AP Congress List : కడప లోక్ సభ బరిలో వైఎస్ షర్మిల, కాంగ్రెస్ తొలి జాబితా విడుదల ఆ రోజే!-amaravati congress first list released on march 25th ys sharmila contest to kadapa mp seat ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ap Congress List : కడప లోక్ సభ బరిలో వైఎస్ షర్మిల, కాంగ్రెస్ తొలి జాబితా విడుదల ఆ రోజే!

AP Congress List : కడప లోక్ సభ బరిలో వైఎస్ షర్మిల, కాంగ్రెస్ తొలి జాబితా విడుదల ఆ రోజే!

Bandaru Satyaprasad HT Telugu
Mar 18, 2024 02:14 PM IST

AP Congress List : వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటనకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నెల 25న కాంగ్రెస్ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందని సమాచారం.

 కడప లోక్ సభ బరిలో వైఎస్ షర్మిల
కడప లోక్ సభ బరిలో వైఎస్ షర్మిల

AP Congress List : ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (AP Election Schedule)విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఖరారు, ప్రచారంపై దృష్టి పెట్టాయి. వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీలో కాంగ్రెస్(AP Congress) గ్రాఫ్ కాస్త పెరిగిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ సైతం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆశావహుల నుంచి టికెట్ల కోసం అప్లికేషన్లు ఆహ్వానించి ముఖాముఖీగా మాట్లాడారు. ఇక జాబితా ప్రకటనకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్న కాంగ్రెస్... ఏపీలో ఇప్పటి అభ్యర్థులను ప్రకటించలేదు. స్థానిక నేతలతో చర్చించి త్వరలో అభ్యర్థులు (AP Congress List)ఖరారు చేయనున్నట్లు సమాచారం.

ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా?

కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ఏపీలో పలు అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న కాంగ్రెస్ జాబితా(AP Congress List) విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప లోక్‌సభ స్థానం(Kadapa Lok Sabha) నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిలను కడప నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. షర్మిలతో పాటు పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఏపీ నుంచి పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కడపలో త్రిముఖ పోటీ తప్పదా?

వైఎస్ షర్మిల(YS Sharmila) పోటీలో ఉండరంటూ మొదట ప్రచారం జరిగింది. అయితే ఆమె పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. దీంతో ఏఐసీసీ సూచనల మేరకు కడప లోక్ సభ స్థానానికి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య అనంతరం జరిగిన పరిణామాలు, వివేకా కుమార్తె సునీతకు వైఎస్ షర్మిల మద్దతుగా నిలవడం.. ఈ కారణాలతో షర్మిల కడప నుంచి పోటీచేస్తే గెలిచే అవకాశం ఉందని అధిష్ఠానం భావిస్తోందని సమాచారం. ఈ నెల 25న ప్రకటించే ఏపీ కాంగ్రెస్ తొలి జాబితా(AP Congress List) ఉత్కంఠ నెలకొంది. షర్మిల లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా పోటీ చేస్తారా? లేదా? అనే విషయం క్లారిటీ రానుంది. వైసీపీ(Ysrcp) నుంచి కడప ఎంపీ (Kadapa MP)అభ్యర్థిగా మళ్లీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) పోటీచేస్తున్నారు. ఇక్కడ నుంచే వైఎస్ షర్మిలు కూడా పోటీ చేస్తే సొంత బంధువుల మధ్య హోరాహోరి పోటీ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ చేస్తే సునీత మద్దతు కూడా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. టీడీపీ సైతం ఈసారి కడప స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానానికి త్రిముఖ పోటీ తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Whats_app_banner

సంబంధిత కథనం