Rohit Sharma: కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డ్.. డే/నైట్ టెస్టు ఓటమితో ధోనీ, కోహ్లీ సరసన హిట్‌మ్యాన్
IND vs AUS 2nd Test: పింక్ బాల్ టెస్టులో భారత్ జట్టు ఓటమితో కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్‌లో ధోనీ, కోహ్లీ ఉండగా…?
కెప్టెన్‌గా రోహిత్ శర్మ చెత్త రికార్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం ముగిసిన డే/నైట్ టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. పింక్ బాల్‌తో జరిగిన ఈ టెస్టులో ఆస్ట్రేలియాకు కేవలం 19 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే భారత్ నిర్దేశించింది. దాంతో వికెట్ నష్టోపోకుండా ఆస్ట్రేలియా ఛేదించేసింది.
19 పరుగులే టార్గెట్
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేయగా.. ఆతిథ్య ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. దాంతో ఆస్ట్రేలియాకు 157 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే ఆలౌటైంది. దాంతో కేవలం 19 పరుగుల టార్గెట్ మాత్రమే ఆస్ట్రేలియా ముందు నిలిచింది.
1-1తో సిరీస్ సమం
ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌ను భారత్ జట్టు ఆడుతుండగా.. అడిలైడ్ ఓటమితో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. పెర్త్ వేదికగా నవంబరు చివర్లో జరిగిన తొలి టెస్టులో జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత్ జట్టు 295 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
సింగిల్ డిజిట్‌కే రోహిత్
రోహిత్ శర్మ భార్య రితిక రెండో బిడ్డకు జన్మనివ్వడంతో పెర్త్ టెస్టులో అతను ఆడలేకపోయాడు. అడిలైడ్ టెస్టుకు తిరిగి వచ్చిన రోహిత్ శర్మ.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కనీసం డబుల్ డిజిట్ స్కోరు కూడా చేయలేకపోయాడు.
ధోనీ, కోహ్లీ సరసన రోహిత్
అడిలైడ్ టెస్టులో భారత్ జట్టు ఓడిపోగా.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ జట్టు వరుసగా నాలుగో టెస్టులో పరాజయాన్ని చవిచూసింది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లోనూ వరుసగా టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో టెస్టుల్లో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన మూడో కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్‌లో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ఉన్నారు.
టెస్టుల్లో వరుసగా అత్యధిక పరాజయాలు చవిచూసిన భారత కెప్టెన్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే..
- ఎంఏకే పటౌడీ (1967-68) కెప్టెన్సీలో భారత్ జట్టు వరుసగా 6 టెస్టుల్లో ఓడిపోయింది.
- సచిన్ టెండూల్కర్ (1999-00) - 5 టెస్టుల్లో
- దత్తా గైక్వాడ్ (1959) -4 టెస్టుల్లో
- ఎంఎస్ ధోనీ (2011)- 4 టెస్టుల్లో
- ఎంఎస్ ధోనీ (2014)- 4 టెస్టుల్లో
- విరాట్ కోహ్లీ (2020-21) - 4 టెస్టుల్లో
- రోహిత్ శర్మ- (2024)- 4 టెస్టుల్లో