Congress: ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ కు మరో షాక్; రూ. 1700 కోట్లు కట్టాలంటూ ఐటీ నోటీస్-congress slapped with 1 700 crore rupees demand notice by i t dept ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Congress: ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ కు మరో షాక్; రూ. 1700 కోట్లు కట్టాలంటూ ఐటీ నోటీస్

Congress: ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ కు మరో షాక్; రూ. 1700 కోట్లు కట్టాలంటూ ఐటీ నోటీస్

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 12:25 PM IST

Congress: లోక్ సభ ఎన్నికలు తరుముకు వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ కి ఆదాయ పన్ను శాఖ మరో షాక్ ఇచ్చింది. 2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి జరిమానా, వడ్డీతో సహా రూ.1,700 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీస్ జారీ చేసింది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ (Sanjay Sharma)

IT notice to Congress: జరిమానా, వడ్డీతో సహా రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం డిమాండ్ నోటీసు జారీ చేసింది. తాజా డిమాండ్ నోటీసు 2017-18 నుండి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని గత కొన్ని వారాలుగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఐటీ, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను కాషాయ పార్టీ తన ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

ప్రచారానికి డబ్బుల్లేవు..

లోక్ సభ ఎన్నికల్లో (Lok sabha elections) కాంగ్రెస్ (congress) పార్టీని బలహీనపరిచే ఉద్దేశంతో ఆదాయ పన్ను శాఖను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కనీసం రూ. 2 లను ఖర్చు చేయలేకపోతోందని, ప్రచారం కోసం వెళ్లడానికి రైలు టికెట్లు కొనడానికి కూడా నగదు లేని పరిస్థితి నెలకొన్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల ఒకక మీడియా సమావేశంలో వాపోయారు. గతవారం కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల తేదీ వచ్చిందని, తమ బ్యాంకులో ఉన్న రూ.285 కోట్లను తాము ప్రచారం కోసం ఉపయోగించుకోలేకపోతున్నామని అన్నారు. ‘‘పబ్లిసిటీ కోసం వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో స్లాట్లు బుక్ చేసుకోవాలి. పోస్టర్లు ప్రింట్ చేయించాలి. ఈ పని కూడా చేయలేకపోతే ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగిస్తుంది’’ అని మాకెన్ ప్రశ్నించారు. ప్రతి రాజకీయ పార్టీకి ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. ఏ పార్టీకి విధించని జరిమానాను కాంగ్రెస్ కే ఎందుకు విధిస్తున్నారు? అని మాకెన్ ప్రశ్నించారు.

ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలనే..

ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేవలం నెల రోజుల ముందు ఐటీ నోటీసులు ఇవ్వడం ఏమిటని కాంగ్రెస్ నేత ప్రశ్నించారు. ఇటీవల ఆదాయ పన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. దీనిపై, ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ను కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది. అయితే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థనను మార్చి 8వ తేదీన ట్రిబ్యునల్ తోసిపుచ్చింది.