WPL 2023 Final: డబ్ల్యూపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ముంబయి.. దిల్లీపై ఘనవిజయం.. టైటిల్ కైవసం-mumbai indians won womens premier league 2023 final match against delhi capitals ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wpl 2023 Final: డబ్ల్యూపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ముంబయి.. దిల్లీపై ఘనవిజయం.. టైటిల్ కైవసం

WPL 2023 Final: డబ్ల్యూపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ముంబయి.. దిల్లీపై ఘనవిజయం.. టైటిల్ కైవసం

Maragani Govardhan HT Telugu
Mar 27, 2023 01:11 PM IST

WPL 2023 Final: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌పై ముంబయి ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్‌ విజేతగా నిలిచి టైటిల్ సొంతం చేసుకుంది.

డబ్ల్యూపీఎల్ 2023 విజేతగా ముంబయి ఇండియన్స్
డబ్ల్యూపీఎల్ 2023 విజేతగా ముంబయి ఇండియన్స్ (AFP)

WPL 2023 Final: వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో(WPL) ముంబయి ఇండియన్స్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల ప్రీమియర్ లీగ్ తొలి టైటిల్‌ను ముంబయి జట్టు సొంతం చేసుకుంది. బ్రౌబర్న్ స్టేడియం వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌లో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. 132 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‌గా అవతరించింది. ముంబయి బ్యాటర్లలో న్యాట్ స్కైవర్ బ్రంట్(60) చివరి వరకు పోరాడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 37 పరుగులతో రాణించింది. దిల్లీ బౌలర్లలో రాధ యాదవ్, జెస్ జొనాసెన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

132 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ముంబయికి శుభారంభమేమి దక్కలేదు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్ యస్తిక భాటియాను(4) రాధ ఔట్ చేసింది. మరి కాసేపటికే మరో ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్‌ను(13) జొనాసెన్ పెవిలియన్ చేర్చింది. దీంతో 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ముంబయి. ఇలాంటి సమయంలో కెప్టెన్ హర్మన్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది న్యాట్. అయితే వెంట వెంటనే వికెట్లు పడటంతో ముంబయి బ్యాటింగ్ నిదానంగా సాగింది.

మరోపక్క దిల్లీ బౌలర్లు కూడా పొదుపుగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చారు. హర్మన్, న్యాట్ ఇద్దరూ నిలకడగా ఆడుతూ.. వికెట్ కోల్పోకుండా అడ్డుపడ్డారు. న్యాట్ ధాటిగా ఆడగా.. హర్మన్ నిలకడగా రాణించింది. వీరిద్దరూ మూడో వికెట్72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 17వ ఓవర్లో హర్మన్ రనౌట్ అవడంతో మూడో వికెట్ పడింది. చివరి వరకు ఇరు జట్లు మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది.

ముంబయి విజయానికి రెండు ఓవర్లలో 21 పరుగులు అవసరం కాగా.. జోనాసెన్ వేసిన 19వ ఓవర్‌లో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ ఓవర్లో 16 పరుగులు పిండుకుంది ముంబయి. న్యాట్ స్కైవర్ మూడు ఫోర్లు కొట్టి విజయాన్ని ముంబయి ఇండియన్స్‌కు చేరువచేసింది. చివరి ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. తొలి మూడు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది ముంబయి. మొత్తంగా 19.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ ల్యానింగ్ 35 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. ముంబయి బౌలర్లలో వాంగ్, హేలీ మ్యాథ్యూస్ చెరో 3 వికెట్లతో రాణించగా.. మేలీ కెర్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది.

Whats_app_banner