ అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ పార్టీల నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రధానిగా పనిచేసిన పివి నరసింహరావు వంటి వారికి కూడా కాంగ్రెస్ పార్టీ తగిన గౌరవం ఇవ్వలేదన్నారు. ఆయనకు భారతరత్నతో గౌరవించామని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అవినీతి విషయంలో ఇద్దరు తోడు దొంగలేనని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గండికొట్టాలని చూస్తుందని మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని బీజేపీ భావిస్తుంటే కాంగ్రెస్ పార్టీ దానిని వ్యతిరేకిస్తోందని అన్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేశామని మోదీ గుర్తు చేశారు. రామమందిర నిర్మాణానికి తెలంగాణ నుంచి తలుపులు వచ్చాయన్నారు. తెలంగాణ కలపతో రామ మందిర నిర్మాణం జరిగిందని… కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈర్ష్య, ద్వేషంతో రగిలిపోతుందన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి స్థానాల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు.
సభ ప్రారంభానికి ముందు శ్రీరాజరాజేశ్వరస్వామిని మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.దక్షిణ కాశీ భగవానుడు శ్రీరాజరాజేశ్వరస్వామికి ప్రణామాలు అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఇక ఇవాళ ఏపీలో కూడా మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం విజయవాడలో నిర్వహించనున్న రోడ్ షోలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి ప్రయాణమవుతారు.