Pawan Kalyan : వైసీపీ దోపిడీ అరికడితే అప్పులు చేయకుండా సంక్షేమ పథకాలు అమలు- పవన్ కల్యాణ్
Pawan Kalyan : వైసీపీ పాలనను తరిమికొట్టడమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలని మూడు పార్టీల కార్యకర్తలకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. రాబోయేది కూటమి ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.
Pawan Kalyan : రాబోయే 40 రోజులు మండల దీక్ష చేసినట్లుగా పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పిఠాపురంలో పర్యటిస్తున్న పవన్...మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. మూడు పార్టీల సమన్వయంతో, పొత్తుల మీద ఎన్నికలను ఎదుర్కొవాలంటే సీట్ల కేటాయింపుల్లో ఎన్నో షరతులు, ఎన్నో అలకలు, మరెన్నో సంఘర్షణలు ఉంటాయన్నారు. కానీ వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఏర్పడిన జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు(JSP TDP BJP Alliance) విషయంలో ఎలాంటి అరమరికలు లేకుండా పొత్తు కుదిరిందన్నారు. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి అనే దాని మీద పవన్ కల్యాణ్ లెక్క వేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి, వైసీపీ కీచక పాలన నుంచి ప్రజలను బయటపడేయాలనే ఒకే ఒక్క లక్ష్యంతో పొత్తులకు ఎలాంటి షరతులు పెట్టకుండానే ముందుకు వెళ్లామన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల బాగు కోసం వెనక్కి తగ్గేవాడిని కాదని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... “పొత్తుల వల్ల మా పార్టీ నాయకులు కూడా చాలా నలిగిపోయారు. చాలా మంది రాజకీయంగా పోటీ చేయలేకపోయామని బాధపడ్డారు. కానీ రాష్ట్రం కోసం మనసుతో స్పందించాను. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గొప్పగా ఉండాలంటే కచ్చితంగా మూడు పార్టీలు కలిసి రాష్ట్రంలో పాలన సాగించాలని భావించాను. బీజేపీ కేంద్ర పెద్దలు తమకు ఎంపీ స్థానాలు ఎక్కువ కావాలని కోరితే రెండు ఎంపీ స్థానాలకే జనసేన పరిమితమైనా, మనోభీష్టాన్ని కాదనకుండా ముందుకు వెళ్లాం. అందరినీ కలుపుకొని వెళ్లాలన్నదే నా ఆకాంక్ష." అన్నారు.
80 శాతం మంది పొత్తుకు అంగీకరించారు
ఒక పార్టీలో విభిన్నమైన వ్యక్తులు, ఆలోచనలు ఉంటాయని పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. ప్రతి విషయంలోనూ ఏకాభిప్రాయం రాకపోవచ్చు కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎక్కువ మంది దేనివైపు మొగ్గు చూపుతున్నారో ఆ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుందన్నారు. పొత్తు విషయంలో కూడా జనసేన, టీడీపీలో మొదటి 70 నుంచి 80 శాతం మంది పొత్తుకు అంగీకరించారు. దీంతోనే పొత్తుకు ముందడుగు పడిందన్నారు. 2014లో ఎలాంటి షరతులు, డిమాండ్లు లేకుండా అప్పటి టీడీపీ, బీజేపీ పొత్తుకు జనసేన మద్దతు తెలిపిందన్నారు. అప్పటి పరిస్థితుల్లో 10 మందిని ఎన్నికల్లో నిలబెట్టే సత్తా ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం సుస్థిరమైన పాలన కోసం సంపూర్ణంగా మద్దతు ఇచ్చామన్నారు. ఎలాంటి డిమాండ్లు, పదవులు ఆశించలేదన్నారు. 2024లో సైతం జనసేన బలం పెరిగిందని తెలిసినా గందరగోళం లేకుండా ముందడుగు వేయాలనే ఆలోచనతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న లక్ష్యంతోనే పొత్తులకు చొరవచూపామన్నారు.
చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు బాధేసింది
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి, సైబరాబాద్ వంటి ప్రత్యేక నగరాన్ని తయారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అకారణంగా జైల్లో పెట్టినప్పుడు చాలా బాధపడ్డానని పవన్ కల్యాణ్(Pawan Kalyna) అన్నారు. రాజమండ్రి వెళ్తున్నపుడు దారి పొడవునా టీడీపీ కార్యకర్తలు తమ నాయకుడి కోసం పడిన తపన కదిలించిందన్నారు. అందుకే రాజమండ్రి జైల్లో చంద్రబాబును(Chandrababu Arrest) కలిసిన నా వంతుగా ఏదైనా చేయాలి అనుకున్న సమయంలో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించానన్నారు. అప్పుడు ఆశించినట్లుగానే బీజేపీ(BJP) కూడా తరువాత పొత్తులోకి రావడం ఆనందం కలిగించిందన్నారు. నేను పొత్తు కోసం ఎంతగా తపించానో... పొత్తును గెలిపించడం కోసం మూడు పార్టీల నాయకులు అంతే కష్టపడాలన్నారు. . అందరం కలిసి వైసీపీ పాలనను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో తన గెలుపు బాధ్యత తీసుకున్న టీడీపీ ఇన్ ఛార్జ్ వర్మ(TDP Varms) గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటానన్నారు. ఒంటెద్దు పోకడలకు పోకుండా పిఠాపురం నియోజకవర్గంలోని మూడు పార్టీల నాయకులను తగిన విధంగా సమన్వయం చేసుకుంటామన్నారు. పిఠాపురం అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై మూడు పార్టీల నాయకులు ఎప్పటికప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. జనసేన పార్టీ నుంచి కాకినాడ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(Uday Srinivas) కష్టపడి పైకి ఎదిగిన యువకుడు అన్నారు. 2017లో రూ. 10 లక్షల పెట్టుబడితో మొదలు పెట్టిన టీ టైమ్(TEA TIME) వ్యాపార ప్రస్థానం దేశం దాటి నేపాల్ లో కూడా విస్తరించిందన్నారు. యువత తెలివితేటలకు ఉదయ్ శ్రీనివాస్ ప్రత్యక్ష తార్కాణం అన్నారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ మంచి వ్యక్తే అయితే తప్పుడు పార్టీలను ఎంచుకుంటారన్నారు.
పింఛన్లు అందరికీ అందేలా కృషి చేద్దాం
"ప్రతి నెల అందాల్సిన సామాజిక పింఛన్లు ఎన్నికల కోడ్(Election Code) వల్ల ఈ నెల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వాలంటీర్లు లేకుండా పింఛన్లు పక్కాగా పంపిణీ చేయడంలో అధికారులకు తగిన విధంగా మూడు పార్టీల నాయకులు తోడ్పాడాలి. ఎన్నికల నియమావళిని అనుసరించి తగిన విధంగా ప్రభుత్వ యంత్రాంగానికి సహాయం చేద్దాం. వచ్చే కూటమి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం(Welfare Schemes) కూడా ఆగిపోదని ప్రజలకు చెప్పండి. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల(Tenant Farmers) కుటుంబాలకు నేను సహాయం చేశాను అంటే సొంతంగా సినిమాలు చేసి సంపద సృష్టించి ఆ డబ్బును ఆపదలో ఉన్న వారికి పంచాను. వచ్చే కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టించి కచ్చితంగా ప్రతి పథకాన్ని అమలు చేస్తాం. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇస్తున్న దానికంటే ఎక్కువగానే ఇస్తాం తప్ప ఏ మాత్రం పథకాలు నిలిపివేసేది లేదు. వైసీపీ పాలనలో మద్యం, గంజాయి, ఇసుక, ల్యాండ్ మాఫియా వంటి వాటిని అరికడితే అన్ని పథకాలకు కచ్చితంగా డబ్బులు సర్దుబాటు అవుతాయి. వైసీపీ(Ysrcp) దోపిడీ అరికడితే సంక్షేమ పథకాలు అప్పులు లేకుండానే అమలు చేయొచ్చు. నేను మరోసారి గట్టిగా చెబుతున్నాను.. వచ్చేది కూటమి ప్రభుత్వమే. మనం కచ్చితంగా గెలుస్తున్నాం. భారీ మెజార్టీతో ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం. మూడు పార్టీల్లోని ప్రతి కార్యకర్త నాయకుడు 40 రోజుల మండల దీక్ష చేసినట్లు, రంజాన్(Ramzan) సమయంలో ఉపవాసం ఉన్నట్లు నిష్టగా పని చేద్దాం. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా క్షేమం అనే రెండే అజెండాలుగా సమష్టిగా ఎన్నికలను ఎదుర్కొందాం" అని పవన్ కల్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
సంబంధిత కథనం