Rahul Gandhi: ‘‘ప్రచారం చేయడానికి కూడా డబ్బులు లేవు’’ - రాహుల్ గాంధీ-rahul gandhi slams centre says congress bank accounts frozen cant campaign ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi: ‘‘ప్రచారం చేయడానికి కూడా డబ్బులు లేవు’’ - రాహుల్ గాంధీ

Rahul Gandhi: ‘‘ప్రచారం చేయడానికి కూడా డబ్బులు లేవు’’ - రాహుల్ గాంధీ

HT Telugu Desk HT Telugu
Mar 21, 2024 02:32 PM IST

Lok sabha elections: లోక్ సభ ఎన్నికల సమరంలో అన్ని పక్షాలకు సమానమైన వేదిక ఉందన్న కేంద్ర ఎన్నికల సంఘం మాటలు వాస్తవం కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారని, ప్రచారం చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి కాంగ్రెస్ లో నెలకొందని వివరించారు.

మీడియా సమావేశంలో సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ
మీడియా సమావేశంలో సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ

Lok sabha elections: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్టీ ఆర్థిక ఇబ్బందులను ఎత్తిచూపుతూ, పార్టీ ఖాతాలన్నీ స్తంభింపజేశామని, లోక్ సభ ఎన్నికలకు ఎలాంటి ప్రచారాన్ని చేపట్టలేని పరిస్థితి నెలకొని ఉన్నదని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం కాదని, భారత ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడమేనని రాహుల్ గాంధీ అన్నారు. నిధులు అందుబాటులో లేని కారణంగా తాము ఎలాంటి ప్రచారం చేయలేకపోతున్నామని, ప్రకటనలు బుక్ చేయలేకపోతున్నామని, తమ నాయకులను ప్రచారానికి పంపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని విమర్శించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ముందే ప్లాన్ చేసి..

ఎన్నికల ప్రచారానికి రెండు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారని, ఇది కావాలనే కుట్రపూరితంగా తీసుకున్న చర్య అని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనివల్ల ఇప్పటికే నెల రోజులు నష్టపోయామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇది కాంగ్రెస్ పార్టీపై క్రిమినల్ చర్య అని, ప్రధాని, హోం మంత్రి చేసిన నేరపూరిత చర్య అని రాహుల్ గాంధీ అన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యం లేదు

భారత్ ప్రజాస్వామ్య దేశమన్న మాట పచ్చి అబద్ధమని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ లో ప్రజాస్వామ్యం లేదన్నారు. ‘‘భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమనే భావన అబద్ధం. పచ్చి అబద్ధం. 20% మంది భారతీయులు మాకు ఓటు వేశారు. కానీ ఇప్పుడు మేము కనీసం రూ .2 ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎన్నికల్లో మమ్మల్ని ఇరుకున పెట్టేందుకు కుట్ర పన్నారు’’ అని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

సోనియా గాంధీ ఆగ్రహం

కాంగ్రెస్ ను ఆర్థికంగా నిర్వీర్యం చేసేందుకు మోదీ ఒక క్రమపద్ధతిలో ప్రయత్నిస్తున్నారని సోనియా గాంధీ ఆరోపించారు. ‘‘ఈ రోజు మేం లేవనెత్తుతున్న అంశం చాలా తీవ్రమైనది. ఈ సమస్య భారత జాతీయ కాంగ్రెస్ ను మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ ను ఆర్థికంగా నిర్వీర్యం చేయడానికి ప్రధాని ఒక క్రమపద్ధతిలో ప్రయత్నిస్తున్నారు’’ అని సోనియా గాంధీ విమర్శించారు. ఏ ప్రజాస్వామ్యానికైనా నిష్పాక్షిక ఎన్నికలు అవసరమని, అన్ని రాజకీయ పార్టీలకు సమన్యాయం అవసరమని మల్లికార్జున ఖర్గే అన్నారు.

ఆదాయ పన్ను నోటీసులు

ఈ ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాలుగు ప్రధాన బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.210 కోట్ల ఆదాయపు పన్ను బకాయి ఉన్నట్లు పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. కానీ, కాంగ్రెస్ అభ్యర్థనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ మార్చి 8న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్ కు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసుపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది.

IPL_Entry_Point