మూడు నెలల్లో 22.5 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్.. ఎందుకో తెలుసా
ప్రపంచవ్యాప్తంగా, 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో యూట్యూబ్ తన కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2.6 కోట్ల ఛానెళ్లను తొలగించింది. అలాగే 90 లక్షలకు పైగా వీడియోలను తొలగించింది.
వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో భారతదేశంలో 22.5 లక్షలకు పైగా వీడియోలను తొలగించింది.
12.4 లక్షల వీడియోల తొలగింపులతో సింగపూర్ రెండవ స్థానంలో ఉండగా, 7.88 లక్షల వీడియోల తొలగింపులతో అమెరికా మూడవ స్థానంలో ఉంది.
7.70 లక్షల వీడియో తొలగింపులతో ఇండోనేషియా నాలుగో స్థానంలో ఉండగా, రష్యా 5.16 లక్షల తొలగింపులతో ఐదవ స్థానంలో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ కాలంలో యూట్యూబ్ తన కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 90 లక్షలకు పైగా వీడియోలను తొలగించింది. హానికరమైన లేదా ప్రమాదకరమైన కంటెంట్, పిల్లల భద్రతకు సంబంధించి, హింసాత్మక లేదా గ్రాఫిక్ కంటెంట్, నగ్నత్వం, సెక్సువల్ కంటెంట్, తప్పుడు సమాచారం, ఇతర పారామీటర్లపై కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు వీడియోలను తొలగించారు.
యూట్యూబ్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు 2023 అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య, భారతదేశంలో 22.5 లక్షలకు పైగా వీడియోలను తొలగించినట్లు తాజా నివేదిక చూపించింది. వీడియోల తొలగింపునకు సంబంధించి 30 దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
2.05 కోట్ల ఛానెళ్ల తొలగింపు
2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు ప్రపంచవ్యాప్తంగా 2,05,92,341 ఛానెళ్లను యూట్యూబ్ తొలగించింది.
ఒక ఛానెల్‌ను నిలిపివేసినప్పుడు, దాని వీడియోలన్నింటినీ తొలగిస్తారని నివేదిక వివరించింది. ఛానల్ స్థాయి రద్దు కారణంగా ఈ కాలంలో తొలగించబడిన ఇటువంటి వీడియోల సంఖ్య 9.5 కోట్లు (9,55,34,236)గా ఉంది.
"ఒక యూట్యూబ్ ఛానెల్ 90 రోజుల్లో మూడు కమ్యూనిటీ మార్గదర్శకాల ఉల్లంఘనలను కలిగి ఉంటే, అలాగే తీవ్రమైన దుర్వినియోగం వంటివి ఒక కేసును కలిగి ఉంటే, లేదా మా మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించడానికి పదే పదే ప్రయత్నిస్తే (స్పామ్ ఖాతాల మాదిరిగా) ఛానెల్ రద్దవుతుంది.." అని యూట్యూబ్ ఒక ప్రకటనలో తెలిపింది.
గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ సురక్షితమైన మరియు శక్తివంతమైన కమ్యూనిటీని నిర్వహించడానికి తీవ్రంగా పనిచేస్తుందని తెలిపింది.
(పీటీఐ ఇన్ పుట్స్ తో)