Congress Manifesto: అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా.. కాంగ్రెస్ ‘ఐదు’ భారీ హామీలు; కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటన
దేశవ్యాప్తంగా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఐదు హామీలను ప్రకటించింది. 2024 లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 2024 ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోపై సీడబ్ల్యూసీలో విస్తృతంగా చర్చించిన తర్వాత కాంగ్రెస్ ఈ ప్రకటన చేసింది.
సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ (HT_PRINT)
Congress Manifesto: 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు దేశంలోని యువత, మహిళలు, రైతులు, కార్మికులు, మైనారిటీల కోసం కాంగ్రెస్ ఐదు భారీ హామీలను ప్రకటించింది. వీటిలో ఒక్కో హామీలో మరో ఐదు హామీలను అంతర్గతంగా పొందుపర్చింది. 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టో (Congress Manifesto) పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
ఐదు న్యాయ హామీలు
యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ అనే ఐదు హామీలను సమాజంలోని ఐదు వర్గాలకు వర్తించేలా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 1926 నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో (Congress Manifesto) విశ్వసనీయతకు, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందని ఈ సందర్భంగా కాంగ్రెస్ తెలిపింది.
యువ న్యాయ్ (యువతకు న్యాయం)
- 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు శాశ్వత నియామకాలు.
- గ్రాడ్యుయేట్, డిప్లొమా హోల్డర్లకు ఏడాదికి కనీసం రూ .1 లక్ష స్టైపెండ్ తో గ్యారెంటీ అప్రెంటిస్షిప్.
- నో పేపర్ లీకేజెస్: ప్రశ్న పత్రాల లీకేజీలను అరికట్టేందుకు కొత్త చట్టం చేయడం ద్వారా పరీక్షలను విశ్వసనీయంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
- అసంఘటిత రంగంలోని శ్రామిక శక్తికి మెరుగైన పని పరిస్థితులు, పెన్షన్లు, సామాజిక భద్రతకు హామీ.
- జాతీయ నిధి నుంచి జిల్లా స్థాయిలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.5 వేల కోట్ల స్టార్టప్ నిధులు.
నారీ న్యాయ్ (మహిళలకు న్యాయం)
- ప్రతీ పేద కుటుంబంలో ఒక పేద మహిళకు ఏటా రూ.లక్ష.
- కేంద్ర ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.
- అంగన్ వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలకు కేంద్ర ప్రభుత్వ వాటా రెట్టింపు
- వివిధ పథకాలు, ప్రయోజనాలను ప్రజలకు వివరించడానికి, మహిళలకు వారి హక్కులను వివరించడానికి ప్రతి పంచాయితీలో ఒక మైత్రి అధికారి నియామకం.
- భారతదేశం అంతటా ప్రతి జిల్లా కేంద్రంలో సావిత్రిబాయి ఫూలే వర్కింగ్ విమన్స్ హాస్టల్.
కిసాన్ న్యాయ్ (రైతులకు న్యాయం)
- సహీ దామ్ (సరైన ధర): పంటలకు అందించే కనీస మద్దతు ధరకు చట్టపరమైన హోదా ఇవ్వబడుతుంది. ఈ మేరకు పార్లమెంటులో ప్రత్యేక చట్టాన్ని ఆమోస్తాం. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ప్రకారం ఎంఎస్పీని నిర్ణయిస్తారు.
- జీఎస్టీ ముక్త్: వ్యవసాయ సామగ్రిపై పన్నులను తొలగించడానికి జీఎస్టీ విధానాన్ని సవరించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది.
- దిగుమతి, ఎగుమతి విధానం: వ్యవసాయ ఉత్పత్తుల కోసం దిగుమతి-ఎగుమతి విధానాన్ని కాంగ్రెస్ రూపొందించి అమలు చేస్తుంది. ఇది రైతుల ప్రయోజనాలను రక్షించడానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది.
- బీమా సురక్ష: పంట నష్టపోయిన 30 రోజుల్లో రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా పీఎం ఫసల్ బీమా యోజనను రీడిజైన్ చేయనున్నారు.
- రుణ మాఫీ: రైతుల రుణాలను మాఫీ చేయడానికి, అవసరమైన రుణ మాఫీ మొత్తాన్ని నిర్ణయించడానికి స్టాండింగ్ ఫామ్ లోన్ మాఫీ కమిషన్ ను ఏర్పాటు చేస్తారు.
శ్రామిక్ న్యాయ్ (కార్మికులకు న్యాయం)
- ఆరోగ్య అధికారి: ఉచిత అత్యవసర నిర్ధారణ, మందులు, చికిత్స, శస్త్రచికిత్స, పునరావాసం, ఉపశమనం సహా సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను అందించే ఆరోగ్య హక్కు చట్టం
- శ్రమకు గౌరవం: జాతీయ వేతన హామీ కింద ఉపాథి హామీ కార్మికులు సహా అందరు కార్మికులకు రోజుకు రూ .400 గౌరవ వేతనం.
- పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ చట్టం.
- అసంఘటిత కార్మికులకు జీవిత బీమా, ప్రమాద హామీ.
- కీలక ప్రభుత్వ విధుల్లో ఉద్యోగాల కాంట్రాక్టు విధానం నిలిపివేత.
హిస్సేదారీ న్యాయ్ (జస్టిస్ ఫర్ ఈక్విటీ)
- సామాజిక, ఆర్థిక, కుల గణన
- ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని సీఆర్డీఏ సవరణ ద్వారా తొలగిస్తారు
- ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక బడ్జెట్, జనాభాలో వారి వాటాకు సమానంగా బడ్జెట్.
- అటవీ హక్కుల చట్టం క్లెయిమ్ 1 సంవత్సరంలో పరిష్కారం.
- ఎస్టీల జనాభా అత్యధికంగా ఉన్న అన్ని ప్రాంతాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా నోటిఫై చేస్తారు.