Pawan Kalyan On Pensions : మద్యం షాపుల వద్ద డ్యూటీలకు ఉన్న ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ లేరా?- పవన్ కల్యాణ్
03 April 2024, 19:52 IST
- Pawan Kalyan On Pensions : ఏపీలో పింఛన్ల పంపిణీపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. పెన్షన్ల పంపిణీపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా హాళ్ల వద్ద డ్యూటీలకు ఉన్న ఉద్యోగులు పెన్షన్లు ఇవ్వడానికి లేరా? అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్
Pawan Kalyan On Pensions : ఏపీలో పెన్షన్ల పంపిణీపై(AP Pensions) తీవ్ర దుమారం రేగుతోంది. ఈసీ ఆంక్షలతో వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచింది ప్రభుత్వం. ఈ విషయంపై అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈసీ మార్గదర్శకాల ప్రకారం... వయో వృద్ధులు, వికలాంగులు, వితంతులకు ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని తెలిపింది. కానీ కొన్ని ప్రాంతాల్లో వృద్ధుల్ని కొందురు మంచాలపై సచివాలయాలకు తీసుకొస్తున్నారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా టీడీపీపై దుష్ప్రచారం చేసేందుకు పింఛన్లపై అవాస్తవాలు ప్రచారం చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ కారణంగానే పింఛన్ల పంపిణీకి అవాంతరాలు ఏర్పడ్డాయని వైసీపీ ఆరోపిస్తుంది.
ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వడానికి ఇబ్బందేంటీ?
పింఛన్ల పంపిణీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan On Pensions)స్పందిస్తూ....ఒక సినిమాను ఆపడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే పని చేసినప్పుడు, దివ్యాంగులకు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయడానికి వ్యవస్థలను ఎందుకు ఉపయోగించట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో బలమైన రాజ్యాంగ వ్యవస్థలు ఉండగా వాలంటీర్లను(Volunteers) అడ్డుపెట్టుకొని వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేయకుండా ఎందుకు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. సినిమా హాళ్లు(Cinema Theatres), మద్యం షాపుల డ్యూటీలకు ఉన్న ఉద్యోగులు పెన్షన్లు ఇవ్వడానికి లేరా? అని ప్రశ్నించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల దగ్గర పింఛన్ అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? అని సీఎస్ ను ప్రశ్నించారు.
సినిమా థియేటర్ల వద్ద డ్యూటీలు
పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్(Pawan Kalyan Movie) అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకి డ్యూటీలు వేస్తారు.. తహశీల్దార్ నంబర్స్ ఇస్తారు. మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? అని నిలదీశారు. కరోనా కాలంలో మద్యం షాపుల(Liquor Shops) దగ్గర ఉద్యోగులకి డ్యూటీ వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ల దగ్గర ఇవ్వొచ్చని సూచించారు. వైసీపీ(Ysrcp) నాయకులు చేసే మెలో డ్రామాలకీ, బ్లేమ్ గేమ్స్ కి ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయని విమర్శించారు.
జన సైనికులకు విజ్ఞప్తి
పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండాలని జనసైనికులకు పవన్ కల్యాణ్(Pawan Kalya) విజ్ఞప్తి చేశారు. పింఛన్(AP Pensions) ఇచ్చే కార్యాలయానికి లబ్దిదారులను మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్లి పింఛన్ ఇప్పించాలని కోరారు. ఆ తరువాత ఇంటి దగ్గర దించి రావాలన్నారు. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకొనేవారికి సహాయం అందించాలని కోరారు. జనసేన శ్రేణులతోపాటు కూటమిలో భాగమైన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.