vote jihad: ప్రధాని మోదీ ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యలు; రామ రాజ్యానికి ఓటేయాలని వినతి-people have to decide if vote jihad will work or ram rajya says pm modi in mp ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Vote Jihad: ప్రధాని మోదీ ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యలు; రామ రాజ్యానికి ఓటేయాలని వినతి

vote jihad: ప్రధాని మోదీ ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యలు; రామ రాజ్యానికి ఓటేయాలని వినతి

HT Telugu Desk HT Telugu
May 07, 2024 04:04 PM IST

vote jihad: లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం లోక్ సభ మూడో దశ ఎన్నికల్లో అహ్మదాబాద్ లో ఓటేసిన అనంతరం ఎన్నికల ప్రచారానికి మధ్య ప్రదేశ్ వెళ్లారు. అక్కడ ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘ఓట్ జిహాద్’ వ్యాఖ్యలు చేశారు.

మధ్య ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
మధ్య ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

చరిత్రలో ఇప్పుడు భారతదేశం ఒక కీలక మలుపులో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చూపుతున్న ఓట్ జిహాద్ మార్గమా? లేక బీజేపీ పాలనలో రామ రాజ్యం మార్గమా? అనేది ప్రజలు ఈ ఎన్నికల్లో తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం మధ్య ప్రదేశ్ లోని ఖర్గోన్ లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

జిహాద్ పాలిటిక్స్

ఎన్నికల ప్రచారంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు మరియా ఆలం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘పాకిస్థాన్ లో ఉగ్రవాదులు భారత్ కు వ్యతిరేకంగా జిహాద్ చేస్తామని బెదిరిస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా ఓటు జిహాద్ చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు . అంటే ఫలానా మతానికి చెందిన వారు మోడీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెబుతున్నారు. కాంగ్రెస్ ఏ స్థాయికి దిగజారిపోయిందో చూడండి. ఓటు జిహాద్ ఆమోదయోగ్యమేనా? ప్రజాస్వామ్యంలో దీన్ని అనుమతించవచ్చా?’’ అని ప్రధాని మోదీ (PM Modi) ప్రశ్నించారు. మారియా ఆలం ఏప్రిల్ 30న ఉత్తరప్రదేశ్ లోని కాయంగంజ్ లోని ఫరూఖాబాద్ లోక్ సభ స్థానంలో ప్రచారం నిర్వహిస్తూ ఓటు జిహాద్ కు పిలుపునిచ్చారు.

రాజ్యాంగం అనుమతిస్తుందా?

మంగళవారం ఖర్గోన్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఓటు జిహాద్ మనకు ఆమోదనీయమేనా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి ఉంటుందా? భారత రాజ్యాంగం ఇలాంటి జిహాద్ ను అనుమతిస్తుందా?' అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు తమ వారసత్వాన్ని కాపాడుకోవడానికే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, ప్రజల భవితవ్యం గురించి వారు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రతి దశ పోలింగ్ తర్వాత పాకిస్థాన్ పై కాంగ్రెస్ ప్రేమ పెరుగుతోందన్నారు.

ఉగ్రవాదులకు సపోర్టా?

‘‘ఉగ్రవాద దాడులకు పాల్పడేది మన సైన్యమేనని, పాకిస్తాన్ వాళ్లు అమాయకులని కాంగ్రెస్ మాజీ సీఎం ఒకరు అన్నారు. మన దేశ ప్రజలు ఎవరైనా ఇలా ఆలోచించగలరా? ఇది మన సైన్యాన్ని అవమానించడమే కదా? నేను యువరాజు (రాహుల్ గాంధీ)ను అడుగుతున్నా.. ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు పాకిస్థాన్ పై అంత ప్రేమ, మన సైన్యంపై అంత ద్వేషం?’’ అని మోదీ ప్రశ్నించారు. గత వారం జమ్మూకశ్మీర్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కాన్వాయ్ పై జరిగిన బీజేపీ ఎన్నికల స్టంట్ అని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

వారికి రాముడంటే ఇష్టం లేదు..

20-25 ఏళ్లు కాంగ్రెస్ లో ఉండి.. తర్వాత పార్టీని వీడిన కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రకటనలను ప్రజలు వినాలని ప్రధాని మోదీ కోరారు. ‘‘రామ మందిరానికి వెళ్లినందుకు తనను కాంగ్రెస్ నేతలు ఎంతగానో హింసించారని, అందుకే తాను కాంగ్రెస్ ను వీడాల్సి వచ్చిందని ఓ మహిళా కాంగ్రెస్ నాయకురాలు చెప్పారు. ముస్లిం లీగ్, మావోయిస్టులు కాంగ్రెస్ ను ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ ను వీడిన మరో నేత అన్నారు. రామమందిరంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మార్చాలని కాంగ్రెస్ భావిస్తోందని మరొక కాంగ్రస్ మాజీ నేత అన్నారు’’ అని మోదీ విమర్శించారు. ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ప్రయోజనాలను లాక్కుంటుందని ప్రధాని మోదీ తన వాదనను పునరుద్ఘాటించారు. కర్ణాటకలోని ముస్లింలందరినీ ఓబీసీలుగా చేసేలా చట్టం చేశారు. ఈ నమూనాను దేశమంతా అమలు చేయాలని కాంగ్రెస్ అనుకుంటోందన్నారు.

WhatsApp channel