EC on AP Pensions : ఏపీలో రేపట్నుంచి పింఛన్ల పంపిణీ, ఈసీ మార్గదర్శకాలు జారీ
02 April 2024, 18:52 IST
- EC on AP Pensions : ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. రేపటి నుంచి ఏప్రిల్ 6 వరకు వివిధ కేటగిరీల్లో పింఛన్ల పంపిణీ చేయాలని ఆదేశించింది.
ఏపీలో రేపట్నుంచి పింఛన్ల పంపిణీ
EC on AP Pensions : ఏపీలో పింఛన్ల పంపిణీ రాజకీయ మలుపులు తిరుగుతోంది. వాలంటీర్లతో(Volunteers) పింఛన్ల పంపిణీ వద్దని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈసీ ఆదేశాలకు (EC Orders)టీడీపీ నాయకులే కారణమని వైసీపీ ఆరోపిస్తుంది. వైసీపీ ఆరోపణలను తిప్పుకొడుతూ టీడీపీ నేతలు ఇంటింటీ వెళ్లి పింఛన్ల ఆలస్యానికి వైసీపీ కారణమని ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పింఛన్ల పంపిణీపై నెలకొన్న గందరగోళానికి ఈసీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఏపీలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
పింఛన్ల పంపిణీపై ఈసీ మార్గదర్శకాలు
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ ఆదేశాలను సవరించిన ఈసీ... పెన్షన్ల పంపిణీపై(AP Pensions Distribution) మార్గదర్శకాలు జారీచేసింది. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6 వరకు వివిధ కేటగిరీల వారీగా పెన్షన్లు(Pension) పంపిణీ చేయాలని ఈసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. కొంత మందికి ఇంటి వద్దే పింఛన్ల పంపిణీతో పాటు మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందజేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారు, అస్వస్థతకు గురైనవారు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్ అందించాలని ఈసీ ఆదేశించింది. దీంతో గ్రామ, సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల పింఛన్ దారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఈసీ ఆదేశించింది.
సచివాలయాల పనిసమయాలు పొడిగింపు
ఈ నెల 3న పింఛన్ల పంపిణీ(AP Pensions) ప్రారంభించి, 6వ తేదీ నాటికి ముగించాలని ఈసీ(EC on Pensions) మార్గదర్శకాల్లో పేర్కొంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది మాత్రమే ఉండడంతో రెండు కేటగిరీలుగా పింఛన్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో... ఈ నాలుగు రోజులు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలను(AP Sachivalayas) పనిచేయాలని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
పింఛన్ పాలిటిక్స్
ఏపీలో వాలంటీర్లతో సంక్షేమ పథకాలకు(Welfare Schemes) నగదు పంపిణీ చేయించొద్దని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ (Election Code)ముగిసే వరకూ వాలంటీర్లను ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. వాలంటీర్ల(Volunteers) వద్దనున్న మొబైల్, ఇతర పరికరాలు ఎన్నికల అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అయితే దీనికి ప్రతిపక్షాల కారణమని అధికార వైసీపీ ఆరోపిస్తుంటే... వైసీపీ అధికార దాహమే ఈ పరిస్థితులు తెచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం, ఎన్నికల కోడ్ ను తరచూ ఉల్లంఘించడంతో ఈసీ వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో చివరికి నగదు పంపిణీ పథకాలకు దూరం పెట్టాలని ఆదేశించింది. ఈసీ ఆదేశాల తర్వాత చాలా జిల్లాల్లో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు(Volunteers Resign) చేశారు. అయితే ఈసీ వాలంటీర్లను మాత్రమే పింఛన్ల పంపిణీకి వాడొద్దని తెలిపిందని, ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవచ్చని తెలిపిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎన్నికల సమయం కావడంతో ఏపీలో పింఛన్ల పంపిణీపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి.