AP Congress Nine Guarantees : మహిళలకు ప్రతి నెల రూ.8500, అర్హులైన వారికి నెలకు రూ.4 వేల పెన్షన్- కాంగ్రెస్ 9 గ్యారంటీలు
30 March 2024, 15:05 IST
- AP Congress Nine Guarantees : ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల 9 గ్యారంటీలు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 9 గ్యారంటీలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా పేద మహిళలకు ప్రతి నెల రూ.8500 ఇస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్ షర్మిల
AP Congress Nine Guarantees : ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 9 గ్యారంటీలను(Congress Nine Guarantees) అమలు చేస్తామని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రకటించారు. శనివారం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన షర్మిల... 9 గ్యారంటీల కరపత్రం, డోర్ స్టిక్కర్ ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల... కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి 1500 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు.ఇందులో బీ ఫామ్ లు(B-Form) మాత్రం 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు, 25 మంది ఎంపీ అభ్యర్థులు మాత్రమే వస్తాయన్నారు. టికెట్ రాని వాళ్లు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శ్రమించకపోతే చరిత్ర మనలను క్షమించదన్నారు. దరఖాస్తు చేసుకున్న వాళ్లపై సర్వేలు చేసి, రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకొని ఎంపిక చేస్తున్నామన్నారు. అభ్యర్థి పనితనం ఆధారంగా ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ, రీజినల్ పార్టీ కాదన్న షర్మిల... ఒక వ్యక్తి నిర్ణయం తీసుకొనే పార్టీ కాదన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు.
టీడీపీ, వైసీపీ బీజేపీకి తొత్తులు
'టికెట్ రాని వాళ్లు అభ్యర్థి కోసం కాదు...పార్టీ కోసం, ప్రజల కోసం, దేశం కోసం పని చేయాలి. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రావాలి. కాంగ్రెస్(Congress) అధికారంలో లేకుంటే ఎలా ఉందో చూస్తున్నాం. మణిపూర్ లాంటి ఘటనలు ఇందుకు ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో ఒక నమ్మకం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయక పోతే చరిత్ర హీనులుగా మిగులుతాం. ప్రతీ ఒక్కరం కాంగ్రెస్ అభ్యర్థుల(Congress Candidates List) గెలుపు కోసం పాటు పడదాం. మన బిడ్డల భవిష్యత్ కాపాడుకుందాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు గ్యారంటీలు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇక్కడ టీడీపీ, వైసీపీ(TDP Ysrcp) రెండు బీజేపీ తోత్తులే. బీజేపీ మేలు చేయక పోయినా చంద్రబాబు, జగన్ లు బానిసలుగా మారారు. పదేళ్లైన ప్రత్యేక హోదా ఊసే లేదు. విభజన హామీలు ఒక్కటీ అమలు కాలేదు. అయినా చంద్రబాబు, జగన్ ఇద్దరు దొందు దొందే. చంద్రబాబు బీజేపీతో 2014లో పొత్తు(Alliance) పెట్టుకొని విడాకులు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు'- వైఎస్ షర్మిల
జగన్ మోదీ దత్తపుత్రుడు
సీఎం జగన్(CM Jagan) ను ఏకంగా నిర్మలా సీతారామన్ మోదీకి దత్తపుత్రుడు అన్నారని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. ఒకరిది బహిరంగ పొత్తు..మరొకరిది రహస్య పొత్తు అని విమర్శించారు. ఒకరిది సక్రమైన పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు అన్నారు. ఇలాంటి మోసాలను మనం గడప గడపకి చేర్చాలన్నారు. చంద్రబాబు, జగన్ కు ఓటేస్తే బీజేపీకే ఓటు అని అర్థం అయ్యేలా చెప్పాలన్నారు. మనం బానిసలు కావాలంటే మళ్లీ బీజేపీకి(BJP) ఓటు వేయాలన్నారు. బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ అని చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా(SCS) 10 ఏళ్లు కావాలని చంద్రబాబు(Chandrababu) మోసం చేశారని ఆరోపించారు. అధికారం అనుభవించి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజీనామాలు చేద్దాం అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదన్నారు. వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవన్నారు. రాష్ట్ర ప్రజల గౌరవాన్ని జగన్ తాకట్టు పెట్టారన్నారు. హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ మాత్రమే హోదాపై కట్టుబడి ఉందన్నారు.
కాంగ్రెస్ 9 గ్యారంటీలు(Congress Nine Guarantees)
మొదటి గ్యారంటీ- 10 ఏళ్లు ప్రత్యేక హోదా
- కాంగ్రెస్ అధికారంలో వస్తే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా(Special Category Status) గ్యారంటీ, అధికారంలో వచ్చిన వెంటనే హోదా అమలు
రెండో గ్యారంటీ- మహిళా మహాలక్ష్మి
- ప్రతి పేద మహిళలకు ప్రతి నెల 8500
- ఏడాదికి రూ.లక్ష రూపాయలు
మూడో గ్యారంటీ- రైతులకు రుణమాఫీ
- రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
నాల్గో గ్యారంటీ
- పెట్టుబడి మీద 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర
5వ గ్యారంటీ
- ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం రూ.400
6వ గ్యారంటీ
- కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
7వ గ్యారంటీ
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ, మొట్టమొదటి సంతకం ఉద్యోగాల ప్రకటన మీదే
8వ గ్యారంటీ
- ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద 5 లక్షలతో పక్కా ఇళ్లు
9వ గ్యారంటీ
- ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పెన్షన్
- అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4 వేల పెన్షన్
- వికలాంగులకు రూ.6 వేల పెన్షన్