WPL 2024 Opening Ceremony: దుమ్ము రేపిన డబ్ల్యూపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ.. బాలీవుడ్ స్టార్ల హంగామా
23 February 2024, 20:22 IST
- WPL 2024 Opening Ceremony: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 ఓపెనింగ్ సెర్మనీ ఘనంగా జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ సెర్మనీలో షారుక్, షాహిద్ కపూర్, కార్తీక్ ఆర్యన్ లాంటి స్టార్లు తమ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు.
డబ్ల్యూపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో ఐదు జట్ల కెప్టెన్లతో షారుక్ ఖాన్
WPL 2024 Opening Ceremony: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరులో బాలీవుడ్ స్టార్ల డ్యాన్స్ లతో ఈ సెర్మనీ దుమ్ము రేపింది. షారుక్ ఖాన్ తోపాటు షాహిద్ కపూర్, కార్తీక్ ఆర్యన్, సిద్ధార్థ్ మల్హోత్రా డ్యాన్స్ లతో చిన్నస్వామి స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
డబ్ల్యూపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు ముందు ఈ డబ్ల్యూపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించారు. దీనికి బాలీవుడ్ స్టార్లు వచ్చారు. మొదట నటుడు కార్తీక్ ఆర్యన్ పర్ఫార్మెన్స్ తో ఈ సెర్మనీ ప్రారంభమైంది. అతడు గుజరాత్ జెయింట్స్ తరఫున ఈ సెర్మనీలో పర్ఫామ్ చేశాడు.
ఆ తర్వాత మరో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా వచ్చాడు. అతడు తన ఫేవరెట్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తరఫున పర్ఫామ్ చేయడం విశేషం. తన సూపర్ హిట్ సాంగ్ షేర్షా మూవీలోని కిత్తే చలియే పాటపై డ్యాన్స్ చేశాడు. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్ ఎంట్రీ ఇచ్చాడు. అతడు తనదైన స్టైల్లో తన సిక్స్ ప్యాక్ బాడీని చూపిస్తూ డ్యాన్స్ తో అదరగొట్టాడు.
యూపీ వారియర్స్ టీమ్ తరఫున మరో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ పర్ఫామ్ చేశాడు. ఆ టీమ్ ను చీర్ చేస్తూ అతడు గ్రౌండ్ లోకి వచ్చాడు. ఇక షాహిద్ కపూర్ మరో టీమ్ ముంబై ఇండియన్స్ కు సపోర్ట్ గా ఈ ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫామ్ చేశాడు. చివరగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఎంట్రీ ఇవ్వగానే స్టేడియమంతా మార్మోగిపోయింది.
అతడు గతేడాది వచ్చిన సూపర్ హిట్ మూవీ పఠాన్ మూవీలోని టైటిల్ సాంగ్ పై డ్యాన్స్ చేశాడు. మూవీలో పాపులర్ డైలాగ్ చెప్పి తర్వాత ఝూమే జో పఠాన్ సాంగ్ పై పర్ఫామ్ చేశాడు. అతని ప్రదర్శనతో ఓపెనింగ్ సెర్మనీ ముగిసింది.
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్
ఓపెనింగ్ సెర్మనీ తర్వాత ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. హర్మన్ టాస్ గెలవగానే స్టేడియంలోని ప్రేక్షకులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. బెంగళూరు ఫ్యాన్స్ అందరూ ముంబై టీమ్ వైపే ఉన్నట్లు స్పష్టమైంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ మొదటి లెగ్ మ్యాచ్ లన్నీ బెంగళూరులోనే జరగనున్నాయి.
టాపిక్