Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌కు పాక్ ఆర్మీ ట్రైనింగ్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ అక్కడి ఆర్మీతో కలిసి ట్రైనింగ్ తీసుకోనుంది. దీని వెనుక కారణం తెలిస్తే మాత్రం షాకవ్వడం ఖాయం. పది రోజుల పాటు ఈ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు.
Pakistan Cricket: ప్రపంచంలో ఎక్కడైనా ఓ క్రికెట్ టీమ్ తమ దేశ ఆర్మీ నుంచి ట్రైనింగ్ తీసుకోవడం చూశారా? అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ క్రికెట్ లో మాత్రం ఇప్పుడదే జరగబోతోంది. పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు అక్కడి ఆర్మీ ట్రైనింగ్ ఇవ్వనుంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పాక్ క్రికెటర్లకు ఆర్మీ ట్రైనింగ్
పాకిస్థాన్ క్రికెటర్లకు ఆర్మీతో ట్రైనింగ్ ఏర్పాటు చేసిన విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వి మంగళవారం (మార్చి 5) వెల్లడించారు. దీని వెనుక ఆయన చెప్పిన కారణం మాత్రం షాక్ కు గురి చేస్తుంది. పాకిస్థాన్ క్రికెటర్లలో అసలు వేగం లోపించిందని, బంతిని బలంగా కొట్టేంత ఫిట్‌నెస్ కూడా వాళ్లకు లేదన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
"పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లను నేను లాహోర్ లో చూశాను. పాక్ ప్లేయర్స్ కొట్టిన ఒక్క సిక్స్ కూడా స్టాండ్స్ లో పడినట్లు కనిపించలేదు. అలాంటి సిక్స్ కొట్టిన ప్రతిసారీ ఓ విదేశీ ప్లేయరే కొట్టినట్లు కనిపించింది. ప్రతి ప్లేయర్ ఫిట్ నెస్ స్పీడు పెరిగేలా ఓ ప్లాన్ రూపొందించాలని నేను బోర్డును కోరాను. మన దగ్గరికి న్యూజిలాండ్ వస్తోంది.
తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్, టీ20 వరల్డ్ కప్ రానున్నాయి. టైమ్ లేదు అనిపించింది. కానీ ఒక విండో దొరికింది. అందుకే మార్చి 25 నుంచి ఏప్రిల్ 8 వరకూ కాకుల్ (మిలిటరీ అకాడెమీ)లో ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశాడు. పాకిస్థాన్ ఆర్మీ మీ ట్రైనింగ్ లో భాగమవుతుంది. అది మీకు సాయపడుతుందని భావిస్తున్నాను" అని నఖ్వి చెప్పారు.
ఫిట్‌నెస్ లేని పాకిస్థాన్ ప్లేయర్స్
పాకిస్థాన్ ప్లేయర్స్ ఫిట్ నెస్ ప్రపంచంలోనే అత్యంత దారుణమైందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యంగా ఫీల్డింగ్ విషయంలో ఆ టీమ్ ప్లేయర్స్ పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే ప్లేయర్స్ ఫిట్ నెస్ పెంచడం కోసం ఏకంగా ఆర్మీతో శిక్షణ ఇప్పించడం మాత్రం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. అందులోనూ వరుస ద్వైపాక్షిక సిరీస్ లు, టీ20 వరల్డ్ కప్ రానుండటంతోపాటు రంజాన్ నెల సమయంలో ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేయడంపై పాక్ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొందరు క్రికెటర్లు రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం, కుటుంబంతో గడపటం చేస్తుంటారు. కానీ ఇప్పుడీ మిలిటరీ శిక్షణ కారణంగా ఆ అవకాశం లేకుండా పోతోంది. నిజానికి పాకిస్థాన్ క్రికెట్ లో ఇదే తొలిసారి కాదు. గతంలో మిస్బావుల్ హక్ కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు ఇదే కాకుల్ అకాడెమీలో మిలిటరీ ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. ఆ సిరీస్ తొలి టెస్టులోనే మిస్బా సెంచరీ చేశాడు. ఆ తర్వాత అతడు గ్రౌండ్ లోనే పుషప్స్ చేసి, మిలిటరీ సెల్యూట్ చేయడం గమనార్హం.