తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Funny Out In Cricket: ఒకే బంతికి ఒకేసారి.. మెయిన్ అంపైర్ వైడ్ ఇస్తే.. స్క్వేర్ లెగ్ అంపైర్ ఔట్.. రెండూ సరైనవే

Funny out in Cricket: ఒకే బంతికి ఒకేసారి.. మెయిన్ అంపైర్ వైడ్ ఇస్తే.. స్క్వేర్ లెగ్ అంపైర్ ఔట్.. రెండూ సరైనవే

Galeti Rajendra HT Telugu

16 December 2024, 19:29 IST

google News
  • Funny out in Cricket: బ్యాటర్‌ను తన తెలివితో మహేంద్రసింగ్ ధోనీ తరహాలో నేపాల్‌‌లో ఓ వికెట్ కీపర్ బోల్తా కొట్టించాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ ఇద్దరూ ఒకే సమయంలో రెండు నిర్ణయాలు ప్రకటించగా.. రెండూ కరెక్టే కావడం విశేషం. 

ఫన్నీ స్టంపింగ్
ఫన్నీ స్టంపింగ్

ఫన్నీ స్టంపింగ్

నేపాల్ ప్రీమియర్ లీగ్ (ఎన్పీఎల్)లో సోమవారం (డిసెంబరు 16) ఒక ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. కర్నాలీ యాక్స్, ఫార్ వెస్ట్ రాయల్స్ జట్ల ఈరోజు మ్యాచ్ జరగగా.. కర్నాలీ జట్టుకు చెందిన ఓ బ్యాటర్ కామెడీగా స్టంపౌట్ అయ్యాడు. ఈ ఔట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇద్దరూ అంపైర్లు.. రెండు నిర్ణయాలు

వాస్తవానికి స్పిన్నర్ వేసిన ఆ బంతిని మెయిన్ అంపైర్ వైడ్‌గా ఇచ్చాడు. ఆ బంతిని చేతుల్లోకి తీసుకోవడంలో కీపర్ విఫలమయ్యాడు. దాంతో బంతి ఎక్కడ ఉందో కనీసం చూసుకోకుండా పరుగు కోసం ప్రయత్నించిన బ్యాటర్.. స్టంపౌట్ అయ్యాడు. దాంతో ఒకే బంతికి.. ఒకే సారి మెయిన్ అంపైర్ వైడ్ ఇవ్వగా.. స్క్వేర్ లెగ్ అంపైర్ ఔట్ ఇచ్చారు.

ఫార్ వెస్ట్ జట్టు బౌలర్ హిమ్మత్ సింగ్ తన ఓవర్‌లోని ఆఖరి బంతిని లెగ్ సైడ్ వైడ్ రూపంలో విసిరాడు. దాంతో ఆ బంతిని హిట్ చేయడానికి ప్రయత్నించినా బ్యాటర్ బిపిన్ శర్మ విఫలమయ్యాడు. వికెట్ల వెనుక ఆ బంతిని చేతుల్లోకి తీసుకోవడంలో వికెట్ కీపర్ కూడా తొలుత ఫెయిలయ్యాడు. అయితే.. బంతి కీపర్ ఫ్యాడ్స్ మధ్యలో ఇరుక్కుంది.

బంతిని చూడకుండా పరుగు

కానీ.. బ్యాటర్ బిపిన్ శర్మకు బంతి ఎక్కడుందో తెలుసుకోలేకపోయాడు. బంతి వికెట్ కీపర్‌ను దాటి వెనక్కి వెళ్లిపోయింది అనుకుని.. పరుగు కోసం క్రీజు వెలుపలికి వచ్చాడు. అయితే.. కాళ్ల మధ్య ఇరుక్కుని ఉన్న బంతిని తీసుకున్న వికెట్ కీపర్ క్షణాల్లో బెయిల్స్ ఎగరగొట్టేశాడు. దాంతో ఆశ్చర్యపోయిన బిపిన్ శర్మ నిరాశగా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.

ధోనీని గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు

తెలివిగా బ్యాటర్‌ను బోల్తా కొట్టిస్తూ.. స్టంపౌట్ చేసిన వికెట్ కీపర్ ఎల్లో కలర్ జెర్సీ వేసుకుని ఉండటం.. అతని జెర్సీ నెంబరు కూడా 7గా ఉండటంతో అందరూ ధోనీతో పోలిక తెస్తున్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేసిన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ.. ఐపీఎల్ 2025 సీజన్ కోసం రూ.4 కోట్లకి ధోనీని రిటేన్ చేసుకున్న విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం