Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?-dhruv rathee vs modi bjp government all you need to know ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

Dhruv Rathee: ధృవ్​ రాఠీ: సోషల్ మీడియా సంచలనం.. మోదీనే ఎందుకు టార్గెట్ చేశారు?

Sharath Chitturi HT Telugu
May 07, 2024 01:57 PM IST

Who is Dhruv Rathee: యూట్యూబ్​లో ధృవ్​ రాఠీ చాలా ఫేమస్​. ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వీడియోలకు లక్షల్లో వ్యూస్​ వస్తున్నాయి. కానీ.. ఆయన బీజేపీని ఎందుకు టార్గెట్​ చేశారు? అసలు ఎవరు ఈ ధృవ్​ రాఠీ?

అసలు ఎవరు ఈ ధృవ్​ రాఠీ?
అసలు ఎవరు ఈ ధృవ్​ రాఠీ?

Dhruv Rathee YouTube: 'నమస్కార్​ దోస్తో..' ఈ మాటలు ఇప్పుడొక సంచలనం! ప్రముఖ యూట్యూబర్​ ధృవ్​ రాఠీ వీడియోల కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా, ఆయన పాలనలో ఎన్నో స్కామ్​లు జరుగుతున్నాయంటూ, ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ధృవ్​ రాఠీ చేస్తున్న కంటెంట్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​గా మారింది. 

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే టార్గెట్​ అంటూ ఆయన చేస్తున్న వీడియోలను చాలా మంది ప్రశంసిస్తున్నారు, చాలా మంది విమర్శిస్తున్నారు కూడా! అసలు.. మోదీ ప్రభుత్వాన్ని ధృవ్​ రాఠీ ఎందుకు టార్గెట్​ చేశారు? అసలు ఎవరు ఈ ధృవ్​ రాఠీ? ఇంత ఫేమస్​ ఎలా అయ్యారు?

అసలు ఎవరు ఈ ధృవ్​ రాఠీ..?

హరియాణాలోని ఓ జాట్​ కుటుంబంలో 1994 అక్టోబర్​ 8న జన్మించాడు ధృవ్​ రాఠీ. ధృవ్​ రాఠీ కుటుంబంలో ఎవరూ రాజకీయ నేతలు కారు. చాలా మంది ఆర్మీలో పనిచేశారు. చాలా మంది రైతులు ఉన్నారు.

హరియాణాలో ప్రైమరీ ఎడ్జ్యుకేషన్​ని పూర్తి చేసిన ఆయన.. తాను టాలెంటెడ్​ స్టూడెంట్​ కాదని, చాలా యావరేజ్​ విద్యార్థిని అని చెప్పుకొచ్చారు ధృవ్​ రాఠీ.

"నాకు 70-80శాతం మార్కులు వచ్చేవి. కానీ ఏదైనా టాపిక్​ మీద కూర్చుంటే.. కచ్చితంగా ఎక్స్​పర్ట్​ అవుతారని నా నమ్మకం," అని తన వీడియోలో చెప్పారు.

2011లో తొలిసారి ధృవ్​ రాఠీకి పాలిటిక్స్​పై ఆసక్తి పెరిగింది. నాడు.. అవినీతిపై అన్న హజారే చేసిన ఉద్యమం ఆయన్ని కదిలించింది.

ఆ తర్వాత ఉన్నత విద్య కోసం 2013లో జర్మనీకి వెళ్లారు. కార్ల్​స్రుహె ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీలో మెకానికల్​ ఇంజినీరింగ్​ని పూర్తి చేసి, రెనువెబుల్​ ఎనర్జీపై మాస్టర్స్​ చేశారు.

యూట్యూబ్ ప్రస్తానం

Dhruv Rathee : 2013లో ట్రావెల్​ వీడియోల ద్వారా తన యూట్యూబ్​ ప్రస్తానాన్ని ప్రారంభించారు ధృవ్​ రాఠీ. కానీ ఆ ఏడాది చివరికి వచ్చేసరికి.. పాలిటిక్స్​, కరెంట్​ అఫైర్స్​, సోషల్​ టాపిక్స్​ మీద వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఆయన హిస్టరీ వీడియోలకు మంచి డిమాండ్​ కూడా ఉంటుంది.

2020లో మరో యూట్యూబ్​ ఛానెల్​ని పెట్టారు ధృవ్​ రాఠీ. దాని పేరు ధ్రువ్​ రాఠీ వ్లాగ్స్​. తాను చేసే ప్రపంచ పర్యటనలకు సంబంధించిన వీడియోలను అందులో పోస్ట్​ చేస్తారు. 2021లో తన లాంగ్​ టర్మ్​ గర్ల్​ఫ్రెండ్​ యూలీని పెళ్లి చేసుకున్నారు ధ్రువ్​ రాఠీ.

ప్రస్తుతం.. ధృవ్​ రాఠీకి యూట్యూబ్​లో 19.3 మిలియన్​ మంది సబ్​స్క్రైబర్స్​ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 7.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ధృవ్​ రాఠీ వ్లోగ్స్​ ఛానెల్​కి 2.63 మిలియన్​ మంది సబ్​స్క్రైబర్స్​ ఉన్నారు. టైమ్​ మేనేజ్​మెంట్​, ఛాట్​జీపీటీతో పాటు పలు ఇతర కోర్స్​లను కూడా రన్​ చేస్తున్నారు. పలు మీడియా కథనాల ప్రకారం.. ధృవ్​ రాఠీ నెట్​ వర్త్​ రూ. 27 కోట్లు. ఆయన నెలకు దాదాపు రూ. 50లక్షలు సంపాదిస్తారు.

'బీజేపీ అంటే ఇష్టమే.. కానీ'

Dhruv Rathee vs BJP : 2014లో ఇండియాలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పుడు ధృవ్​ రాఠీ చాలా సంతోషించారు. కానీ ఆ తర్వాత దేశంలో పరిస్థితులు చూసి ఆందోళనకు గురైనట్టు చెప్పుకొచ్చారు.

"2014 సమయంలో నాకు కాంగ్రెస్​ మీద చాలా కోపం ఉండేది. కాంగ్రెస్​ ఓడిపోయిందని చాలా సంతోషించాను. మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో చాలా మార్పులు చేస్తుందని అనుకున్నాను. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటుందని అనుకున్నాను. కానీ అలా జరగదని కొంతకాలానికే అర్థమైంది," అని ఆర్​టీఐ చట్టాలపై ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ఉదాహరణగా చెబుతూ.. తన వీడియోలో ఈ వ్యాఖ్యాలు చేశారు ధృవ్​ రాఠీ.

ధృవ్​ రాఠీ వీడియోలు చాలా వరకు ఎడ్జ్యుకేషన్​, హిస్టరీ, కరెంట్​ అఫైర్స్​పై ఉంటాయి. అదే సమయంలో.. ఇండియా పాలిటిక్స్​పైనా తరచు వీడియోలు చేస్తుంటారు. నోట్ల రద్దు, జీఎస్​టీ, ఎలక్టోరల్​ బాండ్స్​ వంటి విషయాలపై చాలా ఏళ్ల క్రితమే వీడియోలు చేశారు.

ఆల్​రౌండ్​ టాపిక్స్​పై ధృవ్​ రాఠీ చేసిన వీడియోలు క్లిక్​ అవ్వడం ప్రారంభించాయి. చాలా సింపుల్​గా, సూటిగా ఉండటంతో ఆయన కంటెంట్​పై అందరికి ఆసక్తి పెరిగింది. అలాగా.. ధృవ్​ రాఠీ యూట్యూబ్​ ఛానెల్​ శరవేగంగా పెరిగింది.

కానీ.. ఒక్క వీడియో, ధృవ్​ రాఠీని ఇండియాలో హాట్​ టాపిక్​గా మార్చేసింది. ఆ ఒక్క వీడియో.. 'టాక్​ ఆఫ్​ ది టౌన్'​గా మారింది. ఆ ఒక్క వీడియోతో ఆయనకు ఫాలోయింగ్​ ఎంత పెరిగిందో, అంతే సమానంగా హేటర్స్​ కూడా పెరిగారు. ఆ వీడియో.. 'ఈజ్​ ఇండియా బికమింగ్​ ఎ డిక్టేటర్​షిప్​?' (భారత దేశం నియంత పాలనలోకి జారుకుంటోందా?). దానికి.. 'ది డిక్టేటర్​' (నియంత) అని థంబ్​నెయిల్​ కూడా ఇచ్చారు. ఈ వీడియో ఇన్​స్టెంట్​గా వైరల్​ అయ్యింది. ధృవ్​ రాఠీ వర్సెస్​ మోదీ- బీజేపీ.. ఈ వీడియోతో మరింత తీవ్రమైంది!

మోదీ- బీజేపీ వర్సెస్​ ధృవ్​ రాఠీ..

2024 Lok Sabha elections : 2024 లోక్​సభ ఎన్నికల వేళ ధృవ్​ రాఠీ రిలీజ్​ చేసిన ఆ వీడియో సంచలనంగా మారింది. మోదీ ప్రభుత్వంలోని లోపాలు ఉన్నాయని, ఎలక్టోరల్​ బాండ్స్​ ఒక పెద్ద స్కామ్​ అని, దేశంలో ప్రజాస్వామ్యం పడిపోతోందంటూ.. కొన్ని ఫ్యాక్ట్స్​ని చూపించే ప్రయత్నం చేశారు.

ఈ వీడియో ఇన్​స్టెంట్​గా వైరల్​ అయ్యింది. ట్విట్టర్​, ఫేస్​బుక్​, వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​లో ఈ వీడియో క్లిప్పింగ్స్​ని ప్రజలు తెగ షేర్​ చేశారు.

ఆ తర్వాత బీజేపీపై ప్రత్యక్ష విమర్శలు​ చేస్తూ ఇప్పటికీ అనేక వీడియోలు రిలీజ్​ చేస్తున్నారు ధృవ్​ రాఠీ. రైతుల సమస్యలు, లద్దాఖ్​ సమస్యలు వంటివి ప్రధానంగా ప్రస్తావించారు. అరవింద్​ కేజ్రీవాల్​ అరెస్ట్​, ఎలక్టోరల్​ బాండ్స్​ స్కామ్​ వంటి అంశాలపై సుదీర్ఘ ఎనలాసిస్​ చేసి ప్రజలకు వివరించారు. వాటన్నింటిలోనూ బీజేపీపై ప్రత్యక్షంగా విమర్శలు, తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు.

మరో ముందడుగు వేసి.. 'వాట్సాప్​ యూనివర్సటీ' అంటూ మరో వీడియో రిలీజ్​ చేశారు ధృవ్​ రాఠీ. బీజేపీ ఐటీ సెల్​ ప్రజలను మభ్య పెట్టేందుకు వాట్సాప్​, మీడియాను వాడుకుంటోందని ఆరోపించారు. బీజేపీ టీమ్​.. ప్రజలను బ్రెయిన్​వాష్​ చేస్తోందని అన్నారు. ప్రజలు ఏం చూడాలో, ఏం చూడకూడదో.. వంటివి ప్రభుత్వమే నిర్ణయిస్తోందని.. నియంత పేరు వింటే మొదట గుర్తొచ్చే హిట్లర్​ కాలంలో కూడా ఇదే జరిగేదని విమర్శించారు.

ఎందుకు మోదీని టార్గెట్ చేశారు?

అయితే.. తాను ఈ విధంగా బీజేపీ- మోదీపై ప్రశ్నలు లేవనెత్తడానికి కారణం చెప్పారు ధృవ్​ రాఠీ.

Dhruv Rathee BJP : "ది డిక్టేటర్​ అని నేను చేసిన వీడియో చాలా అగ్రెసివ్​గా ఉంటుంది. దేశం అంటే ప్రేమ ఉన్న మనిషి ఆ వీడియో చూసి షాక్​ అవ్వాలి. ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరిచి దేశంపై శ్రద్ధ పెట్టాలనే అలా చేశాను. నాకు పొలిటికల్​ కన్నా ఎడ్జ్యుకేషనల్​ వీడియోలు చేయడమే ఇష్టం. కానీ దేశంలో పరిస్థితులు చూసి.. 'ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతాము?', 'నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడతారు?' అందరు మౌనంగా ఉండిపోతే ప్రయోజనం లేదని అనిపించింది," అని.. మరో యూట్యూబ్​ ఛానెల్​ దేశ్​భక్త్​కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధృవ్​ రాఠీ అన్నారు.

అయితే.. దేశం పూర్తిగా నియంత పాలనలోకి జారుకోలేదని, కానీ.. మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తే కష్టమని ధృవ్​ రాఠీ అంటున్నారు.

"ఏ నియంత పాలకులనైనా తీసుకోండి.. దేశంలో ఇప్పుడు జరుగుతున్నదే, అప్పుడు జరిగింది. కాంగ్రెస్​ బ్యాంక్​ అకౌంట్​లను ఫ్రీజ్​ చేయడం, అరవింద్​ కేజ్రీవాల్​ని అరెస్ట్​ చేయడం.. ఇవన్నీ లోక్​సభ ఎన్నికలకు ముందే చేస్తుండటం విషయం. విపక్షమే లేకుండా చేయాలని చూస్తున్నారు. ఉత్తర కొరియా, రష్యాలో కూడా ఎన్నికలు జరుగుతాయి. అలా అని అక్కడ ప్రజాస్వామ్యం గొప్పగా ఉన్నట్టేనా?" అని ధృవ్​ రాఠీ అన్నారు.

"ఈరోజున పరిస్థితులు మారకపోతే.. రష్యాలో కనిపిస్తున్న పరిస్థితులే ఇండియాలోనూ చూడొచ్చు. పుతిన్​ ముందు ఎవరు మాట్లాడలేరు! నా భయం అదే. ఇండియాలో పూర్తి స్థాయి నియంత పాలన వస్తుందేమో అనే వీడియోలు చేశాను," అని ధృవ్​ రాతీ అన్నారు.

రష్యాలో పరిస్థితులు చెయ్యి దాటిపోయాయని, కానీ ఇండియాలో అలా జరగకుండా చూసుకనే బాధ్యత ప్రజలదని ధృవ్​ రాఠీ చెప్పుకొచ్చారు.

మరి మోదీ కాకపోతే ఇంకెవరు? అని దేశ్​భక్త్​ ఆకాశ్​ బెనర్జీ అడిగిన ప్రశ్నకు..

"మీరు ఒక కారులో కూర్చున్నారు. దానికి మంటలు అంటుకున్నాయి. మీరేం చేస్తారు? ఇది కాకపోతే ఇంకెంటి? అనుకుని ఉండిపోతారా? లేక దిగుతారా? ముందు కారు నుంచి కిందకు దిగిపోవాలి. ఆ తర్వాత.. నెక్ట్స్​ ఏంటి? అని ఆలోచించాలి," అని అన్నారు.

ధృవ్​ రాఠీ వీడియోలు ఇప్పుడొక సంచలనం. యూట్యూబ్​ను ఎక్కువ చూసే యువతలో ధృవ్​ రాఠీ చాలా ఫేమస్​. 'ధృవ్​ రాతీకి ధైర్యం ఎక్కువ..' అనే వారున్నారు, 'ధృవ్​ రాతీ దేశ ద్రోహీ, హిందూ ద్రోహీ, పాకిస్థానీ' అనే వారూ ఉన్నారు.

ధృవ్​ రాఠీ వీడియోలకు వ్యూస్​, లైక్స్​ వస్తున్నాయి సరే! మరి ఆయన కంటెంట్​.. భారత దేశ ఓటరును ఏ మేరకు ప్రభావితం చేస్తుంది? మోదీ అండ్​ టీమ్​పై ధృవ్​ రాఠీ ఎఫెక్ట్​ ఉంటుందా? అన్న విషయంపై.. 2024 లోక్​సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్​ 4తో క్లారిటీ వచ్చేస్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం