గ్రాండ్‍గా డబ్ల్యూపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. బాలీవుడ్ స్టార్ల పర్ఫార్మెన్స్‌లు.. ఎప్పుడు జరగనుందంటే..
WPL 2024 Opening Ceremony: ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ (Women’s Premier league) ఓపెనింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్‍గా నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఈ ఈవెంట్‍లో కొందరు బాలీవుడ్ సినీ స్లార్ల పర్ఫార్మెన్సులుగా కూడా ఉండనున్నాయి.
WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ మరో మూడు రోజుల్లో షురూ కానుంది. ఈ మహిళల టీ20 లీగ్ ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 17వ తేదీ వరకు జరగనుంది. ఈ ఏడాది మొత్తంగా 22 మ్యాచ్‍లు జరగనున్నాయి. ఐదు జట్లు తలపడనున్నాయి. మార్చి 4 వరకు మ్యాచ్‍లు బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో.. ఆ తర్వాత ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో మ్యాచ్‍లు జరగుతాయి. కాగా, ఫిబ్రవరి 23న డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీ ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్‍గా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. ఈసారి కూడా ఈవెంట్‍లో బాలీవుడ్ ఫ్లేవర్ ఎక్కువగానే ఉండనుంది.
ఇద్దరు బాలీవుడ్ హీరోలు
డబ్ల్యూపీఎల్ 2024 ఓపెనింగ్ కార్యక్రమం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 23న జరగనుంది. ఈ ఈవెంట్‍కు బాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దార్థ్ మల్హోత్రా, కార్తీక్ ఆర్యన్ రానున్నారు. ఈ సెర్మనీలో సిద్ధార్థ్, కార్తీక్ పర్ఫార్మెన్స్ చేయనున్నారు. ఈ విషయాన్ని డబ్ల్యూపీఎల్ అధికారికంగా ప్రకటించింది. మరికొంత మంది యాక్టర్లు, డ్యాన్సర్ల పర్ఫార్మెన్సులు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది.
గతేడాది డబ్ల్యూపీఎల్ ప్రారంభ వేడుకలో సిద్ధార్థ్ భార్య, బాలీవుడ్ స్టార్ కియారా అద్వానీ డాన్స్ అదరగొట్టారు. ఈసారి సిద్ధార్థ్ ఆర్యన్ పర్ఫార్మ్ చేయనున్నారు.
ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు
డబ్ల్యూపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు మొదలుకానుంది. స్పోర్ట్స్ 18 నెట్‍వర్క్ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. జియో సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ కూడా లైవ్ చూడొచ్చు. డబ్ల్యూపీఎల్ మ్యాచ్‍లు కూడా స్పోర్ట్స్ 18 ఛానెల్, జియో సినిమాలో లైవ్ వస్తాయి. అన్ని మ్యాచ్‍లు రాత్రి 7.30 గంటలకు షురూ కానున్నాయి.
డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీలో ముంబై ఇండియన్స్ ( కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్), ఢిల్లీ క్యాపిటల్స్ (కెప్టెన్ మెగ్ లానింగ్), గుజరాత్ జెయింట్స్ (కెప్టెన్ బెత్ మూనీ), రాయల్ చాలెంజర్స్ జట్టుకు (కెప్టెన్ స్మృతి మంధాన), యూపీ వారియర్స్ (కెప్టెన్ అలీసా హేలీ) జట్లు తలపడనున్నాయి.
ఓపెనింగ్ సెర్మనీ తర్వాత ఫిబ్రవరి 23వ తేదీన డబ్ల్యూపీఎల్ 2024 టీ20 టోర్నీ తొలి మ్యాచ్‍లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది 20 లీగ్ మ్యాచ్‍లు, ఓ ఎలిమినేటర్, ఫైనల్ జరగనున్నాయి. లీగ్ మ్యాచ్‍లు ఐదు జట్ల మధ్య రౌండ్ రాబిన్ పద్ధతిలో ఉంటాయి. పాయింట్ల పట్టికలో టాప్‍లో ఉండే జట్టు నేరుగా ఫైనల్‍కు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో ఉండే టీమ్‍లు ఎలిమినేటర్ ఆడి.. గెలిచిన టీమ్ ఫైనల్‍కు చేరుతుంది. మార్చి 17న ఢిల్లీ వేదికగా ఫైనల్ జరగనుంది.
గతేడాది డబ్ల్యూపీఎల్ 2023 తొలి ఎడిషన్‍లో ముంబై ఇండియన్స్ టైటిల్ కైవసం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రన్నరప్‍గా నిలిచింది. ఎలిమినేటర్లో యూపీ వారియర్స్ ఓడిపోగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈసారి టైటిల్ సాధించాలని అన్ని జట్లు పట్టుదలగా ఉన్నాయి.
సంబంధిత కథనం