Crime news: స్కూలు పిల్లలు.. యూట్యూబ్ వీడియోలు చూసి.. థ్రిల్ కోసం హత్య చేశారు..
Bihar Crime news: బిహార్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. యూట్యూబ్ సహా సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎలా పడుతుందో కళ్లకు కట్టే క్రైమ్ స్టోరీ ఇది. కేవలం 8, 9, 11 తరగతులు చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఒక యూట్యూబ్ వీడియో చూసి, తాము కూడా అలాగే చేయాలని నిర్ణయించుకుని, ఒక క్యాబ్ డ్రైవర్ ను హత్య చేశారు.
బిహార్ లోని మధుబని జిల్లాలో ముగ్గురు యువకులు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని అద్దెకు తీసుకుని, ఆ వాహనంతో పాటు వచ్చిన 30 ఏళ్ల డ్రైవర్ చంపేశారు (cab driver murder). అనంతరం, యూట్యూబ్ వీడియోలు చూసి హత్య చేసిన థ్రిల్ కోసమే ఈ దారుణానికి ఒడిగట్టామని పోలీసులకు తెలిపారు.
స్కూల్ పిల్లలే..
8, 9, 11 తరగతులకు చెందిన ఆ ముగ్గురు విద్యార్థులు సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ చూడడానికి అలవాటు పడ్డారు. క్యాబ్ డ్రైవర్ ను చంపి ఆ వాహనాన్ని దొంగలించి, అమ్మేసి డబ్బులు సంపాదించిన కథనానికి సంబంధించిన ఒక వీడియోను యూట్యూబ్ లో చూశారు. ఆ వీడియోను క్లిప్ నుంచి ప్రేరణ పొంది.. తాము కూడా అలాగే, క్యాబ్ ను బుక్ చేసుకుని, డ్రైవర్ ను చంపేసి, ఆ కారును అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఒక వ్యక్తిని చంపేస్తే పొందే థ్రిల్ ను కూడా పొందాలనుకున్నారు. చివరకు పోలీసులకు దొరికిపోయి, నేరాన్ని అంగీకరించారు. ఆ ముగ్గురిని దర్భంగాలోని రిమాండ్ హోమ్ కు తరలించారు.
ముందస్తు ప్లాన్ తో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కథనా మోహన్ పూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ దేవేంద్ర యాదవ్ అలియాస్ దేబును ముగ్గురు పాఠశాల విద్యార్థులు తమ అక్కను పుట్టింటి నుంచి తీసుకురావాలని స్కార్పియో వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. వాహనం 57వ నెంబరు జాతీయ రహదారిపై, మాధేపూర్ వైపు వెళ్లాలని వారు దేవేంద్ర యాదవ్ కు చెప్పారు. సుమారు 20 కిలోమీటర్ల తరువాత, బాలురు మూత్ర విసర్జన కోసం పక్కన వేరే రోడ్డులోకి తీసుకెళ్లి వాహనాన్ని ఆపాలని కోరారు. ఆ తరువాత, ఆ ముగ్గురిలో ఇద్దరు తాడుతో డ్రైవర్ ను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించగా, మూడోవాడు పదునైన వస్తువుతో గొంతులో పొడిచాడు. దాంతో, ఆ డ్రైవర్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మృతదేహాన్ని వదిలేసి..
ఆ తరువాత వారు సుమారు 6-7 కిలోమీటర్లు వాహనాన్ని నడుపుతూ ముందుకు వెళ్లారు. మృతదేహాన్ని నరువార్ గ్రామ సమీపంలోని వంతెన కింద పడేశారు. ఆ తరువాత, ముగ్గురు నిందితులు వాహనాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లి వెదురుతోటలో పార్క్ చేశారు. అయితే, నరువార్ గ్రామ సమీపంలోని వంతెన కింద మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, దర్యాప్తు చేసి, నిందితుల వివరాలను కనిపెట్టారు. వెదురు తోటలో పార్క్ చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారి నేరచరిత్రను కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తి చనిపోవడం చూసి థ్రిల్ పొందడం కోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో ఆ బాలురు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.