Dravid on KL Rahul: రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటరే.. వికెట్ కీపింగ్ ఆ ఇద్దరి బాధ్యతే: ద్రవిడ్-dravid on kl rahul says he is relieved from wicket keeping responsibilities ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dravid On Kl Rahul: రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటరే.. వికెట్ కీపింగ్ ఆ ఇద్దరి బాధ్యతే: ద్రవిడ్

Dravid on KL Rahul: రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటరే.. వికెట్ కీపింగ్ ఆ ఇద్దరి బాధ్యతే: ద్రవిడ్

Hari Prasad S HT Telugu
Jan 23, 2024 04:08 PM IST

Dravid on KL Rahul: ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ లో కేఎల్ రాహుల్ కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించడం లేదని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. దాని కోసం ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు ఉన్నట్లు చెప్పాడు.

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (PTI)

Dravid on KL Rahul: ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు కేఎల్ రాహుల్ కు ఇది ఊరట కలిగించే విషయమే. అతనిపై నుంచి వికెట్ కీపింగ్ బాధ్యతలు తొలగిపోయాయి. సౌతాఫ్రికా టూర్లో టెస్ట్ సిరీస్ లోనూ కీపింగ్ బాధ్యతలు చేపట్టిన రాహుల్ ను ఇంగ్లండ్ తో సిరీస్ లో మాత్రం స్పెషలిస్ట్ బ్యాటర్ గానే తీసుకున్నట్లు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు. దీనికోసం ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లను ఎంపిక చేసినట్లు తెలిపాడు.

ఆ ఇద్దరే వికెట్ కీపర్లు

ఇంగ్లండ్ తో స్వదేశంలో జరగబోతున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసిన టీమ్ లో ఇద్దరు వికెట్ కీపర్లకు చోటు దక్కింది. ఆంధ్రాకు చెందిన కేఎస్ భరత్ తోపాటు ధృవ్ జురెల్ తొలిసారి ఇండియన్ టీమ్ పిలుపు అందుకున్నాడు. దీంతో ఈ ఇద్దరిలో ఒకరే తుది జట్టులో ఉంటారని ద్రవిడ్ స్పష్టం చేశాడు. రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడనున్నాడు.

"రాహుల్ ఈ సిరీస్ లో వికెట్ కీపర్ గా ఆడటం లేదు. టీమ్ ఎంపికలోనే దీనిపై స్పష్టత ఇచ్చాం. మేము ఇద్దరు వికెట్ కీపర్లను ఎంపిక చేశాం. సౌతాఫ్రికా టూర్లో రాహుల్ ఈ బాధ్యతలను బాగా నిర్వర్తించాడు. సిరీస్ డ్రా చేయడంలో అతడు కీలకపాత్ర పోషించాడు" అని మంగళవారం (జనవరి 23) హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.

కోహ్లి లేకపోవడంతో ఆ ఇద్దరికీ ఛాన్స్

ఇంగ్లండ్ తో తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లి అందుబాటులో ఉండటం లేదు. దీంతో తుది జట్టులో కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరికీ చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా కనిపించనున్నాడు. అయితే తొలి టెస్టులో భరత్, జురెల్ లలో వికెట్ కీపర్ గా ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై ద్రవిడ్ స్పష్టత ఇవ్వలేదు.

నిజానికి ఇండియాలో పిచ్ లు స్పిన్ కు అనుకూలించడం వల్ల రెగ్యులర్ వికెట్ కీపర్ ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు తగినట్లే జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లను తీసుకున్నారు. ఇప్పుడు కీపింగ్ బాధ్యతలు లేకపోవడంతో రాహుల్ తన బ్యాటింగ్ పైనే దృష్టిసారించే వీలు కలిగింది.

ఇంగ్లండ్ బజ్‌బాల్‌కు చెక్ పెడతారా?

ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ గురువారం (జనవరి 25) నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు జట్లు ఇక్కడికి చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టాయి. ఇక ఇంగ్లండ్ బజ్‌బాల్ స్టైల్ టెస్ట్ క్రికెట్ కు ఈ సిరీస్ లో అసలుసిసలు సవాలు ఎదురు కానుంది.

స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై ఇంగ్లండ్ ఇదే స్టైల్ కు కట్టుబడి ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక వాళ్ల బజ్‌బాల్ దూకుడును ఇండియా స్పిన్నర్లు అడ్డుకోగలరా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. చివరిసారి ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియా వెళ్లినప్పుడు సిరీస్ గెలిచే అవకాశం ఉన్నా చివరికి 2-2తో డ్రా చేసుకుంది. అంతేకాదు చివరిసారి స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది కూడా ఇంగ్లండ్ చేతుల్లోనే. దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు రోహిత్ సేనకు దక్కింది.

Whats_app_banner