Shreyas Iyer: మళ్లీ నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వచ్చిన శ్రేయస్ అయ్యర్-shreyas iyer is kolkata knight riders captain says franchisee ceo ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shreyas Iyer: మళ్లీ నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వచ్చిన శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer: మళ్లీ నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వచ్చిన శ్రేయస్ అయ్యర్

Hari Prasad S HT Telugu
Dec 14, 2023 03:05 PM IST

Shreyas Iyer: ఐపీఎల్లో మరోసారి కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా తిరిగి వచ్చాడు శ్రేయస్ అయ్యర్. ఈ ఏడాది గాయం కారణంగా లీగ్ కు దూరమైన అతడు.. వచ్చే ఏడాది కేకేఆర్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టబోతున్నాడు.

కేకేఆర్ కెప్టెన్ గా తిరిగి వచ్చిన శ్రేయస్ అయ్యర్
కేకేఆర్ కెప్టెన్ గా తిరిగి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (IPL)

Shreyas Iyer: ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ గురువారం (డిసెంబర్ 14) తమ కెప్టెన్ పేరును అనౌన్స్ చేసింది. 2022లో కెప్టెన్ గా ఉండి.. ఈ ఏడాది గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ నే మరోసారి కెప్టెన్ గా నియమించింది. ఐపీఎల్ 2023లో శ్రేయస్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టిన నితీష్ రాణాను వైస్ కెప్టెన్ ను చేయడం గమనార్హం.

నితీష్ రాణా కెప్టెన్సీలో 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్ పెద్దగా రాణించలేదు. సీజన్ ను ఏడో స్థానంతో ముగించింది. రింకు సింగ్ లాంటి ప్లేయర్స్ మెరెపులు మెరిపించినా.. శ్రేయస్ అయ్యర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే ఈ ఏడాది ఆసియా కప్ తో గాయం నుంచి కోలుకొని మళ్లీ టీమిండియాలో అడుగుపెట్టిన శ్రేయస్.. టాప్ ఫామ్ లో ఉన్నాడు.

దీంతో వచ్చే సీజన్ లో మరోసారి అతనికే కెప్టెన్సీ అప్పగించాలని నిర్ణయించినట్లు కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ వెల్లడించారు. గత నెలలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ లోనూ ఆడిన అయ్యర్.. ఈ ఫార్మాట్ లోనూ చెలరేగాడు. "శ్రేయస్ గాయం కారణంగా ఐపీఎల్ 2023కు మిస్ కావడం దురదృష్టకరం. అతడు మళ్లీ కెప్టెన్ గా తిరిగి రావడం సంతోషంగా ఉంది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి పడిన కష్టం, తర్వాత ఫామ్ లోకి రావడం అతని వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది" అని వెంకీ మైసూర్ అన్నాడు.

తన కెప్టెన్సీని తిరిగి శ్రేయస్ కు అప్పగించడానికి అంగీకరించిన నితీష్ రాణాకు కృతజ్ఞతలు చెప్పారు. కేకేఆర్ జట్టు ప్రయోజనాల కోసం వైస్ కెప్టెన్ గా అన్ని విధాలా శ్రేయస్ కు నితీష్ అండగా ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక తనకు తిరిగి కెప్టెన్సీ రావడంపై శ్రేయస్ స్పందించాడు. తాను లేని సమయంలో టీమ్ బాధ్యతలను సమర్థంగా మోసిన నితీష్ రాణాపై ప్రశంసలు కురిపించాడు.

గతంలో రెండుసార్లు కేకేఆర్ ను ఐపీఎల్ విజేతగా నిలిపిన గౌతమ్ గంభీర్ కూడా ఫ్రాంఛైజీ మెంటార్ గా తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. గంభీర్, శ్రేయస్ కాంబినేషన్ లో వచ్చే సీజన్ లో తమ టీమ్ మళ్లీ గాడిలో పడుతుందని ఆ ఫ్రాంఛైజీ ఆశతో ఉంది.

Whats_app_banner