Where is Virat Kohli: అసలు విరాట్ కోహ్లి ఎక్కడ? మిగిలిన టెస్టులు ఆడతాడా?: కోచ్ ద్రవిడ్ ఏమన్నాంటే..
06 February 2024, 16:17 IST
- Where is Virat Kohli: విరాట్ కోహ్లి ఎక్కడ? ఇంగ్లండ్ తో జరగబోయే మిగిలిన మూడు టెస్టుల ఆడతాడా లేదా? ఇప్పుడు టీమిండియా అభిమానులను ఈ ప్రశ్నలే వేధిస్తున్నాయి. దీనిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు.
విరాట్ కోహ్లి మిగిలిన మూడు టెస్టులు ఆడటంపై స్పందించిన కోచ్ రాహుల్ ద్రవిడ్
Where is Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఎక్కడున్నాడు? ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలు అంటూ దూరంగా ఉన్న కోహ్లి.. మిగిలిన సిరీస్ కైనా అందుబాటులో ఉంటాడా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొదట అతని తల్లికి బాగా లేదని, తర్వాత విదేశాలకు వెళ్లాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు కోహ్లి ఎక్కడ అన్నది తెలియడం లేదు.
విరాట్ కోహ్లిపై ద్రవిడ్ ఏమన్నాడంటే?
ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో గెలిచిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. మరి ముందుగా చెప్పినట్లు కోహ్లి మూడో టెస్టుకు తిరిగి వస్తాడా అని ప్రశ్నించగా.. ఆ విషయం సెలెక్టర్లనే అడగాలని అతడు అనడం గమనార్హం. మిగిలిన మూడు టెస్టుల కోసం త్వరలోనే టీమ్ ను ఎంపిక చేయబోతున్నారు.
"సెలెక్టర్లనే ఆ ప్రశ్న అడిగితే బాగుంటుంది. మిగిలిన మూడు టెస్టుల కోసం జట్టు ఎంపికకు ముందు వాళ్లే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు. మేము కూడా ఆ విషయం మాట్లాడతాం. మరికొద్ది రోజుల్లో టీమ్ ఎంపిక ఉంటుంది. అతనితో మాట్లాడి ఆ విషయం తెలుసుకుంటాం" అని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. దీంతో కోహ్లి అందుబాటులో ఉండటంపై ఇప్పటికీ టీమ్ మేనేజ్‌మెంట్ కు కూడా స్పష్టత లేదని అర్థమవుతోంది.
మరోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి
వ్యక్తిగత కారణాలంటూ ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లి దూరంగా ఉన్నాడు. ఆ కారణం ఏంటన్నది ఎవరూ చెప్పకపోయినా.. కోహ్లి ప్రైవసీని గౌరవించాలని మాత్రం బీసీసీఐ కోరింది. తన తల్లికి బాగా లేకపోవడం వల్లే కోహ్లి ఈ బ్రేక్ తీసుకున్నట్లు వచ్చిన వార్తలను కోహ్లి సోదరుడు ఖండించాడు. ఆ తర్వాత రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు కోహ్లి అసలు దేశంలోనే లేడనీ వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి కోహ్లి ఎక్కడ అన్నది తెలియడం లేదు. అయితే అతని ఆర్సీబీ మాజీ టీమ్మేట్ ఏబీ డివిలియర్స్ స్పందిస్తూ.. కోహ్లి హ్యాపీగా ఉన్నాడని, తన ఫ్యామిలీతో సమయం గడుపుతున్నాడని వెల్లడించాడు. అంతేకాదు కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని కూడా రివీల్ చేశాడు. దీంతో అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి అని చాలా రోజులుగా వస్తున్న వార్తలు నిజమే అని తేలింది.
ఇండియా, ఇంగ్లండ్ సిరీస్
ఇక ఇండియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే రెండు టెస్టుల్లో చెరొక విజయంతో ఈ రెండు జట్లూ 1-1తో సమంగా ఉన్నాయి. మరో మూడు టెస్టులు జరగాల్సి ఉంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ రాజ్‌కోట్ లో జరగనుంది.
ఈ మ్యాచ్ కు ఇంకా చాలా సమయం ఉండటంతో ఇంగ్లండ్ టీమ్ అబుధాబి వెళ్లింది. మ్యాచ్ సమయానికి మళ్లీ ఆ టీమ్ ఇండియాకు తిరిగి రానుంది. మరోవైపు ఈ మూడో టెస్టుకు బుమ్రా దూరం కానున్నాడన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.